keen contest ………………………………………………………………..
బ్రిటన్ కు కాబోయే ప్రధాని ఎవరా? అని రాజకీయాల పట్ల ఆసక్తి గల భారతీయులు ఎదురుచూస్తున్నారు. ప్రధాని పదవిని అధిష్టించే అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు జరుగుతున్న పార్టీ పరమైన పోరులో కీలకమైన తుది అంకానికి మాజీ మంత్రి రిషి సునాక్ అర్హత సాధించారు. చివరిదైన ఐదో రౌండ్ పోరులో 137 మంది ఎంపీల మద్దతు సాధించి రిషి అగ్ర స్థానాన్ని నిలుపుకున్నారు. పార్టీ సభ్యుల మద్దతు కూడా లభిస్తే రిషి విజయం సాధిస్తారు.
ప్రధాని పదవికి గట్టి పోటీదారని భావించిన మాజీ వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ అనూహ్యంగా 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి రేసు నుంచి తప్పుకున్నారు. నాలుగో రౌండ్ దాకా మూడో స్థానంలో కొనసాగిన మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కీలకమైన ఐదో రౌండ్ ముగిసే సరికి 113 ఓట్లతో రెండో స్థానానికి చేరుకొని తుది పోరుకు అర్హత సాధించారు. దీంతో ఈమె కూడా పార్టీ సభ్యుల మద్దతు కూడ గట్టే ప్రయత్నాల్లో పడ్డారు.
దాదాపు నెల పాటు దశలవారీగా జరిగే పోలింగ్‌లో 1.6 లక్షల కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన జరిగే ఓటింగ్‌లో పాల్గొంటారు. ఈ ఓటింగ్ లో మెజారిటీ ఓట్లు సాధించేవారే కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికవుతారు. తద్వారా ప్రధాని పీఠమూ ఎక్కుతారు. ఈ నేపథ్యంలో కీలకమైన పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు రిషి, ట్రస్ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇద్దరు కూడా ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. అనుకూలమైన ఎంపీలతో పార్టీ సభ్యుల మద్దతు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీగేట్, పించర్‌గేట్ వంటి కుంభకోణాల్లో ఇరుక్కుని విమర్శల పాలై ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. అంతకు ముందు జూన్ లో బోరిస్ జాన్సన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. స్వల్ప తేడాతో విజయం సాధించారు. బోరిస్ క్యాబినెట్ పై సొంత పార్టీ కన్జర్వేటివ్ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం విశేషం .
అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి 180 ఓట్లు అవసరం కాగా, బోరిస్ కు అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి. 148 మంది ఎంపీలు ప్రధానికి వ్యతిరేకంగా ఓటేశారు.దాంతో జాన్సన్ తాత్కాలికంగా గట్టెక్కారు. ఆ సంతోషం కొద్దీ రోజులు కూడా నిలవలేదు.
ప్రధాని బోరిస్ జాన్సన్ పాలనపై మంత్రులు విశ్వాసం కోల్పోయినట్టు ప్రకటించారు. ఆయన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ… 50 మందికి పైగా మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కినప్పటికీ మంత్రుల ఆగ్రహానికి గురయ్యారు.
బోరిస్ జాన్సన్ కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్‌డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని మంత్రులు మండిపడుతూ స్టేట్మెంట్లు ఇచ్చారు. బోరిస్ జాన్సన్ సెక్స్ స్కాండల్‌పై వచ్చిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు.
మంత్రులు,ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడం…విమర్శలు పెరిగిపోవడంతో చివరికి ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన మంత్రుల్లో మొదటి వాడు రిషి సునక్. దీంతో మళ్ళీ ప్రధానమంత్రి పదవి ఎన్నిక అనివార్యమైంది.
రిషితో పాటు మొత్తం 8 మంది రంగంలోకి దిగగా భారత మూలాలున్న అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్మన్ తొలి రౌండ్‌లోనే తప్పుకున్నారు. తర్వాత పాక్ మూలాలున్న నదీం జహావీ, జెరెమీ హంట్, టామ్ టగన్ హాట్, కేమీ బదెనొక్ వరుసగా తప్పుకున్నారు
కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు విషయంలో రిషిదే పై చేయి అయినా కీలకమైన పార్టీ సభ్యుల్లో మాత్రం మెజారిటీ ట్రస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే జరిగిన పలు సర్వేల్లో లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారు. అయితే ఈ సర్వే లను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని బ్రిటిష్ పరిశీలకులు చెబుతున్నారు .
రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లేబర్ పార్టీని ఓడించగల నేతకే పార్టీ సభ్యులు జై కొడతారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఆ సత్తా ఉన్నది రిషికే ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రిషి సునాక్ ఓటమి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
బోరిస్ జాన్సన్ కొద్దీ రోజుల క్రితం ఒక రహస్య సమావేశంలో ఎవరినైనా ఎన్నుకోండి.. రిషి సునాక్ తప్ప అని తన మద్దతు దారులకు సూచించినట్టు వార్తలు వచ్చాయి. బోరిస్ జాన్సన్, ఆయన టీం మాత్రం రిషి సునాక్ తప్ప ఎవరైనా సరే అనే స్లోగన్‌తో ఎన్నికల రహస్య క్యాంపెయిన్ చేపట్టినట్లు సమాచారం. ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా తర్వాతే.. ప్రధానిగా తాను తప్పుకోవాల్సి వచ్చినందుకె సునాక్‌పై బోరిస్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

