డైరెక్టర్ గోపాల్ సాయంతో …ఆజాద్ పెద్ద డాక్టర్ అయ్యాడు !!

Sharing is Caring...

Bhavanarayana Thota ……………..

రీవైండ్2004 …

నిన్ననటుడు రచయిత పోసాని కృష్ణమురళి ఒక రైతు కుటుంబాన్నిఆదుకున్నవిషయం చెప్పుకున్నాం. ఇవాళ అలాంటిదే మరో సంగతి చెప్పుకుందాం.. అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థికి మెడిసిన్ లో సీట్ వచ్చినా, చదువుకు అవసరమైన డబ్బు లేక ఇంటిదగ్గరే ఉండిపోయాడని అప్పటి జెమినీ టీవీ రిపోర్టర్ వెంకటేష్ ఒక వార్త పంపారు.

ఆ విద్యార్థి పేరు చంద్రశేఖర్ ఆజాద్. వాళ్ళ నాన్న కృష్ణమూర్తి ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా దగ్గర చెరుకు రసం బండి నడుపుతారు. ఆ రోజుల్లో ఎంట్రన్స్ లో పాసైన వాళ్ళకే రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్ దొరికేది. అలాంటి చోట సీట్ సంపాదించుకొని మెరిట్ స్టూడెంట్ గా ఎదిగిన ఆజాద్ కు ఇంటర్ లో ఒక కార్పొరేట్ కాలేజ్ ఉచితంగా సీటిచ్చింది. ఆ తరువాత మెడికల్ ఎంట్రన్స్ లో మంచి రాంకు వచ్చింది.

అందుకే రాంకర్ల మొదటి ఛాయిస్ అయిన ఉస్మానియాలో సీటు రెడీగా ఉంది. కానీ ఆ మాత్రం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఆ కుటుంబానిది. తండ్రితోబాటు పనిచేయటం మినహా చేయగలిగేదేమీ లేదని ఆ రోజు ఆజాద్ చెప్పిన మాటలు తేజా టీవీ వార్తాకథనంలో ప్రసారమయ్యాయి.ఆ వార్త ప్రసారమైన కొద్ది గంటలకే నాకొక మెయిల్ వచ్చింది.

నిమ్మగడ్డ ఫౌండేషన్ ఆ విద్యార్థి చదువు ఖర్చు భరించటానికి సిద్ధంగా ఉన్నట్టు నిమ్మగడ్డ ప్రసాద్ పేరుతో ఉంది ఆ మెయిల్. పన్నెండేళ్ళు మద్రాసులో ఉండి అప్పటికి కొద్ది నెలలకిందటే హైదరాబాద్ వచ్చిన నాకు ఆయనే మాట్రిక్స్ ప్రసాద్ గారని కూడా తెలియదు. ఆయన స్పందనకు కృతజ్ఞతలు చెబుతూ, ఆ విద్యార్థి పూర్తి వివరాలు, అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ కూడా మా రిపోర్టర్ ను అడిగి తెలియజేశా. పనిలో పనిగా మా రిపోర్టర్ వెంకటేష్ నెంబర్ కూడా ఇచ్చా.

కానీ మరుసటి రోజు ఉదయమే డైరెక్టర్ బి. గోపాల్ మా జెమినీ డైరెక్టర్ కిరణ్ గారితో ఉన్న పరిచయం కారణంగా మరింత వేగంగా స్పందించారు. ఆ ఊరికి వెళ్ళి చంద్రశేఖర ఆజాద్ ను ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్ళి చేర్పించారు. ఇదే విషయం నిమ్మగడ్డ ప్రసాద్ గారికి మెయిల్ చేసి చెప్పా.

ప్రకాశం జిల్లా ఎం. నిడమానూరులో పుట్టి, ఒంగోలు శర్మా కాలేజ్ లో చదివి మద్రాసులో డైరెక్టర్ గా ఎదిగిన బి. గోపాల్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. ఆ రోజు ఆయన స్పందన వల్ల ఒక చురుకైన విద్యార్థి మెడిసిన్ లో అద్భుతంగా రాణించారు. ఎంబీబీఎస్ మాత్రమే కాదు…ఎంఎస్ జనరల్ సర్జరీలోనూ, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీలోనూ గోల్డ్ మెడల్ సాధించారు ఆజాద్. ఇప్పుడాయన హైదరాబాద్ ఎం ఎన్ జె కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో ప్రొఫెసర్.

*****

ఒక మిత్రుడి ద్వారా నెంబర్ సంపాదించి ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకోగానే చాలా ఉద్విగ్నతకు, ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇద్దరం రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ కావటం కూడా మా పరిచయాన్ని మరింత బలోపేతం చేసి చాలాసేపు మాట్లాడుకునేట్టు చేసింది. ఆరోజు వార్త ప్రసారం కావటం తన జీవితంలో మరువలేనిదన్నారు. పదే పదే థాంక్స్ చెప్పటం ఆయన మంచితనానికి గుర్తు. తన మూలాలు మరచిపోకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్టు చెప్పారు.

సాధారణంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ప్రైవేటు హాస్పిటల్స్ లో పనిచేయటానికే ఎక్కువ మొగ్గు చూపుతారు గాని చంద్రశేఖర్ అజాద్ మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి ప్రాధాన్యం ఇవ్వటం ఆయన ఆలోచనాధోరణికి అద్దం పట్టింది. అనుభవం పెరగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్ గా కొన్ని గంటలు సేవలందిస్తున్నారు.

తాను ఎదుర్కున్న పరిస్థితులు తెలుసు కాబట్టి సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక పేద విద్యార్థినికి మొత్తం ఎంబీబీఎస్ చదువుకు, మరో పేద విద్యార్థికి బీటెక్ చదువుకు పూర్తి స్థాయిలో స్పాన్సర్ చేస్తున్న సంగతి మాటల సందర్భంలో చెప్పారు. ఆయన భార్య కూడా ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్. బి. గోపాల్ గారితో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని కూడా చెప్పారు డాక్టర్ ఆజాద్.

*****

ఈ రెండూ 2004 లో తేజా టీవీలో వేసిన వార్తల ఫలితమే. ఇలాంటివి చాలా ఉంటాయి గాని ఫాలో అప్ చేయటం వల్ల తెలుస్తాయి. ఒక వార్త వల్ల ఎంత మేలు జరిగే అవకాశముందో చెప్పటానికి ఈ రెండు ఘటనలూ ఉదాహరణలు మాత్రమే. జర్నలిస్టులకు కాస్త కిక్కిచ్చేది ఇలాంటి సందర్భాలే.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!