కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారా

Sharing is Caring...

Speculations ………………………………..

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? చాలాకాలం నుంచి వినవస్తున్న ప్రశ్నఇది . గత మూడేళ్ళుగా ఇలాంటి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కానీ వరుణ్ గాంధీ మటుకు బీజేపీలోనే ఉన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉంటూ ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతలు ఈ పరిణామాలను స్వాగతిస్తూ పోస్టర్లు కూడా ముద్రించారు.

అదే సమయంలో అటు ప్రియాంక కూడా యూపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తరచుగా అక్కడే పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రియాంక గాంధీ యూపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. 

యూపీ లోని పిలిభిత్ లోకసభ స్థానానికి వరుణ్ గాంధీ, సుల్తాన్‌పూర్ స్థానానికి మేనకా గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ అధినాయకత్వం మేనకను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే గత నెలలో యుపిలోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనం ఢీ కొట్టిన వీడియో ను వరుణ్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది జరిగిన కొద్దీ గంటల్లోనే 80 మంది సభ్యుల బిజెపి జాతీయ కార్యవర్గం నుంచి వరుణ్ గాంధీ ని తొలగించారు.

ఆయన తల్లి మేనకా గాంధీ, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ లను కూడా జాతీయ కార్యవర్గం నుంచి పక్కన బెట్టారు.ఈ ముగ్గురూ రైతుల కోసం తమ మద్దతును ప్రకటించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వీరి వైఖరి పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. కొద్దీ రోజుల తరువాత సుల్తాన్ పూర్ నియోజకవర్గ పరిధిలో పలువురు నాయకులు కాంగ్రెసులో చేరారు. కార్యవర్గం నుంచి తొలగించిన దరిమిలా వరుణ్ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ప్రియాంకకు వరుణ్ తోడు కావడంతో యూపీ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే వరుణ్‌ కాంగ్రెస్‌ గూటికి చేరతారని ప్రచారం మొదలయింది.  వరుణ్ ని  పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారనే  కథనాలు ప్రచారంలో కొచ్చాయి. అయితే ఇదంతా సులభమైన విషయంకాదు. తోడికొడళ్లు అయిన సోనియా కు మేనకా కు మొదటి నుంచి సఖ్యత లేదు.

సంజయ్ గాంధీ మరణం తర్వాత వారసత్వం తనకు దక్కుతుందని మేనకా భావించారు. కానీ ఇందిరా రాజీవ్ గాంధీని వారసుడిగా ఎంచుకున్నారు. ఇందిర ఒక రోజు రాత్రి మేనకా ను  ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ సమయంలో సోనియా అడ్డు పడలేదని  మేనకా కు కోపం. నాటి నుంచి రెండు కుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది.

పార్లమెంట్ లో సోనియా .. మేనక ఎదురుపడినపుడు మాట్లాడుకున్న దాఖలాలు లేవని అంటారు. కాగా వరుణ్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ప్రియాంక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అటు సోనియా.. ఇటు మేనకా మెట్టు దిగి వస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. తోడికోడళ్లు మధ్య సయోధ్య కుదిరి ఏకంకావచ్చు. కాకపోవచ్చు.. చూద్దాం ఏమి జరుగుతుందో ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!