Protest against British monopoly……………….
మహాత్మా గాంధీ చేపట్టిన చారిత్రాత్మక దండి యాత్ర పూర్తయి ఇవాళ్టి కి 96 ఏళ్లు నిండాయి. ఈ యాత్ర 1930 మార్చి 12న ప్రారంభమై, 1930 ఏప్రిల్ 6న దండి తీరానికి చేరుకోవడంతో ముగిసింది.
దండి యాత్ర లక్ష్యాలు…
ఈ యాత్ర ప్రధానంగా బ్రిటిష్ ప్రభుత్వ అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు తయారీ, విక్రయాలపై విధించిన ఏకస్వామ్యాన్ని (Monopoly) నిరసించడం ..ఉప్పుపై వేసిన భారమైన పన్నును తొలగించమని డిమాండ్ చేయడం. సొంతంగా ఉప్పును తయారు చేయడం..బ్రిటిష్ వారి మెడలు వంచి, దేశవ్యాప్తంగా పౌర నిరాకరణ లేదా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఇది ఒక వేదికగా నిలిచింది.
ఉప్పు అనేది ధనిక,పేద అనే తేడా లేకుండా అందరికీ అవసరమైన వస్తువు. కాబట్టి, ఈ అంశం ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయడం గాంధీజీ వ్యూహం.హింసకు తావులేకుండా, కేవలం క్రమశిక్షణ, అహింసా మార్గంలో కూడా శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎదిరించవచ్చని ప్రపంచానికి గాంధీ చాటి చెప్పారు.
ఈ యాత్రలో గాంధీజీతో 78 మంది అనుచరులు పాల్గొన్నారు. 24 రోజుల పాటు దండి యాత్ర సాగింది. 1930 మార్చి 12న సబర్మతీ ఆశ్రమం (అహ్మదాబాద్) నుండి మొదలైంది.1930 ఏప్రిల్ 5 సాయంత్రానికి దండి చేరుకుని, ఏప్రిల్ 6 ఉదయం ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. మొత్తం 241 మైళ్లు (సుమారు 388 కిలోమీటర్లు) కాలినడకన ప్రయాణించారు.
ప్రతిరోజూ సగటున 10 నుండి 15 మైళ్లు నడిచేవారు. తెల్లవారుజామున 6:30 గంటలకే ప్రయాణం మొదలయ్యేది. గాంధీ దారిలో గ్రామస్తులతో మాట్లాడేవారు. సాయంత్రం ప్రార్థనలు, భజనలతో సభలు నిర్వహించేవారు.
గాంధీజీ ఏ గ్రామంలోకి ప్రవేశించినా, ప్రజలు రోడ్లను శుభ్రం చేసి, తోరణాలతో అలంకరించేవారు. ఈ 24 రోజుల్లో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో చేరారు. గాంధీజీ ప్రసంగాల ప్రభావంతో గ్రామాలలోని ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించడం, మద్యం మానేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
యాత్రలో ఉన్నవారు చాలా సాదాసీదా ఆహారం తీసుకునేవారు. పండ్లు, పాలు, రొట్టెలు ప్రధాన ఆహారంగా ఉండేవి. రాత్రిపూట చెట్ల కింద లేదా గ్రామాల్లోని ధర్మశాలల్లో బస చేసేవారు. సౌకర్యాల కంటే లక్ష్యం మీదే అందరికీ ధ్యాస ఉండేది.
ఈ 24 రోజుల్లో ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అమెరికాలోని ‘టైమ్’ పత్రిక వంటి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు గాంధీజీతో పాటు నడిచి రిపోర్టింగ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం మొదట ఈ యాత్రను తక్కువ అంచనా వేసినప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న జనసందోహాన్ని చూసి హడలిపోయింది.
ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6:30 గంటలకు గాంధీజీ సముద్ర స్నానం ఆచరించి, తీరంలో ఉన్న గుప్పెడు ఉప్పును చేతిలోకి తీసుకుని “దీనితో నేను బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలిస్తున్నాను” అని ప్రకటించారు.
ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే, దండి యాత్ర ముగిసిన వెంటనే ఆయన్ని అరెస్టు చేయలేదు. 1930 మే 4వ తేదీ అర్థరాత్రి (మే 5 తెల్లవారుజామున) ఆయన్ని అరెస్టు చేశారు.దండికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కరాడి అనే గ్రామంలో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎటు వంటి విచారణ లేకుండానే ఆయన అక్కడ సుమారు 9 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.

