Ramana Kontikarla …………………..
ఫొటోలో కనిపించే వ్యక్తి పశ్చిమబెంగాల్ జల్పాయ్ గురి జిల్లా రాజాదంగాకు చెందిన కరీముల్లా హక్… తేయాకు తోటల్లో పనిచేసే ఓ మామూలు కార్మికుడు. స్థానికంగా కరీముల్లాను బైక్ అంబులెన్స్ దాదా అని ముద్దుగా పిలుస్తారు.
తన ఊరు రాజాదంగా, పక్కనే ఉన్న దలాబరీ అనే గ్రామంతో పాటు.. చుట్టుపక్కల పల్లెలకు కూడా అంబులెన్స్ సర్వీసంటే.. కరీముల్లా హకే. తన బైకునే అంబులెన్స్ గా మార్చిన కరీముల్లా అందిస్తున్న సేవలకు యావత్ భారతం అబ్బుర పడింది. అభినందనలు చెప్పింది. భారత ప్రభుత్వం 2017లోనే కరీముల్లాను పద్మశ్రీతో సత్కరించింది.
తన ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ గా ఎందుకు మార్చాడు ?
అది 1995.. తన తల్లి గుండె పోటుకు గురైంది. ఊళ్లో ఉన్న ప్రతి ఇంటి తలుపు తట్టాడు. ఎక్కడా ఒక్క వాహనం కూడా దొరకలేదు. అంబులెన్స్ లేదు. రాదు.అసలు ఆ ఊరికి అంబులెన్స్ అనే పదమే పరిచయం లేదు. ఆ పరిస్థితుల్లో తన తల్లిని ఆసుపత్రికి తరలించలేక తల్లడిల్లి పోయాడు కరీముల్లా.. చూస్తుండగానే తల్లి అసువులు బాసింది.
తన నిస్సహాయతతో కళ్లముందే తల్లి చనిపోయిన దైన్యం అతగాడిని ఎంతగానో కలిచి వేసింది. తన ఊరితో పాటు.. చుట్టుపక్కల ఊళ్లల్లో ఇలాంటి మరణాలే. తన తల్లి లాగా కనీస మౌలిక సదుపాయల్లేక… ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో వైద్య సదుపాయం లేక, అంబులెన్సులు వచ్చే రోడ్జు మార్గం లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.
ఇవన్నీ కరీముల్లా హక్ ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. ఓరోజు తాను పనిచేస్తున్న తేయాకు తోటలో… తన సహచర కార్మికుడు కూడా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆ సమయంలో కరీముల్లా వెంటనే స్పందించి అక్కడ పనిచేస్తున్న వారిని బైక్ అడిగి.. ఆ బండిపై తన స్నేహితుణ్ని వెనక్కి కట్టి.. వాగులు, వంకలు, అడవులు దాటుతూ ఎలాగోలా ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాలను కాపాడాడు. సరిగ్గా ఆ సమయంలోనే కరీముల్లాలో తానో ద్విచక్ర వాహనాన్ని కొని అంబులెన్స్ గా మార్చేస్తే… ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది.
అదిగో అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే.. బైక్ అంబులెన్స్. ఎవరైనా తన కోసం బైక్ కొనుక్కుంటారు. కానీ, కరీముల్లా తన గ్రామంతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం కోసం ఓ ద్విచక్ర వాహనాన్ని అదీ లోన్ తీసుకుని కొనుగోలు చేశాడు. అలా 1998లో తన మోటార్ బైక్ అంబులెన్స్ కు ఓ స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తన గ్రామంతో పాటు.. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు అంబులెన్స్ సేవలను అందివ్వడం మొదలు పెట్టాడు.
25 మైళ్ల దూరం వెళితేనే ఆసుపత్రి సదుపాయం లేని అక్కడి చుట్టుపక్కల ఊళ్ల ప్రజానీకానికి… ప్రథమ చికిత్స అందించే ఏర్పాటు చేసుకున్నాడు.. 2018లో బజాజ్ ఆటో వారి సాయంతో వాటర్ ప్రూఫ్ స్ట్రెచర్, పోర్ట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వంటివి కూడా ఏర్పాటు చేసాడు. తాను అందించే సేవలను మరింతగా పెంచాడు.
తేయాకు తోటల్లో కార్మికుడిగా కరీముల్లాకు వచ్చేదే 5 వేల జీతమైతే.. అందులో ఆయన ఖర్చు కూడా ఎక్కువగా ఆంబులెన్స్ సేవలపై పెట్టడం అతని మానవీయ కోణానికి నిదర్శనం. ఇద్దరు కొడుకుల్లో ఒకరు తమలపాకుల దుకాణం నడుపుతుంటే.. మరో కుమారుడు సెల్ ఫోన్స్ రిపేరింగ్ షాప్ నడుపుతుంటాడు. ఇద్దరు బిడ్డలకు ఎలాగోలా పెళ్లిళ్లూ చేసేశాడు. ఇక తన జీవిత సార్థకత.. అంబులెన్స్ దాదాగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ.. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటమే.
ఇప్పటివరకూ సుమారు 7 వేల మంది ప్రాణాలను కాపాడాడు కరీముల్లా. ఆసుపత్రులకు వాగులు, వంకలు, పొలాల మధ్య నుంచి రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల నుంచి తరలించి కాపాడిన కరీముల్లా.. కోవిడ్ సమయంలో చేసిన సేవలు యావత్ దేశం మొత్తానికీ స్ఫూర్తి నిచ్చాయి.
సాధారణంగా దేశ ప్రధానితో సెల్ఫీ తీసుకోవడానికి ఎవరైనా క్రేజ్ చూపిస్తారు. కానీ, ప్రధాని మోడీనే కరీముల్లాతో సెల్ఫీ కోసం క్రేజ్ కనబర్చడం విశేషం. 2018లో రాష్ట్రపతి కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నాక.. సాయంత్రం వేళ.. మోడీనే కరీముల్లాతో సెల్ఫీ దిగాడు.
2019లో బైక్- అంబులెన్స్ దాదా పేరుతో కరీముల్లా బయోగ్రఫీని బిస్వజిత్ ఝా అనే జర్నలిస్ట్ రాయడంతో.. కరీముల్లా హక్ స్టోరీ మరింత మందికి చేరువైంది. త్వరలో కరీముల్లా జీవిత కథ తో ఏకంగా ఓ సినిమా కూడా రాబోతుంది.టెడ్ ఎక్స్ టాక్ షోలోనూ తనదైన శైలిలో తన సామాజిక వైద్యసేవపై తనకు తెలిసింది మాట్లాడి మన్ననలందుకున్నాడు. అలాగే, 2021లో అమితాబ్ నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ కౌన్ బనేగా కరోడ్ పతి లో.. ప్రముఖ నటుడు సోనూసూద్ తో కలిసి పాల్గొన్నాడు.
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే… మానవత్వానికి ఓ ప్రతీక…. ఈ కరీముల్లా హక్!