దర్శకుడు శంకర్ అలా ఎందుకు చేసాడు?

Sharing is Caring...

Sai Vamshi …………………………

శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కి సంబంధించి ఓ వివాదం నెలకొంది.

అప్పట్లో ప్రధాన మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం తో ఆ విషయం పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆ వివాదంలో నటి సుకన్య బలంగా నిలబడి, చివరిదాకా పోరాడారు. అది ఇప్పటి నటీనటులకు ఓ మంచి పాఠం. దీని గురించి కొంతకాలం క్రితం ఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మాటల్లోనే విషయం తెలుసుకుందాం.  
***
‘శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ పక్కన కీలకమైన పాత్ర అనగానే చాలా ఆనందపడ్డాను. సినిమాలో నేను మామూలుగానూ, ముసలిగానూ కనిపిస్తాను. సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ సీన్ ఉంటుంది. బ్రిటీష్ వాళ్లు మన దేశ ఆడవాళ్లను లారీలో ఎక్కించి, ఊరికి దూరంగా తీసుకెళ్లి బట్టలు మొత్తం బలవంతంగా విప్పిస్తారు.

ఆ అవమానం తట్టుకోలేక వారంతా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలని నేను మాత్రం ఓ చెట్టు చాటున ఉంటాను. ఆ తర్వాత కమల్‌హాసన్ వచ్చి నన్ను కలవడం, ఆయన చొక్కా నాకు ఇవ్వడం.. ఇదంతా సినిమాలో ఉంది.
చెట్టు చాటున నేను నగ్నంగా ఉంటున్నట్లు చూపించే ఆ సీన్ ఎలా తీస్తారని మొదట్లోనే డైరెక్టర్‌ని అడిగాను.

‘అదేమీ ఫర్లేదు! అందులో మీరేమీ కనిపించరు. కేవలం మీ గొంతు వినిపిస్తుంది’ అన్నారు. నేను సరే అని ఆ సీన్ చేసేశాను. తీరా ఆ సీన్ రషెస్ చూసేసరికి చాలా అప్‌సెట్ అయ్యాను. అందులో నేను ఇబ్బందికరంగా కనిపించేటట్టు ఏదోలా తీశారు. ఆ షాట్స్ నాకస్సలు నచ్చలేదు. నాకు చెప్పింది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి.

ఏం చేయాలో తెలియలేదు. నేను ఆ సినిమాలో నటించాల్సిన సీన్లు ఇంకా ఉన్నాయి. షూటింగ్ ఆపలేను. కానీ ఈ విషయం ఆపకపోతే ఇబ్బందికరంగా మారుతుంది.వెంటనే మా నాన్న ఢిల్లీలోని కేంద్ర సెన్సార్ బోర్డుకు లెటర్ రాశారు. జరిగినదంతా అందులో వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది.

‘మీరు చాలా మంచి పని చేశారు. ఒక నటికి చెప్పింది ఒకటి, తీసింది ఒకటి అంటే అది చాలా పెద్ద తప్పని అర్థం. చాలామంది నటీనటులు ఇలాంటప్పుడు సర్దుకుపోతుంటారు. కానీ మీరలా చేయకపోవడం అభినందనీయం. పైగా మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. రేపు సినిమా విడుదల అనగా, ఇవాళ వస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు’ అని అన్నారు.

ఆ తర్వాత ‘నడిగర్ సంఘం'(నటీనటుల సంఘం)ను సంప్రదించాను. అప్పుడు దానికి అధ్యక్షుడు రాధా రవి నాకు చాలా సాయం చేశారు. ‘నీకు చెప్పిందొకటి, అక్కడ చేసిందొకటి అయితే నువ్వేమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ షాట్స్ సినిమాలో రాకుండా లెటర్ తీసుకుందాం’ అన్నారు.

ఎంతోమంది సీనియర్ హీరోలు, దర్శకులు నాకు ఫోన్ చేసి ‘ధైర్యంగా అడుగేశావ్. చాలా మంచి పని చేశావ్’ అని మెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాత నుంచి అధికారికంగా లెటర్ తీసుకున్నారు. నేను అభ్యంతరకరంగా ఫీలైన ఆ షాట్స్ తీసేసినట్లు ఆ లెటర్‌లో రాశారు. అవి అందులో ఉండవని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ ఇంత జరిగాక లొకేషన్‌లో ముందున్నంత హాయిగా, నవ్వుతూ ఉండలేం కదా! కాబట్టి షూటింగ్‌లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత మెల్లగా నాకు సినిమా అవకాశాలు తగ్గడం మొదలైంది.

ఆ తర్వాత కాలంలో ‘ఇండియన్ 2’ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పుడు చాలామంది ‘ఆ సినిమాలో మీరు నటిస్తున్నారా’ అని అడిగేవారు. ఇంత జరిగాక నేను ఆ సినిమా సీక్వెల్‌లో ఉండే అవకాశమే లేదు. వాళ్లు నన్ను ఎలాగూ అడగరు. అది నాకు తెలుసు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!