కోట్లాదిమంది అభిమానించే ప్రముఖ గాయని లతామంగేష్కర్ పదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దేవుడి నిర్ణయం ఆధారంగానే జీవితం ముందుకు సాగుతుంది.ఏం జరిగినా అది మన మంచి కోసమే భావించుకోవాలి” అని చెప్పారు. ఈ సందర్భంగానే లతా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది.
పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా?.. ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో.ఇపుడు అలాంటి ఆలోచలకు తావు లేదు అన్నారు.ఆ ఇంటర్వ్యూ నాటికి లతా వయసు 82 సంవత్సరాలు. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13 ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని మోసిన కారణంగా పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు.
అయితే కొన్ని ఆంగ్ల పత్రికల కథనం మేరకు దివంగత క్రికెటర్ .. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ ను లతా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.లత తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ రాజ్ సింగ్ లు కూడా మంచి స్నేహితులు.
లతా మంగేష్కర్ అంటే రాజ్ సింగ్ కూడా ఇష్టపడ్డారు. ఒక దశలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే లతా సాధారణ కుటుంబానికి చెందిన వారు కావడం తో రాజ్ సింగ్ తండ్రి అంగీకరించలేదని అంటారు.ఈ రాజ్ సింగ్ రాజస్థాన్ రాజవంశానికి చెందినవాడు.
అప్పటి దుంగార్‌పూర్ పాలకుడు దివంగత మహారావల్ లక్ష్మణ్ సింగ్‌జీ చిన్నకుమారుడు.రాజ్ సింగ్ తన మనసులో మాట తండ్రికి తెలియజేయగా ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. కారణం లత రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోవడమే. ఈ నిర్ణయం వారిద్దరిని దూరం చేసింది.ఇద్దరూ జీవితాంతం అవివాహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజ్ సింగ్ సెప్టెంబర్ 12, 2009న కన్నుమూశారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ రాజ్ సింగ్ ముంబైలో తుది శ్వాస విడిచారు. వారి ప్రేమకథ విషాదకరమైన ముగింపును కలిగి ఉన్నప్పటికీ… ప్రేమ పట్ల నిబద్ధత, గౌరవాన్ని సూచిస్తుంది.