‘ఇండియన్ సినిమా’ కు సౌత్ కేరాఫ్ అడ్రెస్ కానుందా ?

Sharing is Caring...

SANKEERTHAN…………………………

కండలు తిరిగిన ఖాన్‌లు, దుబాయ్ వంటి దేశాలకే బ్రాండ్ అంబాసిడర్లు, ఒక్క రోజులో వంద కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు, సినిమా ఎలా ఉందన్నది కాదు. వాళ్లు సినిమా తీస్తేనే సూపర్ హిట్లు. ఇది గతం… గతమేంతో ఘనం.. అన్నట్లు తయారైంది బాలీవుడ్ పరిస్థితి.

ఏళ్లుగా ఖాన్‌లకు సలామ్ కొట్టిన నార్త్ ఆడియన్స్ ఇప్పుడు ఈసడించుకుంటున్నారు. కపూర్‌లకు కాలం చెల్లింపోయిందని తెల్చిపడేస్తున్నారు. రాజ్ పుత్‌ల రోజులు అయిపోయాయి పోమ్మంటున్నారు. మొత్తంగా బాలీవుడ్ పని అయిపోయిందని… ఇన్నాళ్లు దండేసి దండం పెట్టిన ఆ ఉత్తరాది ప్రజలే.. ఇక చాలు మీ ఓవరాక్షన్ అంటూ ఖాన్‌లను పక్కన పెట్టేశారు.  

ఇండియన్ సినిమా అంటే ఏంటి? బాలీవుడ్..! దేశంలో పెద్ద సినిమాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి.. మళ్లీ బాలీవుడే..! దేశం మెచ్చే  .. పైసలు తెచ్చే హీరోలు ఎక్కడుంటారు ఇండియాలో.. అదీ కూడా బాలీవుడే కదా..! ఇది నిన్నటి వరకు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కపూర్లు, ఖాన్‌లు కూడా ఇప్పుడు సౌత్ బాట పట్టాల్సిందే..!

మా సినిమా ఒకటి వస్తుంది సార్ ప్లీజ్ ప్రమోట్ చేయండి అని సౌత్ హీరోలను బతిమాలు కోవాలాల్సిన రోజులు వచ్చేశాయి. కనీసం ఓ సౌత్ హీరోనో, లేక దర్శకుడి పాత్ర లేకపోతే ఆ బాలీవుడ్ సినిమా ఆడలేని పరిస్థితికి బాలీవుడ్ దిగజారి పోయింది. షారూక్, సల్మాన్‌లను కాస్త పక్కన పెడితే… అజయ్ దేవగన్, టైగర్ షరాఫ్, జాన్ అబ్రహం, సైఫ్ అలీఖాన్లు జనాలకు  గుర్తే లేరు.  

ఓ భాయ్… సళ్లూ భాయ్… ఖాన్.. ఖాన్.. కింగ్ ఖాన్. రౌడీ రాథోడ్ అక్షయ్ కుమార్. ఈ మాటలు ముంబైతో పాటు హిందీ బెల్ట్ మొత్తం ఒకప్పుడు మారుమోగిపోయేవి..! మేము చేసిందే యాక్షన్.. తీసిందే సినిమా అన్నట్లు ఏళ్లకు ఏళ్లు బాలీవుడ్ భారత ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించింది.

కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది. ఖాన్‌ల కండలు, కపూర్ల బికినీలు మాకొద్దురా అయ్యా అనుకున్నారు ఉత్తరాది జనాలు. కానీ జనాల మూడ్‌ను బాలీవుడ్ దర్శక నిర్మాతలు పట్టించుకుంటేగా… జనాలకు, బీ, సీ సెంటర్లకు నచ్చే సినిమాలు కాదు..  ఖాన్‌లు,  ఖాన్‌లు, కపూర్ల నచ్చే సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డారు.

ఫ్యాన్స్‌ను బాలీవుడ్ హీరోలు ఎప్పుడో గాలికి వదిలేశారు. వాళ్లకు కావాల్సింది కేవలం డబ్బులు మాత్రమే..! ఇనాళ్లు కటౌట్లు కట్టి… ఫ్లెక్సీలు పెట్టిన ఆ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ కోసం  సినిమాలు తీయకుండా వాస్తవికతకు దూరంగా ఉండే మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మల్టిప్లెక్స్‌లతోనే మనీ అన్నట్లు… సీ సెంటర్లో ఏముంది చిల్లరా అన్నట్లు సినిమాలు తీసి… ఫ్యాన్స్  సైతం ఈసడించుకునే స్థాయికి బాలీవుడ్ సినిమాలు చేరుకున్నాయి.

బాలీవుడ్ దర్శకులు కూడా మూసలో సినిమాలు తీసేస్తున్నారు. కథతో సంబంధం లేని యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాలు తీసేస్తూ  నార్త్ ఆడియన్స్‌ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టేశారు. ఇది చాలదన్నట్లు… హిందీ సినిమా అంటేనే బూతు సినిమా అన్నట్లు తయారు చేశారు. నీలిచిత్రాలకు ఏ మాత్రం తీసిపోని సన్నివేశాలు.. ఫ్యామిలీతో చూడలేని రీతిలో హీరోయిన్లతో కథనాన్ని నడిపించి రోత తెప్పించారు.

హీరోల అంగీల గుండీలు తీసి గుండెలు చూపించేయడం.. హీరోయిన్లకు బికినీలు వేసి బీచ్‌లో వదిలేయడం… అర్థం పర్థం లేని యాక్షన్ సీన్లు పెట్టేయడం.. ఇది బాలీవుడ్ సినిమా. కాస్త కథ, కథనం ఉన్న సినిమా బాలీవుడ్‌లో వచ్చింది అంటే అది తప్పకుండా సౌత్ రీమేక్ సినిమానే అయ్యి ఉంటుంది.

