Whose side is the public verdict?……..
త్వరలో జరగనున్న కేరళ శాసనసభ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు.పినరయి విజయన్ 2016 నుండి ధర్మదం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుండి 50,123 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.2016 లో 36,905 ఓట్ల మెజారిటీని సాధించారు. ధర్మదం లో గెలిచాకనే ఆయన సీఎం అయ్యారు .
పినరయి విజయన్ 1970లో తొలిసారిగా కూతుపరంబ (Kuthuparamba) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. కూతుపరంబ నుంచి 1970, 1977, 1991లో ఎన్నికయ్యారు.1996లో పయ్యన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
1975-77 ఎమర్జెన్సీ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యి, పోలీసుల చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురయ్యారు.1996 – 1998 మధ్య కాలంలో ఇ.కె. నాయనార్ ప్రభుత్వంలో విద్యుత్, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు.1998 నుండి 2015 వరకు సుదీర్ఘ కాలం పాటు సిపిఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి పార్టీని బలోపేతం చేశారు.
2016,2021 లో వరుసగా విజయన్ సర్కార్ విజయం సాధించింది.కేరళలో దశాబ్దాలుగా ‘ఒకసారి ఎల్.డి.ఎఫ్ (LDF) గెలవడం , మరో సారి యు.డి.ఎఫ్ (UDF)’ విజయం సాధించడం సంప్రదాయం గా సాగింది. 2021లో పినరయి ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
ప్రభుత్వ పధకాల అమలు,ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, ప్రీ-ప్రైమరీ టీచర్ల గౌరవ వేతనాన్ని రూ. 1,000 పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
సొంత నియోజకవర్గం ధర్మదంలో పినరయి విజయన్ తన పట్టును నిరూపించుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా తన మేనేజ్‌మెంట్ సామర్థ్యాన్ని ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ వందల కోట్ల కేటాయింపులు చేయడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నాయి. లైఫ్ మిషన్ (పేదలకు ఇళ్ల పథకం)లో ముడుపులు, ఏఐ (AI) కెమెరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కుమార్తె వీణా విజయన్ కంపెనీకి సంబంధించిన ‘మొత్తం చెల్లింపుల’ (Exalogic case) వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా వాడుతున్నాయి.
ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని, కనీసం పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. సిల్వర్ లైన్ (K-Rail) ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, వేల కుటుంబాలు నిరాశ్రయులవుతాయని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
కేరళలో విద్యావంతులైన యువతకు ఉద్యోగాలు లేక విదేశాలకు వలస వెళ్తున్నారని, పీఎస్‌సీ (PSC) నియామకాల్లో పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయ హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని విమర్శిస్తున్నారు.
పినరయి విజయన్‌ను ఢీకొనేందుకు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరపున వి.పి. అబ్దుల్ రషీద్ బరిలో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిజెపి తరపున కె. రంజిత్ కూడా పోటీలో ఉండటంతో ధర్మదంలో త్రిముఖ పోటీ నెలకొంది.

