డెత్ మిస్టరీ వీడేనా ?

Sharing is Caring...

The mystery continues…………………………

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు.

ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ కూడా ఉన్నది. 2016 సెప్టెంబరు 22న నాటి సీఎం జయలలిత అపస్మారక స్థితిలో చెన్నయ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, డీ హైడ్రేషన్ ల తో ఆసుపత్రిలో చేరారన్నారు కానీ ఎవరూ ఏం చెప్పలేదు. అన్నీ రహస్యంగానే జరిగిపోయాయి.

అప్పుడప్పుడు ఒకటో, రెండో విషయాలు బయటకు వచ్చినా .. ఏం జరుగుతుందో తెలియకుండా అంతా నిగూఢంగా ఉంచారు . సాధారణ డైట్ తీసుకుంటున్నారని, జయలలిత పరిస్థితి బాగానే ఉందని రెండు మూడు రోజుల పాటు ప్రకటనలు వెలువడ్డాయి. తర్వాత విదేశాలకు చికిత్స కోసం తీసుకెళ్తారంటూ మీడియాలో ప్రచారం జరిగింది.

సెప్టెంబరు 29న ఈ పుకార్లను ఖండించిన అపోలో వైద్యులు జయలలిత కోలుకుంటున్నారని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని ప్రకటించారు. నవంబరు 13న అంటే ఆసుపత్రిలో చేరిన 50 రోజుల తర్వాత జయలలిత సంతకంతో ఉన్న ఒక లేఖను విడుదల చేశారు. అందులో జయ తాను పునర్జన్మ పొందినట్లు పేర్కొన్నారు. త్వరలోనే విధుల్లో చేరతానని కూడా చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే రెండున్నర నెలల పాటు ఆసుపత్రి వర్గాలతో పాటు అన్నాడిఎంకే నేతలు జయలలిత ఆరోగ్యం బాగానే ఉందని చెబుతూ వచ్చారు. జనం కూడా నిజమే అనుకున్నారు. అమ్మ కోలుకుందని.. అమ్మ పేపర్ చదివిందని.. అమ్మ టిఫిన్ తిందని.. అమ్మ టీవీ చూసిందని..ప్రకటనలు చేశారు.

నవంబరు 19న జయలలిత వెంటిలేటర్ అవసరం లేకుండానే వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని డాక్టర్లు ప్రకటించారు. 2016 డిసెంబరు 4న ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి ఇంటికి డిశ్చార్జ్ అవుతారని అన్నాడిఎంకే పార్టీ ప్రకటించింది.అయితే అకస్మాత్తుగా డిసెంబరు 5న రాత్రి 11గంటల 30 నిముషాలకు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు.

దీంతో ప్రజలు షాక్ తిన్నారు. అనుమాన పడ్డారు. రకరకాల పుకార్లు వెల్లువెత్తాయి. ప్రభుత్వం తో పాటు.. అపోలో వర్గాలు.. ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు అలానే ఉండిపోయాయి.

జయలలిత ను ఆసుపత్రిలో చేర్చేసరికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇంట్లో ఉండగానే జయలలితను అనారోగ్యం పాలు చేసేలా కుట్రలు జరిగాయని పుకార్లు ప్రచారంలో కొచ్చాయి. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇందులో ఎక్కువ భాగం శశికళ పైనే ఆరోపణలు వచ్చాయి.

ఇక నివేదికలో పలు సందేహాలను కమీషన్ వ్యక్తం చేసింది. వాటిలో 1. జయలలిత డిసెంబరు 4న మరణిస్తే డిసెంబరు 5న మరణించినట్లు ప్రకటించారు. 2. జయలలితకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనే దానిపై క్లారిటీ లేదు. 3. వైద్యులు సిఫార్సు చేసిన కొన్ని సర్జరీలు జరగలేదు. 4. ఆమెకు సరైన వైద్యం అందలేదు.మొత్తం మీద జయలలిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది మొదలు ఆమె మరణించే వరకు ఏం జరిగిందో అంతా మిస్టరీ యే .

జయలలిత ఆసుపత్రిలో చేరడానికి ముందు పోయస్ గార్డెన్ లో ఓ వ్యక్తితో వాగ్వివాదం జరిగిందని.. ఆ సమయంలో అవతలి వ్యక్తి తోసేయడంతో జయలలిత కిందపడిపోయారని మాజీ స్పీకర్ పాండ్యన్ ఆరోపించారు. ఆ వ్యక్తి ఎవరు ? జయలలితను ఆసుపత్రిలో చేర్చినపుడు ఆమె బుగ్గపై నాలుగు గాట్లు కనిపించాయి. ఆ గాట్లు ఏంటి ? ఏమైనా గాయాలా ? గాయాలైతే ఎవరు చేశారు ? అన్న అనుమానాలు వ్యక్తమైనాయి.

అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు లోనైనపుడు కొన్ని సందర్భాల్లో బుగ్గలపై అటువంటి గాట్లు ఉంటాయని అంటున్నారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ వరుస భేటీలు నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇపుడు తాజాగా జయమరణం కేసుపై నివేదిక బహిర్గతం కావడంతో శశికళ భవిష్యత్తు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

తమిళనాట అంతా దీని పైనే చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు శశికళ సన్నాహాలు చేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. జయ మేనల్లుడు దీపక్‌ కూడా చిన్నమ్మ కు అనుకూలంగా ఉన్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణ జరిపేందుకు స్టాలిన్  ప్రభుత్వం యోచిస్తోంది. చాలామంది అధికారులను కూడా విచారించాలని కమీషన్ సూచించింది. ఇప్పటికే ఆరేళ్ళు దాటాయి. మిస్టరీ వీడటానికి ఇంకెంత కాలం పడుతుందో ??

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!