Bharadwaja Rangavajhala ………………………………….
ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలకలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి.
మరీ ముఖ్యంగా విప్రనారాయణ. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు రాశిలో తక్కువే కానీ…వాసిలో చాలా చాలా ఎక్కువ. అన్నీ సూపర్ డూపర్ హిట్సే.
ఎన్.టి.ఆర్, ఎఎన్నార్ హీరోలు అనగానే నాచురల్ గా ఘంటసాల పాటలు ఎక్స్ పెక్ట్ చేసేవారు జనం. వేరెవరు పాడినా ఆ పాటలు హిట్ అయ్యేవి కాదు. కానీ మిస్సమ్మ, విప్రనారాయణ సినిమాల్లో ప్రతి పాటా హిట్టే. కారణం…రాజేశ్వర్రావు ట్యూన్స్ కు రాజా వాయిస్ యాప్ట్ కావడమే.
రాజా గాత్రంలో హిందీ గాయకులు తలత్ మెహమూద్ , మహమ్మద్ రఫీల జాడలు కనబడినా రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు.
రాజా వాయిస్ లో ఉన్న ఆ ప్రత్యేకతే ఆయన్ను ఘంటసాల ప్రభంజనాన్ని తట్టుకునేలా చేసింది. ఆ కాలపు సంగీత దర్శకులందరి పాటలనూ ఆలపించారు. కవి భావాన్ని స్వరంలో పలికించడంలో రాజా దిట్ట. విప్రనారాయణలో పాలింపర రంగా పాట వింటే తెలుస్తుందా విషయం.
రాజేశ్వర్రావుది మొదటి నుంచి లలిత సంగీత ధోరణే…ఆయన చేసే డ్యూయట్లలోనూ అదే కనిపిస్తుంది. ఆ లక్షణమే రాజేశ్వరరావును బి.ఎన్ కు దగ్గర చేసింది. విజయావారి మిస్సమ్మలో రావోయి చందమామా లాంటి టిపికల్ సిట్యుయేషనల్ డ్యూయట్ ను రాజాతో హృద్యంగా పాడించేశారు రాజేశ్వర్రావు.
విప్రనారాయణలో భానుమతితో కలసి ఓ డ్యూయట్ పాడారు రాజా. అదీ రాజేశ్వర్రావుగారి ట్యూనే. పాట క్చాచీగా ఉంటేనే హిట్ అవుతుందనే మూఢ నమ్మకం రాజేశ్వర్రావుకు లేదు. ప్రయోగాత్మకంగా ఉన్నా జనం మెచ్చుకుంటారనేది ఆయన థియరీ. అలా చేసిన బాణీ ఎంత హాయిగా ఉంటుందో చూడండి. రాజేశ్వరరావు రాజా కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు కూడా పెద్ద విజయాలే నమోదు చేశాయి.
అందులో రెండు చిత్రాలు విజయా బ్యానర్ లోకి కావడం విశేషం. విజయావారి అత్యధిక చిత్రాలకు సంగీతం అందించిన ఘంటసాల మిస్సమ్మలో ఒక్క పాట కూడా పాడకపోవడం విచిత్రం.సంగీత దర్శకత్వానికి సంబంధించిన వివాదమే దీనికి కారణం అంటారు. ఎ.ఎమ్ రాజా సంగీత దర్శకుడు కూడా. ఆయన ఖాతాలో పెళ్లికానుక లాంటి సూపర్ హిట్ ఉంది. తను మ్యూజిక్ చేసిన శోభలో ఘంటసాలతో పాడించారు.
అలాగే రాజేశ్వర్రావు స్వరరచనలోనే…అప్పు చేసి పప్పు కూడు చిత్రం కోసం ఘంటసాలతో కల్సి ఓ పాట పాడారు. ఎ.ఎమ్.రాజా హాయైన గాత్రంతో దక్షిణాది సినిమా సంగీత ప్రియులను అలరించారు. సంగీత కుటుంబానికే చెందిన జిక్కిని పెళ్లాడారు.
అనుకోకుండా ఓ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన పాటల కోసం వెంపర్లాడలేదు. తన దగ్గరకు వచ్చిన పాటలనే పాడారు. తనను కోరి వచ్చిన వారికి ఏం కావాలో అది హాయిగా ఇచ్చేవారు. జిక్కీ కూడా పదివేల పాటలు పాడి దక్షిణాదిన మధుర గాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె గురించి మరోసారి చెప్పుకుందాం.