Telangana Tourism……..
తెలంగాణ టూరిజం సంస్థ తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన వీకెండ్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు తో పాటు సమీపంలోని దర్శనీయ ప్రాంతాలను చూడొచ్చు. ఈ ట్రిప్ ఒక్కరోజులోనే ముగుస్తుంది.
హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను సంస్థ ఆపరేట్ చేస్తోంది. కేవలం రూ. 800 టికెట్ ధరలోనే ఆ ప్రాంతాలను చూసి రాత్రికి మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు. ట్రిప్ ఉదయం నుంచి సాయంకాలం వరకు సాగుతుంది. ప్రతి శనివారం, ఆదివారం ల్లో మాత్రమే ఈ ప్యాకేజీ టూర్ అందుబాటులో ఉంటుంది. ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.
ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి నాన్ ఏసీ బస్సు బయలు దేరుతుంది. 8 గంటలకు బస్సు బషీర్ బాగ్ కు చేరుతుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు వెళుతుంది. ఉదయం 11:40 గంటలకు బుద్ధవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు.
ఆసియా ఖండంలోనే ఈ బుద్ధ వనం పెద్దది. సుమారు 100 కోట్ల రూపాయలతో 247 ఎకరాల్లో నిర్మించిన ఈ బౌద్ధక్షేత్రం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్ర సందర్శన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. అనంతరం నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఏర్పాటు చేస్తారు. ఈ బోట్ టూర్ కొత్త అనుభూతినిస్తుంది
అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ ను చూస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను చూపిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం ప్రాజెక్ట్ అంతా నీటితో కళకళ లాడుతోంది. ఈ సీజన్ లో అక్కడ వాతావరణం ఆహ్లదకరం గా ఉంటుంది.
సాయంకాలం 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తారు. ఫుడ్, బోటింగ్, ఎంట్రీ ఫీజులు పర్యాటకులు భరించాల్సి ఉంటుంది. పెద్దలకు రూ. 800 .. పిల్లలకు రూ. 640 ఛార్జీల నిమిత్తం చెల్లించాలి. ఇతర వివరాలు https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చూడవచ్చు.