Taadi Prakash …………………………………………………………………………..
Peoples ‘war and peace’ of srikakulam……………………………………
చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది.
“ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల. పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద కూకొని ఊసులాడుకుంటన్నారు. వెన్నెల కూడా నడివీధిని చేరుకుంది…ఇలా ఒక పులకింతతో మొదలవుతుంది నవల… అలనాటి స్వచ్ఛమైన జానపద గీతాలు వినిపించే కరెంటు లేని చీకటి పల్లెల కూడళ్ళలోకి పాఠకుల్ని నడిపిస్తుంది ‘బహుళ’.
ప్రాణాధారమైన భూమి, తిండిగింజలిచ్చే వ్యవసాయం, చెమటనెత్తురు ధారవోసినా తీరని అప్పులు, చాలని ఫలసాయం – బిడ్డల ఆకలి, రైతుల నిరాశ – ఒక తిరుగుబాటుగా, యుద్ధంగా మారడానికి ముందు ఉత్తరాంధ్ర గ్రామీణ జీవన దృశ్యాన్ని నాగావళీ, వంశధార నీటి కెరటాలు మాట్లాడుతున్నంత సహజంగా అట్టాడ అప్పలనాయుడు మన కళ్ళముందు పరుస్తాడు.
దిక్కుతోచని రైతులు, బియ్యం కూడా దొరకని రోజులు… బిడ్డలకి సోళ్లూ, గంటెలూ వండి పెడుతున్న తల్లులు! గాలికి వూగుతున్న పెద్దపెద్ద పచ్చని చెట్ల కింద మోడువారుతున్న సంసారాలు. రైతులూ, వ్యవసాయ కూలీల బతుకులపై ఆకలి చీకటి తెర దిగుతున్నప్పటి ఇనప గజ్జెల విషాద సంగీతాన్ని విని తట్టుకోలేం!
అప్పల్నాయుడు, భావుకత గట్లు వొరుసుకుని ప్రవహించే నది లాంటి కవి. మారుతున్న సమాజ స్వభావాన్ని నిర్వికారంగా నలుపు తెలుపులో సజీవమైన అక్షరాలుగా మార్చగల ఆధునిక రచయిత. సున్నితమైన మానవ భావోద్వేగాలను పట్టుకుని, అందమైన వాక్యాలుగా సరళసుందరమైన భాషతో హృదయతంత్రుల్ని మీటే అరుదైన ఆర్టిస్టు.కన్నీరొలికే సన్నివేశమైనా, కత్తితో నరికే రక్తసిక్తమైన క్షణాలనయినా పొందికైన మాటలతో హత్తుకునేలా చెప్పగల పరిణితి సాధించిన మనకాలపు మొనగాడు.
భూస్వామ్యం ఇనప పాదాల కింద నలుగుతున్న వ్యవసాయం, రైతులూ, కూలీల గ్రామీణ జీవితాల్లోకి చాప కింద విషంలా పెట్టుబడిదారీ విధానం వ్యాపించిన తీరుని కన్నీటికావ్యంగా మలిచిన నైపుణ్యం…ఒకదాని వెంట ఒకటిగా దూసుకొచ్చిన సంఘటనల్ని ఒక వరసలో పరిచిన చాకచక్యం, శిథిలం అయిపోతున్న బతుకు గుమ్మం మీద నిస్సహాయంగా నిలబడిపోయిన రైతుల మానసిక వేదనని పాఠకుని రక్తనాళాల్లో పలికించే ఒడుపు తెలిసిన సృజనాత్మక కళాకారుడు అట్టాడ అప్పలనాయుడు.
అష్టకష్టాల్లో వున్న రైతుల గురించి చెబుతూ ఒకచోట, “వాళ్ళు సృష్టికర్తలు కదామరి” అంటాడు రచయిత. ‘బహుళ’ నుంచి కొన్ని మంచి మాటలు :
వాతావరణం దుఃఖశ్వాస తీసింది. నాగావళి నీటి మీద కిరణాలని పొద్దు తడిపేవేళ… వర్షపు చినుకులతో ఆకాశం నుంచి రాలిపడిన ఇంద్రధనుసు ముక్కలా కనిపించింది – సుభద్ర మొహం! ఆమె కుంకుమ రంగు జాకెట్టు మీదుగా పొద్దు మలుగుతోంది. సూర్యుడు… ప్రతిరోజూ లాగే తూరుపు వాకిటి పీటచెక్క ఎక్కి కూచున్నాడు.
భూమి కంపించేట్టు ఆడీ, పాడే గొల్లభామల కలాపం సుతిమెత్తని శృంగార నృత్యంగా, భామాకలాపంగా మారిపోయి అగ్రవర్ణాల కళారూపమైంది. జానపద కళాకారుల – చెంచుల పాట, బోనెల పాట, తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు వంటి కళారూపాలకు బియ్యపు గింజల బిచ్చం. అదే హరికథ, భామాకలాపం, వీణావాయిద్యం, పద్య నాటకం కళారూపాలకు ఈనాంలూ, బిరుదులూ, బహుమానాలూ, సత్కారాలూ! ఎవరి కళలు వారివే!
