జగన్నాధుని రత్నభాండాగారం మిస్టరీ ఏమిటి ?

Sharing is Caring...
The Mystery Behind the Treasure ........................................

పూరీ జగన్నాథుని రత్నభాండాగారం తెరవాలనే డిమాండ్ మళ్ళీ వినిపిస్తోంది. పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఈ భాండాగారంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నఅంశంపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఖజానా గది తెరచి లెక్కింపు చేపట్టాలని ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. పురాతన నివేదికల్లోని  వివరాల మేరకు ఆభరణాలన్నీ ఉన్నాయా? అన్నది స్పష్టంచేయాలని కోరుతున్నారు. ఈ అంశం చాలా కాలంగా నలుగుతోంది. ఈ క్రమంలోనే కొద్దీ రోజుల క్రితం పూరీ ఆలయ యంత్రాంగానికి పురావస్తు శాఖ లేఖ రాసింది.

రత్న భాండాగారం తెరవాలని పురావస్తు శాఖ ఆలయ అధికారులకు సూచించింది.12వ శతాబ్దం నాటి ఈ భాండాగారం లోపలి స్థితిని అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాలని కోరింది.  ఈ మేరకు ఆలయ పాలనాధికారితో పాటు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసింది.

చివరిసారిగా 1978 లో ఈ భాండాగారాన్ని తెరిచారు. అప్పట్నుంచి భాండాగారం మూసివేసే ఉంది. ఈ తలుపులు తెరిచే అంశంపై అసెంబ్లీలో గతంలో చర్చ కూడా జరిగింది. చాలా కాలంగా రత్న భాండాగారం తెరవనందున లోపలి పరిస్థితి ఎలా ఉందన్నది ఎవరికి స్పష్టత లేదు.

జగన్నాథ దేవాలయం లోపల ఉత్తరం వైపున రత్నభాండాగారం ఉంది. ఇది 12 వ శతాబ్దం నాటిది.  జగన్నాధుని భక్తులైన  ‘మదాల పంజి’ రాజు అనంగభీమ దేవ్ 2,50,000 మధాల బంగారాన్ని (1 మధ=1/2 తోలా=5.8319 గ్రాములు)సమర్పించారు.

అలాగే సూర్యవంశీ నాయకులు జగన్నాథునికి విలువైన రత్నాలు,బంగారాన్ని సమర్పించారు. గజపతి కపిలేంద్ర దేవ్ 1466 ADలో బంగారం, రత్నాల ఆభరణాలు, కొన్ని బంగారు  పాత్రలను బహుమతిగా ఇచ్చారు. జగన్నాథ ఆలయంలోని దిగ్విజయ్ ద్వార్ పై ఈ వివరాలను పొందుపరిచారు.

స్వామి వారి ఖజానా కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఉన్నాయి.  అవి ‘భితర్ భండార్’ (ఇన్నర్ డిపాజిటరీ) ‘బహార్ ట్రెజరీ’ (అవుటర్ ట్రెజరీ). పైన చెప్పిన రాజులు సమర్పించిన బంగారాన్ని ఇన్నర్ డిపాజిటరీ లో ఉంచారు. తర్వాత కాలంలో కానుక గా వచ్చిన బంగారాన్ని , విలువైన ఆభరణాలను అవుటర్ ట్రెజరీ లో ఉంచారు.

1978లో రత్న భండార్‌ను చివరిసారి తెరిచినప్పుడు తయారు చేసిన జాబితా ప్రకారం దానిలో 12,831 ‘భారీ’ బంగారం, 22,153 ‘భారీ’ వెండి (ఒక భారీ అంటే 11.66 గ్రాములు) ఉన్నాయి. అయితే ఈ వస్తువుల విలువ గురించి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేదు. అదలా ఉంటే అసలు ఈ లెక్కలే కరెక్ట్ కాదనే విమర్శలు కూడా లేకపోలేదు.

1978 నుంచి 2018 వరకు భక్తులు సమర్పించిన విరాళాలు, మొక్కుల ద్వారా అందిన  బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల గురించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు. ఒరిస్సా అసెంబ్లీ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పై సమాచారం ఇచ్చారు.

ఇక 1984లో ఈ రత్న భాండాగారం తలుపులు తెరిచే సమయంలో తనిఖీ బృందం కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నదని అంటారు. రెండు ప్రవేశ మార్గాలను తెరిచిన తర్వాత, డిపాజిటరీ లోపల నుంచి  పాముల బుస గొడుతున్నట్టుగా   భయంకర శబ్దాలు వినిపించాయని … దీంతో పురావస్తు శాఖాధికారులు భయపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

కాగా 2018  ఏప్రిల్ 4న  హైకోర్టు ఆదేశాల మేరకు 16 మంది సభ్యుల తనిఖీ బృందం ఆలయ మరమ్మతు పనులు,  దాని నిర్మాణ స్థితిని పరిశీలించడానికి చేరుకుంది. ఈ బృందంలో ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి, పూరీ రాజు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, పురావస్తు శాఖ నిపుణులు ఉన్నారు. అదే సమయంలో ఇన్నర్ డిపాజిటరీ గది తాళాలు కనిపించకుండా పోయాయని తేలింది . జిల్లా ట్రెజరీలో నిబంధనల ప్రకారం అవి లేవని అధికారులు తేల్చారు.

ఈ తాళాల మాయమైన అంశంపై ప్రభుత్వం విచారణ కు ఆదేశించింది. తర్వాత ఏమైందో ఎవరికి తెలీదు. మొత్తం మీద జగన్నాధుని ఆస్తులు ఎంత ? లోపల బంగారం అసలు ఉందా ?లేదా అన్న అంశాలపై గందరగోళం నెలకొంది. మరో వైపు, పురావస్తు శాఖకు రాసిన లేఖ ఇంకా తాను చూడలేదని న్యాయశాఖ మంత్రి జగన్నాథ సారక అంటున్నారు. లేఖలో ఏముందో చూసుకుని తలుపులు ఎలా తెరవాలి? ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

భాండగారం తలుపులు తెరవాలంటే ఆలయ పాలకవర్గంతో పాటు న్యాయశాఖ కూడా అనుమతించాల్సి ఉంటుంది. రత్న భాండాగారం తెరవడం మంచిది కాదనే వాదన కూడా ఉంది. లోపల నుంచి పాముల బుసలు వినిపించడం,అధికారులు వెనక్కి రావడం, చాలా ఏళ్ళనుంచి భాండాగారం తెరవక పోవడాన్ని బట్టి ఇదేదో మిస్టరీ గా  ఉందనే  వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!