సౌత్‌లో భారీ హిట్ సినిమా వచ్చిందంటే.. దాన్ని వెంటనే కొనేయాలి.. రీమేక్ చేయాలి.. జనాలను ఫూల్స్ చేయాలి.. ఇది బాలీవుడ్‌కు బట్టర్‌తో పెట్టిన విద్య. తెలుగు నుంచి ఒకటా రెండా… అనేక సినిమాలను బాలీవుడ్ నిర్మాతలు కొట్టేసి.. అక్కడ కోట్లు దండుకున్నారు. మన హీరోలు చేసిన నటనలో సగం కూడా చేయకుండా కనీసం కాపీ కొట్టే తెలివి కూడా సరిగ్గా లేకుండా సినిమాలు చేసిన బాలీవుడ్ హీరోలు.. బడా హీరోలమంటూ గప్పాలు కొట్టారు.

90ల నుంచి తమిళ్ సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అయ్యేవి. 2008లో అమీర్ ఖాన్‌ తీసిన ‘గజినీ’ సినిమా దేశంలో తొలి వంద కోట్ల సినిమా అంటే నమ్ముతారా? నమ్మితీరాలి. ఇది పక్కా తమిళ్ సినిమా. టాలెంటెడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీసిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది.

ఇక తెలుగులో పూరి,మహేశ్ తీసిన ‘పోకిరీ’ని బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ వాటెండ్‌‌గా రీమేక్ చేశారు. ఇది సల్మాన్ ఖాన్ రీ ఎంట్రీ సినిమా. అప్పటి వరకు ఫుల్లు ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్… పూరీ రాసిన పోకిరి కథే మళ్లీ బాలీవుడ్‌లో నిలదొక్కుకునేలా చేసింది.      

ఇక దేశంలోనే దిగ్గజ రచయిత, దర్శకుడు విజేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్ హీరోలు రుణపడి ఉండాలి. తెలుగు విక్రమార్కుడు సినిమాకు రీమేక్ ‘రౌడీ రాథోడ్’. ఆల్మోస్ట్ అక్షయ్ కుమార్‌ను జనాలు మర్చిపోతున్నారనుకున్న టైమ్‌లో ఆయనకు రౌడీ రాథోడ్ సినిమా పడింది. బాలీవుడ్‌‌లో కలెక్షల వర్షం కురిపించింది. బజరంగీ భాయిజాన్ సినిమాకు రచయిత మన విజయేంద్ర ప్రసాద్. అప్పట్లో మహేశ్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి నుంచి నిన్న మొన్న వచ్చిన జెర్సీ, అర్జున్ రెడ్డి వరకు అన్ని తెలుగు సినిమాలే.. సౌత్ కథలే.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు, తమిళ కథలే బాలీవుడ్‌లో టాప్ టెన్ కలెక్షన్లలో ఉంటాయి. కథా బలం ఉన్న కథలు కూడా సౌత్  నుంచే దిగుమతి చేసుకున్నారు బాలీవుడ్ దర్శకులు. అయితే రీజినల్ లాంగ్వేజ్‌లో వచ్చిన సినిమాలతో కంపేర్ చేసినప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అయిన సినిమాలు అంత బాగా ఉండేవి కాదు. కనీసం రీమేక్ సినిమాలకు సైతం బాలీవుడ్ దర్శకులు సరిగ్గా దర్శకత్వం చేయలేక చతికిలపడ్డారు.

ఇక బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! అసలు సౌత్ సినిమాలు సినిమాలే కాదన్నట్లు వ్యవహరించే వాళ్లు. తొలుత తెలుగు తెరతోనే సినిమాలకు పరిచమైన హీరోయిన్లు కూడా బాలీవుడ్‌లో బిజీ అయిన తర్వాత రీజనల్ సినిమాల మీద ఇక్కడి నటుల మీద అవాకులు చవాకులు పేలిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ జనాలకు అసలు సినిమా చూసే విధానమే తెలియదన్న హీరోయిన్లు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు.

ఏదైనా సందర్భంలో సౌత్‌లో నటుల గురించో.. నటీమణుల గురించి అడిగితే వాళ్లెవరు.. మాకు తెలియదన్నట్లు ఉండేది బాలీవుడ్ హీరోయిన్ల యాటిట్యూడ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంజెల్స్‌ అంటే మేమే అన్నట్లు బిల్డప్లు కొట్టే వాళ్లు ఆ బాలీవుడ్ నటీమణులు. అయితే సౌత్‌లో కొందరు హీరోల వికృత చేష్టలను బాలీవుడ్ హీరోయిన్లు పంచుకున్న సందర్భాలను.. అందులో నిజాలను ఒప్పుకోక తప్పదు. ఆ అంశాన్ని పక్కన పెడితే… సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ హీరోయిన్లకు ఎప్పుడూ చిన్నచూపే..!  

హిందీ జనాల సహనాన్ని బాలీవుడ్ ఓ 20 ఏళ్ల పాటు పరీక్షించిందనే చెప్పాలి. ఓపికలేక.. పైసలు పెట్టినా సరైన సినిమా చూశామన్న సంతృప్తి లేక అల్లాడిపోతున్న బాలీవుడ్‌ జనాలకు అసలు సిసలు సినిమా రుచి చూపించాడు దర్శకధీరుడు రాజమౌళి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!