అందుకే ఒక రైతు, ఓసారి ఉరజాడ హరిదాసు గారితో తో – మావి మడిలో (పొలంలో) రాగాలు, మీవి గుడిలో రాగాలన్నాడు.
కాపు నారాయుణ్ణి పెళ్లి చేసుకుని, ఒక బిడ్డని కన్న తక్కువ కులం (గొల్ల) బంగారమ్మ ఒకరోజు ఇంటి నుంచి హఠాత్తుగా వెళిపోతుంది. ఈ సన్నివేశాన్ని అప్పల్నాయుడు రాసిన తీరు గుండెని ముక్కలు చేసేస్తుంది. “దీపాలు వెలిగించిన వేళ దాటిపోయింది, బంగారమ్మ రాలేదు. వంటల వేళయ్యింది, రాలేదు బంగారమ్మ.
నిద్ర వేళయ్యింది, రాలేదు… రాలేదు బంగారమ్మ. చుక్కలు ఆకాశాన పొడిచాయి, బంగారమ్మ రానే…లేదు” – ఇలా వాక్యం వెంట వాక్యం, మనకి తెలీకుండానే మనం బంగారమ్మని వెతుక్కుంటాం! ‘బహుళ’లోని షాక్ చేసే కొన్ని సన్నివేశాల్లో ఇదొకటి. ఇక్కడ మీకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గుర్తొస్తే ఆ తప్పు గురజాడది. అప్పల్నాయుడిది కానేకాదు!
“కొందరు బంగారమ్మ కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టి బుగ్గలు గిల్లగా పిల్లడు ఏడుపు యెత్తుకున్నాడు. ఓసిదేటోలమ్మ సున్నితాల మొగుడు, వెన్నపూస రాస్తే కందిపోనాడట… అని యిగటమాడిందొకామె” అని రాస్తాడు. ఆ మారుమూల చీకటి పల్లెల్లో అక్షరం ముక్కరాని, జాకెట్లు వేసుకునే అలవాటు లేని వ్యవసాయ పనులు చేసుకునే ఆడవాళ్ళు, కష్టజీవులైన మగాళ్ళు, కూలీల చతుర సంభాషణ, హాస్యదృష్టి, ఇన్ స్టెంట్ రిపార్టీని రచయిత అంతే అందంగా మనకి పట్టియిస్తాడు.
ఏ ప్రాంతం యాసలోనైనా ఒక విరుపు, ఒక తూగు, ఒక సొగసు వుంటాయి. శ్రీకాకుళం, ఉత్తరాంధ్రకి చెందిన తూర్పోళ్ల అచ్చ తెలుగు యాసని అంతే లాఘవంగా రాయడమే కాకుండా, ఆ మాటల వెన్నంటి వుండే మధురమైన మట్టి సంగీతాన్ని అలవోకగా వినిపించగలిగాడు అప్పల్నాయుడు. గొల్లలు, వెలమలు, మాల మాదిగలు, కాపులు, రెల్లివాళ్ళు, చాకలి, మంగలి, మేదరి, బ్రాహ్మల మాటల్లోనిన్ సొగసుని సాధికారికంగా రికార్డు చేసిన కళింగాంధ్ర కావ్యం ‘బహుళ’!
నూరేళ్ల ఉత్తరాంధ్ర చరిత్ర… నేలతో, వానతో, విత్తనాలతో పెనవేసుకుపోయిన మూడు తరాల జీవన్మరణ వేదన… శ్రీకాకుళం కొండల్లో ఎగిరిన రైతాంగ సాయుధ పోరాట జెండా, నక్సలైట్ల దాడులకు భయంతో కంపించిపోయిన భూస్వాములు, వడ్డీ వ్యాపారులు! తలలు తెగనరికిన విప్లవోద్యమం.
సిక్కోలు కొండకోనల లోపలికి ఎక్కడికో తల వంచుకుని వెళ్లి అదృశ్యం అయిపోవడం, తెలుగు భాష కూడా రాని నాలుగోతరం మునిమనవళ్ళు నగరాల నుంచి కార్లు, విమానాల్లో రావడం… కాయకష్టం చేసే మట్టికాళ్ళ మనుషులు కనుమరుగై, హృదయం లేని దళారులు, రాజకీయ నాయకులూ డబ్బుతో, ఎన్నికల్తో దున్నపోతుల్లా గ్రామాల మీద పడడం… ఇదీ 430 పేజీల ‘బహుళ’. ఇది తెలుగులో వచ్చిన Epic Novel అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
Read it also ……………………...ఇలాంటి నవలపై నిర్మాతల కన్నుపడదే ?(2)