ఇదే దూకుడు కొనసాగిస్తారా ?

Sharing is Caring...

Huzurabad effect………………………………….

హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం కేసీఆర్ బీజేపీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. బీజేపీ తో అమీతుమీ తేల్చుకునే రీతిలో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు.అదే సమయంలో బీజేపీ నేతలు కూడా దూకుడు మరింత పెంచారు.హుజురాబాద్ గెలుపు తాలూకూ ఊపును 2023 ఎన్నికల వరకు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.

మరో ఒకటి రెండు ఉప ఎన్నికలు రావచ్చని .. అందులో కూడా విజయం సాధిస్తే ఇక తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రెండు పార్టీలు కూడా ప్రజలను దృష్టిని ఆకర్షించే దిశగా వ్యూహ రచన చేస్తున్నాయి. కాంగ్రెస్ ఈ రేసులో కొంత వెనుకబడింది. ప్రస్తుతం వరి పంట.. ధాన్యం కొనుగోళ్ల పై రచ్చ రభస నడుస్తున్నాయి. బీజేపీ తెరాస పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఈ ధోరణి కింది స్థాయి నేతలకు పాకింది.ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన ను తెరాస శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మిర్యాలగూడలో సంజయ్  కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

కేసీఆర్‌ ఆదేశాలతోనే తనపై దాడి జరిగిందని బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు. పంట కొనాలని అడిగితే కొట్టిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ తెరాస ల మధ్య ఇదే తంతు నడుస్తోంది. తీవ్ర స్థాయిలో తనపై విమర్శలు చేస్తున్న సంజయ్ నే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు.పలు అంశాలపై కేంద్ర సర్కార్ పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.

వడ్లు కొంటుందో లేదో దమ్ముంటే కేంద్రంతో చెప్పించాలని సవాల్  విసురుతూ సీఎం కేసీఆర్.. మంత్రులు  గురువారం మహా ధర్నా చేయబోతున్నారు. రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని గడువు కూడా విధించారు.బీజేపీ ని ఇరుకున పెట్టె విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.ఈ ప్రశ్నకు కేంద్రం ఏ సమాధానం చెబుతుందో చూడాలి.

అవసరమైతే కేసీఆర్ ఢిల్లీ లో కూడా ధర్నా చేసేందుకు సిద్ధమౌతున్నారు. రైతు సంక్షేమమే తెరాస ఎజెండా అని కేసీఆర్ చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కూడా వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. హుజురాబాద్ ఫలితం తర్వాత కేసీఆర్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ఎంతకాలం కొనసాగుతుంది ? కేంద్ర విధానాలపై పోరాట వైఖరినే కేసీఆర్ పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా లేదా అనేది కొంత కాలం పోతే కానీ తేలదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!