Election time has come……………….
ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయా ? అంటే అలా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 18 నుండి 22 వరకు జరగబోయే పార్లమెంటుప్రత్యేక సమావేశాల్లో క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లే. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయని ఇంతవరకు అందరూ భావిస్తున్నారు. వచ్చే అక్టోబరు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ఎన్నికల నగారా మోగుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణాతో పాటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకూ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తెలంగాణాకు డిసెంబరులో ఎన్నికలు జరగాలంటే అక్టోబరు 10 లోపు నోటిఫికేషన్ విడుదల కావాలి. 2024 ఏప్రిల్ మే నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఈ డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం.
జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించుకోవడం కోసమే ఈ నెల 18 నుండి అయిదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఢిల్లీ వర్గాల నుండి మంత్రి కి ఏదైనా సమాచారం అంది ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిశా,అరుణాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణా,రాజస్థాన్,మధ్య ప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, మిజోరం ఎన్నికలు కూడా జరుగుతాయనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది.
అంటే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు ఉంటాయన్నది రాజకీయ పండితుల జోస్యం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీ తెలంగాణాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ విధంగా 2019 ఏప్రిల్ లో జరగాల్సిన తెలంగాణా ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
జమిలి ఎన్నికల ఆలోచన దృష్ట్యా ఈ సారి తెలంగాణా ఎన్నికలు షెడ్యూలు కన్నా నాలుగైదు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి ఏర్పాట్లు చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.దేశం మొత్తం జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరగవచ్చు.