circumambulation of Giri …………………………………
శుక్రవారం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు, గిరి ప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం ప్రధాన ద్వారం తూర్పు గోపురం వైపు నుండి ప్రారంభించాలి. అలా గిరి ప్రదక్షిణను ప్రారంభించేటప్పుడు తూర్పు గోపురం లోపలివైపు ఆలయ దళంలో నిలిచి పొందే దర్శనాన్ని సంపూర్ణ లింగ దర్శనమని అంటారు.
అరుణాచలేశుని దర్శనం మన జీవితంలోని సమస్యలను, అనారోగ్యాలను తొలగిస్తుంది . ద్వేషం, క్రోధం, దురాశ, అపసవ్య కామం వంటి మానసిక సమస్యలను పూర్తిగా తొలగించి దైవానుగ్రహం లభించేలా చేస్తుంది. దైవ మార్గంలో మనకు ఎదురయ్యే బద్ధ శత్రువు ఎవరంటే మనలోని ద్వేషమే.
ఇతరుల అభివృద్ధిని చూసి మన మనస్సులో ఏర్పడే వ్యతిరేక భావాలే ద్వేషాలు. ఇవి లౌకిక జీవితంలోనే కాకుండా దైవీక జీవనంలో ఆటంకాలుగా నిలుస్తాయి. వీటి ప్రభావానికి లోను కాని వారంటూ ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు.‘అంతా దైవ సంకల్పాలే’ అనే భావన మనస్సులో దృఢపడేంత వరకూ ఈ దుష్టభావనను తొలగించలేం.
అయితే శుక్రవారం తిరుఅణ్ణామలై వాసుని గిరి ప్రదక్షిణ సమయాన లభించే సంపూర్ణ లింగ దర్శనం మనలోని ద్వేషభావాలను తొలగిస్తుంది. కుటుంబంలో, పిల్లలలో, ఉద్యోగం, వ్యాపారం వంటివాటిపై ఇతరుల్లో కలిగిన ద్వేషాలు, దిష్టిని తొలగించేందుకు ఈ దర్శనం దోహదపడుతుంది.
తూర్పుగోపుర ద్వారం లోపలివైపున ఉన్న లక్షణ వినాయకుడిని, గోపురం లోపల గల చాముండీశ్వరీ అమ్మవారిని మొక్కి స్తుతిస్తూ గిరి ప్రదక్షిణను కొనసాగించాలి.ఈ క్రమంలోనే ఆలయంలోని శ్రీ బ్రహ్మలింగానికి ఎదురుగా ఉన్న బ్రహ్మతీర్థ గట్టునుండి తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించటమే పుష్ప దీప దర్శనం అంటారు.
భగవంతుడిని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఎలాంటి జాతి, మత, కుల బేధాలు లేకుండా సకల జీవరాశులు తమకు తోచినంతగా దాన, ధర్మాలు లేదా శారీరక శ్రమలతో కూడిన సేవలు నిర్వర్తిస్తే భగవంతుని గురించిన వాస్తవాలను తెలుసుకోగలుగుతారు. దీనిని ఎరుకపరచేదే పుష్ప దీప దర్శనం.
వర్తమాన పరిస్థితులలో పలువురు యువకులు ఉద్యోగాలు లేకుండా తాము చేస్తున్న ఉద్యోగంలో తృప్తి పొందక దుఃఖపడుతుంటారు. వీరికి మంచి మార్గాన్ని చూపించేదే ఈ దర్శనం. ఉన్నత చదువులు చదివినవారికి సాధారణమైన ఉద్యోగం, తక్కువగా చదవినవారికి అత్యధిక జీతం పొందే ఉద్యోగం లభించటం సర్వసాధారణమైన విషయం. ఈ లోపాలను ఈ దర్శనం చక్కబరుస్తుందని భక్తుల నమ్మకం.
దక్షిణ గోపురం దాటుకుని వెలుపలికి వచ్చి ఈశ్వరుడిని చూస్తే కుంభం వంటి ఆకారం కనబడుతుంది. ఇదియే మహాశక్తివంతమైన కుంభమూర్తి దర్శనం. పలువురు ఆత్మజ్ఞానం కోసం ప్రార్థించి దైవ కార్యాలు చేసి, ఇతరులను ధర్మం వైపు నడిపించేలా దైవానుగ్రహంతో జీవిస్తుంటారు. అలాంటివారికి దైవ దర్శనం అంటే ఏమిటో ఎరుకపరచి, కరుణకటాక్షాలను ప్రసాదించునదే కుంభమూర్తి దీప దర్శనం.
తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలను చేయనివారికి పరిహారం ఇవ్వగలిగే దర్శనం కూడా ఇదే! ఈ దర్శనం పొందిన తర్వాత తల్లిదండ్రులకు చేయాల్సిన సేవలను సక్రమంగా నిర్వర్తించాలి. వారిని అనాథలుగా విడువకూడదు.శుక్రవారం గిరిప్రదక్షిణలో దక్షిణ గోపురం నుండి నేరుగా వెళ్ళి కుడివైపున ఉన్న శ్రీకర్పగ వినాయకుడి గుడి నుండి వేదశక్తి ప్రసాదిత దీర్ఘ దర్శనం పొందవచ్చు.
వేదశక్తులను తస్కరించి వాటిని ఉపయోగించి దేవతలను నాశనం చేయవచ్చునని తలచిన అసురులు ఓ సారి వేదాలను బ్రహ్మదేవుడి నుండి అపహరించేందుకు ప్రయత్నించారు. వేదాలకు అధిపతియైన బ్రహ్మదేవుడు కోటానుకోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా అసురుల వేధింపులను తట్టుకోలేక అరుణాచలేశ్వరుడిని శరణుజొచ్చి తన రూపాన్ని మూలికాశక్తులు కలిగిన వృక్షపు (చెట్టు) ఆకారంగా మార్చుకుని వేదశక్తులుతో మాయం కాగల శక్తి సామర్థ్యాలను పొందగలిగారు.
దేవతలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వారికి మాత్రమే మూలికల సువాసనలు వ్యాపింపచేసి వేద శక్తులను అందించగల శక్తిని కూడా పొందారు. అలా దేవతలు గిరి ప్రదక్షిణ చేసి వేదశక్తులు పొందిన స్థలమే వేదశక్తి ప్రసాదిత దర్శన ప్రాంతం.
ఈ ప్రాంతంలో నాలుగువేదాలను తలపించే విధంగా నాలుగుసార్లు తిరుఅణ్ణామలై ఈశ్వరుడిని దర్శించి నమస్కరించాలి. ఈ దర్శనం పొందిన తర్వాత ఉత్తరేణి మొక్కను తమ తలచుట్టూ మూడు మార్లు (దిష్టితీసే విధంగా) తిప్పి ఎవరికాలికి తగలనంత దూరంలో విసిరివేసినట్లయితే చేతబడుల వల్ల కలిగే కష్టాల నుండి విముక్తి పొందవచ్చు.
ఈ విధంగా ఇళ్లలో, వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు చేసే చేతబడులు ప్రభావం చూపకుండా ఈ దర్శనం కాపాడగలుగుతుంది. చేతబడుల వల్ల కలిగే మానసిక భయాందోళనలను పూర్తిగా తొలగిస్తుంది.