ఇన్నిరకాల గురువులున్నారా ?

Sharing is Caring...

Different types of teachers……….

గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన భక్తులను తయారు చేస్తారు వీరు.

వేద గురువులు .. వీరు వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరించేలా చేస్తారు వీరు.నిషిద్ద గురువులు అనగా సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను బోధిస్తారు వీరు. కామ్యక గురువులు అంటే ధర్మ దాతలుగా సప్త సాధనాలు బోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన శిష్యులను తయారు చేస్తారు.

బోధక గురువులు వేదాంత గ్రంధ పరిచయం చేస్తారు. బోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని అంటారు. నాద గురువులు .. వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు. చాయానిది గురువులు …. చాయానిది అనే ఒక పక్షి వుందట.

దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు. పరమ గురువులు … వీరు పరుసవేదిలా శిష్యులకు తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు.చందన గురువులు… వీరు చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు.

క్రౌంచక గురువులు … దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగ గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట. అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చేయగలరు.వాచక గురువులు … వీరు సాంఖ్య ఉపదేశాలు బోధించి, పరమాత్మ సత్యమని, దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.

కారణ గురువులు …. వీరు ఆసనాలు, ప్రాణాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం తో అద్వైత స్థితిని కలిగిస్తారు.సద్గురువులు .. వీరు గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు. నిజ గురువులు….. పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు. ఇలాంటి గురువులు ఇప్పుడు లేరు. ఇక వ్యాసుని తర్వాత శంకరా చార్యులను, దత్తాత్రేయుడ్ని, షిర్డీ సాయిబాబా ను కూడా గురువులుగా భావించి ఆరాధిస్తుంటారు.

హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళి అంతా గురువుగా భావిస్తారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేశారు కాబట్టి ఆయనను వేదవ్యాసుడిగా పిలుస్తారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటారు.షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు చేస్తారు.

శైవ సంప్రదాయం ప్రకారం, జగత్తుకు ఆదియోగి అయిన పరమశివుడు ఈ ఆషాఢ పౌర్ణమి నాడే ‘ఆదిగురువు’గా మారి సప్తరుషులకు (ఏడుగురు మహర్షులకు) యోగ శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. ఈ రోజుతోనే లోకంలో గురు-శిష్య పరంపర మొదలైంది.

త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజు కూడా ఇదే. ఈ పర్వదినాన షిరిడీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, శంకరాచార్యులు వంటి ఆధ్యాత్మిక గురువుల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గురు వందనాలు నిర్వహిస్తారు.

సన్యాసులు, మునులు ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు. వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఒకే చోట ఉంటూ, ఆధ్యాత్మిక సాధన చేస్తూ, భక్తులకు జ్ఞానబోధ చేస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత, సారనాథ్‌లోని జింకల వనంలో తన మొదటి ఐదుగురు శిష్యులకు తొలి ధర్మబోధ (ధమ్మచక్కపవత్తన సుత్త) చేసింది ఈ పౌర్ణమి నాడే.

జైన తీర్థంకరుడైన మహావీరుడు, కేవల జ్ఞానం పొందిన తర్వాత ‘గౌతమ స్వామి’ని తన మొదటి శిష్యుడిగా స్వీకరించి, తానే ఒక గురువుగా మారిన రోజు ఇది.. రోజున మనకు అక్షరాలు నేర్పిన గురువుల నుంచి జీవితాన్ని మార్చిన ఆధ్యాత్మిక గురువుల వరకు అందరినీ స్మరించుకుని కృతజ్ఞతలు చెప్పాలి. వీలైతే వారిని కలిసి ఆశీస్సులు తీసుకోవాలి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!