వారసుడు గెలుస్తాడా ?

Sharing is Caring...

 Tough fight…………

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, చెన్నైలోని చేపాక్-తిరువల్లికేణి (Chepauk-Thiruvallikeni) నియోజకవర్గం లో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఉదయనిధి పై ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. 

ఈ నియోజకవర్గం DMK కి  పటిష్టమైన స్థానం. గతంలో దివంగత నేత ఎం. కరుణానిధి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.ఇక్కడ మొత్తం 41 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

2021 ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఇక్కడి నుండి 69,355 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు (మహిళలకు రూ. 1000 సహాయం, ఉచిత ల్యాప్‌టాప్‌లు వంటివి) తమను మళ్ళీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉదయనిధిపై ఏఐఏడీఎంకే తరపున అధిరాజారామ్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు.ఈయన ఏఐఏడీఎంకే పార్టీలో సీనియర్ నేత. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గతంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌పై కొళత్తూరులో పోటీ చేసిన అనుభవం ఉంది. నియోజకవర్గంలోని మత్స్యకారులు, బ్రాహ్మణ ఓటర్లు,  మురికివాడల కార్మికులు డీఎంకే పాలనపై అసంతృప్తితో ఉన్నారని, అది తనకు కలిసి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.  

TVK పార్టీ తరపున డి.సెల్వం బరిలో ఉన్నారు. యువత  మార్పు కోరుకునే ఓటర్లపై ఈ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి TVK పార్టీలో చేరారు. సీమన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి తరపున ఆయిషా బేగం పోటీ చేస్తున్నారు. ఈమె ముస్లిం ఓటర్లను ఆకర్షించవచ్చు. 

చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గం డీఎంకేకి బలమైన కోట అయినప్పటికీ ఈసారి పరిస్థితిలో కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో లేనంత పోటీ నెలకొన్నది. ఈ నియోజకవర్గం విభిన్న సామాజిక వర్గాల కలయిక.ఇక్కడ ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. వీరు సంప్రదాయబద్ధంగా డీఎంకే మద్దతుదారులుగా ఉన్నారు.

ట్రిప్లికేన్ (తిరువల్లికేణి) ప్రాంతంలో బ్రాహ్మణ సామాజిక వర్గం, చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. బకింగ్‌హామ్ కెనాల్ పరిసరాల్లోని మురికివాడల్లో నివసించే శ్రామిక వర్గం భారీ సంఖ్యలో ఉన్నారు.సాధారణంగా డీఎంకేకి అనుకూలంగా ఉండే  ఈ వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  

ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నా, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఓటర్లను వేధిస్తున్నాయి..మురికివాడల నివాసితులకు శాశ్వత నివాస పట్టాలు లేకపోవడం..ఎప్పుడైనా ఖాళీ చేయిస్తారనే భయం ప్రధాన సమస్య.ఇరుకైన వీధులు, తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్ స్థలాల కొరత ట్రిప్లికేన్ వాసుల ప్రధాన ఫిర్యాదు.

వర్షాకాలంలో నీరు నిలవడం,పాత డ్రైనేజీ వ్యవస్థ వల్ల కలిగే ఇబ్బందులు ఇంకా పూర్తిగా తొలగలేదు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదని పౌరులు వాపోతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి గత ఐదేళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉదయనిధి కొన్నిచర్యలు చేపట్టారు.

మ్యాన్‌హోల్స్ శుభ్రం చేయడానికి తమిళనాడులోనే మొదటిసారిగా తన నియోజకవర్గంలో రోబోటిక్ మెషీన్లను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు,మినీ స్టేడియం పనులు ప్రారంభించారు.

మెట్రో వాటర్ పైప్‌లైన్ల విస్తరణ .. తుపాను సమయంలో సహాయక చర్యల్లో ఉదయనిధి చురుగ్గా పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, మహిళలకు ఆర్థిక సహాయం అందించడంలో తనవంతు పాత్ర పోషించారు. 

మొత్తానికి, వారసత్వం, అభివృద్ధి పనులు ఉదయనిధికి అనుకూలంగా ఉన్నా,మౌలిక సమస్యలు, గట్టి పోటీ కారణంగా గెలుపు కోసం ఆయన క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఉదయనిధి స్టాలిన్‌పై పోటీ చేస్తున్న ప్రత్యర్థులు రాజకీయంగా అనుభవం ఉన్నవారే కావడంతో ఈసారి గెలుపు గతమంత సులభం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఓటింగ్ ఏప్రిల్ 23, 2026న జరగనుంది. ఫలితాలు మే 4, 2026న వెలువడనున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!