Population is decreasing ...................
ఆ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి.అక్కడ కార్లు ఉండవు. పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు , ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కార్లు వాడకపోవడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా గత 50 సంవత్సరాలలో జనాభా 1,20,000 నుంచి 60 వేలకు పడిపోయింది. 2030 నాటికి ఈ నగరం దెయ్యాల నగరంగా (జనసంచారం లేని) మారవచ్చని నిపుణులు ఆమధ్య ఎపుడో చెప్పారు. ఇంతకూ ఆ నగరం ఏమిటో చెప్పలేదు కదా. అదేనండీ వెనిస్ నగరం.
నార్త్ ఈస్ట్ ఇటలీ లో వెనిస్ ప్రసిద్ధ నగరం. 118 చిన్నచిన్న దీవుల సమాహారం. ఇవన్నీ అందమైన కాలువలు .. అద్భుతమైన వంతెనలతో అనుసంధానమై ఉంటాయి. పురాతన కట్టడాలకు నిలయంగా .. నీటిపై తేలియాడే అక్కడి ప్రజల జీవన విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా పడవలపై వెళ్లాల్సిందే.నడిచే భూభాగం తక్కువగా ఉంటుంది. ప్రతి పడవను ఎనిమిది రకాల చెక్కలతో తయారు చేస్తారు. పర్యాటకులు పడవల ద్వారా ప్రయాణం చేస్తుంటారు.
ఈ నగరాన్ని వంతెనల నగరమని కూడా పిలుస్తారు. సుమారు 417 వంతెనలున్నాయి. వీటిలో 72 ప్రయివేట్ వంతెనలు. అతి పురాతన వంతెన రియాల్ టో. గ్రాండ్ కెనాల్ పై నిర్మించిన నాలుగు వంతెనల్లో ఇది ఒకటి. దశాబ్దాల చరిత్ర వున్న ఈ వంతెన చెక్కుచెదరకుండా ఉంది. అలాగే వెయ్యి ఏళ్ళక్రితం కట్టిన భవనాలు కూడా ఉన్నాయి. సెయింట్ మార్క్స్ చర్చి అతి పురాతనమైన భవనాల్లో ఒకటి. డోగ్స్ ప్యాలెస్ కూడా ప్రసిద్ధి చెందిన భవనం. ఒకప్పుడు ఇది వెనిస్ రాజు అధికారిక నివాసం. ఇపుడు మ్యూజియంగా మారింది.
ఈ నగరానికి ఏడాది పొడుగునా ప్రపంచదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. నీటి సోయగాల మధ్య బస చేసే అతిధి గృహాలు ప్రత్యేక ఆకర్షణ. స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. సీ ఫుడ్ ఎక్కువగా లభ్యమవుతుంది. ఎటు చూసినా నీళ్ళే. ఆ నీటిలోనే భవనాలు కట్టారు. అదే వెనిస్ ప్రత్యేకత. వరదల కారణంగా అపుడపుడు నగరంలోకి నీరు ఎక్కువగా ప్రవేశిస్తుంది. ఆ సమయంలో నగరం మునిగి పోతుంది.
అలాంటి సందర్భాలలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఈ వరదల కారణంగా క్రమంగా జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ప్రజలు వలస పోతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది ఉదయం వచ్చి సాయంత్రం వెళుతుంటారు. 2019 లో వరదలు ముంచెత్తడంతో నీటిపై తేలియాడే నగరంగా చెప్పుకునే వెనిస్ 80 శాతానికి పైగా మునిగిపోయింది. చారిత్రిక కట్టడాలు నీళ్లతో నిండిపోయాయి. టూరిజం బాగా దెబ్బ తిన్నది. ఇపుడిపుడే మళ్ళీ కోలుకుంటున్నది. ఇటలీ వెళితే అక్కడ నుంచి వెనిస్ వెళ్లడం సులభం. నీటిపై తేలియాడే ఆ నగరాన్ని చూడటం ఒక ప్రత్యక అనుభూతిని అందిస్తుంది.