‘ విక్రమ సింహ ‘ ఎందుకు ఆగిపోయిందో ?

Sharing is Caring...

Unfinished film…………………………………….

ఎన్టీఆర్ నటించిన ‘జయసింహ’ సూపర్ హిట్ మూవీ. ‘సింహ’ పేరు కలసి వచ్చేలా ‘బాలకృష్ణ’ తో ‘విక్రమ సింహ’ సినిమా ప్లాన్ చేశారు. అట్టహాసం గా షూటింగ్ మొదలైంది .. దాదాపు సగం సినిమా షూటింగ్ అయ్యాక సడన్ గా ఆగిపోయింది. ఇది కూడా జానపదచిత్రమే. 

‘విక్రమ సింహ’ ఎందుకు ఆగిపోయిందో ? ఖచ్చితమైన సమాచారం ఎవరికి తెలీదు. వాస్తవాలు తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ … నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి… ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి  ఇపుడు సజీవంగా లేరు.

హీరో బాలకృష్ణ ఆ సినిమా గురించి బయట ఏమి మాట్లాడలేదు.ఎవరూ అడిగే సాహసం కూడా చేయలేదు. 60 శాతం పూర్తయిన సినిమా ఆగిపోవడం అంటే .. నిర్మాతకు ఆర్ధిక నష్టం మాములుగా ఉండదు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ‘భైరవద్వీపం’ హిట్ కావడంతో మరో జానపద సినిమా తీయాలని అప్పట్లో నిర్మాత గోపాల్ రెడ్డి అనుకున్నారు.

అప్పటికే ఆయన మంగమ్మగారి మనవడు, ముద్దులకృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దులమామయ్య.. వంటి హిట్ సినిమాలు కోడి రామకృష్ణ, బాలయ్య కాంబినేషన్ లో నిర్మించారు. ఆ వూపులోనే ‘విక్రమ సింహ’ మొదలెట్టారు. లయన్ కింగ్, గ్లాడియేటర్ వంటి ఇంగ్లిష్ సినిమాల ఆధారంగా కాసింత మసాలా వేసి త్రిపురనేని మహారథి మంచి స్క్రిప్ట్ అందించారు.

పూజాబాత్రా హీరోయిన్ గా సినిమా మొదలయింది. భారీ ఎత్తున రామోజీ స్టూడియో లో సెట్లు కూడా వేశారు. సినిమా సగ భాగం షూటింగ్ అయ్యాక  సడన్ గా ఆగిపోయింది. సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణాలు  హీరోకి .. దర్శకుడికి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరిగింది.  

ఈ క్రమంలోనే  బాలయ్య  కోడి రామకృష్ణను మార్చమని గోపాల్ రెడ్డి కి చెప్పినట్టు కూడా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. నిర్మాత గోపాల్ రెడ్డి బాలయ్య ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన ఒప్పుకోలేదట. దాంతో కొంత కాలం సైలెంట్ గా ఉన్న గోపాల్ రెడ్డి తర్వాత మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టాలని బాలయ్యను సంప్రదించారట.

‘సీవీ రావు’ అనే  డైరెక్టర్ ను బాలయ్య సూచించారట. ఆయనతో గోపాల్ రెడ్డి మాట్లాడితే సెట్టింగ్స్ అన్ని మార్చాలి … మళ్ళీ సినిమా మొదటి నుంచి తీస్తానని చెప్పారట. అప్పటికే ఏడు కోట్లు ఖర్చుపెట్టిన గోపాల్ రెడ్డి మళ్ళీ కొత్తగా తీసేందుకు సుముఖత చూపలేదు. దాంతో సినిమా అక్కడే ఆగిపోయింది.

అప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఫైనాన్సియర్స్ ఒత్తిడి తట్టుకోలేక  ఆయన సతమతమయ్యారు. దీంతో పాటు ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎన్నో హిట్ సినిమాలు తీసిన గోపాల్ రెడ్డి కి పాపం కాలం కలసి రాలేదు. మనోవ్యధతో  2008 లో గోపాల్ రెడ్డి కన్నుమూసారు.

ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి సినిమాల జోలికి వెళ్ళలేదు.  అతను కూడా 2018లో నెల్లూరు జిల్లా వాకాడులో అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ఇక విక్రమ సింహా దర్శకుడు కోడి రామకృష్ణ ఇదే సినిమా పై ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడారు.

“కొందరు మధ్యవర్తుల కారణంగా సినిమా ఆగిపోయింది అంతే కానీ మరే కారణం కాద”ని చెప్పారు.  ఆ తర్వాత కోడి రామకృష్ణ కూడా 2019 లో కన్నుమూసారు. మొత్తం మీద ముహూర్త బలం కలసి రాక సినిమా పూర్తిగా అటక ఎక్కి కూర్చుంది. అదీ ‘విక్రమ సింహ’ తెర వెనుక కథ. 

————-KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!