ఇపుడు ప్రపంచమంతా ఆ ఇద్దరి వైపే చూస్తుంది. అందులో ఒకరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్స్కీ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రజల దృష్టిలో యుద్ధోన్మాదిగా మిగిలి పోగా … జెలెన్ స్కీ వార్ హీరోగా ఎదిగి పోయారు.
యుద్ధం మొదలు కాగానే జెలెన్ స్కీ అక్కడనుంచి పారిపోలేదు. ధైర్యంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. కానీ పరిమిత ఆయుధ వనరులతో పెద్దగా యుద్ధం చేయలేకపోయాడు. అయినప్పటికీ ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగానే పోరాడారు.రష్యా ను ధీటుగా ఎదుర్కొన్నారు. కొంతమేరకు నష్టం కూడా కలిగించారు.
ఈ క్రమంలోనే సహాయం కోసం యూరోపియన్ యూనియన్ దేశాల అధినేతలకు, అమెరికాకు, నాటో అధికారులకు లెక్కలేనన్ని కాల్స్ చేశాడు జెలెన్స్కీ. మొదటి రెండు రోజులు ఎవరూ స్పందించలేదు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ నేరుగా సపోర్ట్ చేయకపోయినా పరోక్షంగా పుతిన్ ను కట్టడి చేసేందుకు ఆర్ధిక ఆంక్షలు ప్రకటించారు.
మూడో రోజునాటికి జెలెన్ స్కీ చేసిన అభ్యర్థనకు సిట్జర్లాండ్, గ్రీస్ తదితర దేశాలు స్పందించాయి. ఆయా దేశాల అధినేతలు నైతికమైన మద్దతు ప్రకటిస్తూ .. అవసరమైన ఆయుధ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని జెలెన్ స్కీ ట్వీట్ చేసాడు. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇపుడు ఆయుధాలు వచ్చినా జెలెన్ స్కీ చేసేదేమి లేదు.
కాగా జెలెన్స్కీ ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని ఊహించి అమెరికా “మిమ్మల్నీ, మీ కుటుంబాన్ని రక్షిస్తాం.. రెడీగా ఉండండి.. అమెరికా తీసుకెళతాం ” అని సమాచారం పంపారు. “దేశ ప్రజలతోపాటే నేను” అని అమెరికా కు రిప్లై ఇచ్చాడు జెలెన్స్కీ. ఈ ఒక్క మాటతో జెలెన్స్కీ నిజమైన వార్ హీరోగా చరిత్రకెక్కాడు. సైనికులకు ధైర్యం చెప్పేందుకు వీధుల్లోకొచ్చి యుద్ధ వీరులను పలకరించాడు. ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతూ వీడియోలు విడుదల చేసాడు.
2019లో అధికారంలో కొచ్చిన జెలెన్ స్కీ అంతకుముందు పాపులర్ సినీ హీరో.. కమెడియన్, డాన్సర్, స్క్రీన్ రైటర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ అని చాలామందికి తెలియదు.ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అవుతానని అతగాడు ఎపుడూ అనుకోలేదు. కారణాలు ఏమైనా యుద్ధం మూలంగా ఇపుడు నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకుపోయాడు.
రష్యా సేనలు, పుతిన్ జెలెన్ స్కీ ని ప్రాణాలతో వదులుతారని ఎవరూ అనుకోవడం లేదు. ఆపైన జెలెన్ స్కీ అదృష్టం. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, నాటో మాటలు విని జెలెన్ స్కీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు లేకపోలేదు. అన్నట్టు జెలెన్స్కీ మన ప్రధాని మోడీ కి ఫోన్ చేశారు. తమ దేశానికి భారత్ మద్దతు కావాలని కోరారు.
రష్యా దురాక్రమణను ఆపాలని విజ్ఞప్తి చేశారు.రష్యా దురాక్రమణపై ఐక్యరాజ్య సమితిలో తమ దేశానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్ధించారు.యుద్ధ పరిస్థితుల గురించి వివరించారు.. ఆయుధాలు వదిలితేనే చర్చలు అని రష్యా అంటోంది. జెలెన్ స్కీ ఆయుధాలు కావాలని ఇతర దేశాధినేతలను అర్ధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ఏది ఏమైనా జెలెన్స్కీ చరిత్ర పుటల్లో కెక్కాడు.