గొంతెమ్మ కోరికలతోనే పెళ్లిళ్లు కావడం లేదా ?

Sharing is Caring...

Getting married is not that easy…………………..

ప్రస్తుత వివాహ వ్యవస్థలో “ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి గా ఉంటోందని మగపిల్లల తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు. అందుకు తగ్గట్టే ఆడ పిల్లల కోరికలు వారి తల్లితండ్రుల ఆకాంక్షలు ఉంటున్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అలాగే ఉంటున్నారు.

అబ్బాయి  సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి ఉండాలి . అమెరికా లో ఉద్యోగం అయితే మరీ మంచిది. ఇంకా అబ్బాయి కి  సొంత ఇల్లు, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉండాలి. ఏ దురలవాట్లు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీతో ఉండాలి. ఆడపిల్లల తల్లితండ్రులకు సపోర్ట్ గా  ఉండాలి.

అమ్మాయి కంటే వయసు ఒకటి రెండేళ్లు  మించకూడదు.గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండకూడదు . కేవలం నగరాల్లో సెటిలైనవారే కావాలి.ఆస్తులుండి వ్యాపారం చేసే వారికంటే ఉద్యోగం చేసే వారు కావాలి. తన కంటే మించిన చదువు, కనీసం ఆరుఅంకెల జీతం ఉండాలి. వ్యవసాయం చేసేవారు అసలు వద్దనే వద్దు.

 ఉద్యోగులతో పోటీ పడి సంపాదిస్తున్నప్పటికీ పురోహితులైన అబ్బాయిలు వద్దనే వద్దు అని అమ్మాయిలు పట్టుబడుతున్నారు. మ్యారేజ్ బ్రోకర్లకు అలాంటి సంబంధాలను మాత్రమే చూడమని షరతులు పెడుతున్నారు. ఇక ఎక్కడ అయినా సమాచారం తెలుసుకుని అబ్బాయి తరపు వారు ఫోన్ చేస్తే…. ముందుగా పిల్ల తల్లి మాట్లాడుతుంది.

తండ్రి అసలు సీన్ లోకి రాడు .అబ్బాయి ఫోటో, వివరాలు  పంపండి, మా అమ్మాయిది పంపుతాము అంటారు. పిల్లోడి తండ్రి ఫోటో పంపితే …  వారు మాత్రం పంపరు. ఫోన్ చేసి అడిగితే “ఇంకా అమ్మాయి చూడలేదండి” అంటారు. మళ్ళీ చేస్తే ఇంకో జవాబు చెబుతారు. మళ్ళా నాలుగు రోజులు ఆగి చేస్తే… అబ్బాయి ప్యాకేజ్ నచ్చలేదని చేబుతారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేస్తారు.

పొరపాటున ఎత్తినా కూడా మీరు  చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము” అని విసుగ్గా ఫోన్ పెట్టేస్తారు.ఆ తరవాత  ఫోన్ చేస్తే అసలు ఎత్తరు. అమ్మాయిల విషయానికొస్తే, తల్లి తండ్రుల గారాబం, లేదంటే వారిమాట వినకపోవడం, మితిమీరిన స్వేచ్ఛ, పెళ్లి చూపులనాడే అబ్బాయి ముందు తమ ఇష్టాల జాబితా పెడతారు. కోర్కెల చిట్టా విప్పుతారు.

“మీ అమ్మ నాన్నలు మనతో ఉండడానికి వీలు లేదు,” “నా సెల్ నువ్వు తాకొద్దు.  నీ సెల్ నేను ముట్టుకోను” “నేను వంట చెయ్యను. కూరలు  కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము.. నాజీతం బ్యాంకులో దాస్తాను. నీ జీతం ఖర్చుపెడదాము” అనే వారు ఉన్నారట.

ఇంకా కొంతమంది ” మనకి పిల్లలు వద్దు” అని నిబంధనలు పెట్టేవారున్నారట. అబ్బాయి కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం అంటారట. ఇలా షరతులకు ఒప్పుకుని కూడా తర్వాత సంబంధాలు  రద్దు  చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి.

ఒక వైపు వయసు పెరుగుతున్నా ఎక్కడా కూడా రాజీ పడరు. గతంలో తల్లితండ్రులు చెబితే అమ్మాయిలు ఒప్పుకునే వారు. ఇపుడు పేరెంట్స్ కి నచ్చినా తమకు నచ్చలేదని వచ్చిన సంబంధాలను తిరస్కరిస్తున్నారు. అన్ని కుదిరినా లోతుగా జాతకాలు  పరిశీలించి  పొంతన కుదిరితేనే  తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నో సంబంధాలు చూస్తే కానీ అమ్మాయిలు తుదినిర్ణయం తీసుకోవడం లేదు.

వయసు పెరుగుతున్నా ఇంకా చూద్దాం అన్న ధోరణితో ఉంటున్నారు. వయసు పెరిగే కొద్దీ ఆమె ఏజ్ గ్రూప్ వారు దొరకడం కూడా కష్టమే.ఇక అబ్బాయిలు కూడా పిల్ల నచ్చలేదని ..నల్లగా ఉందని, ఎత్తు తక్కువని, జీతం తక్కువని తిరస్కరిస్తూ ఉంటారు. అయితే ఇపుడు అమ్మాయిలు కూడా మంచి ఉద్యోగాలు  చేస్తూ అబ్బాయిల సెలక్షన్ ఆప్షన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు.

ఫలితంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. లింగ నిష్పత్తి పడి పోతున్న కారణంగా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ప్లస్ దాటినా సంబంధాలు కుదరడం లేదు.ఇక అమ్మాయిల తల్లిదండ్రులు వాదన కూడా ఒక కోణం లో చూస్తే  సమంజసమే అనిపిస్తుంది.

“ఆడపిల్లల తల్లి తండ్రుల మీద ఒత్తి పుణ్యానికే అక్కసు వెళ్లగక్కుతున్నారు. మాకు తగ్గ సంబంధం దొరికినప్పుడే చేసుకుంటాం. అందులో తప్పు ఏముంది. కాబోయే అల్లుడికి మంచి జీతం,ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం తప్పా ? అబ్బాయి వధువు  చక్కగా ఉండాలని… మామగారు బాగా ఉన్నవారు కావాలని  కోరుకుంటున్నపుడు … అమ్మాయి కూడా తనకు నచ్చేవరుడు కావాలనడం తప్పా ? ఆ పాటి స్వేచ్ఛ ఆడపిల్లకు లేదా? మావి గొంతెమ్మ కోరికలా ? అని అమ్మాయిల తల్లిదండ్రులు అంటున్నారు.

ఈ వాదనలు వింటే ఎవరిది తప్పని తేల్చలేము. మొత్తం మీద ఎవరో ఒకరు దిగిరానిదే పెళ్లిళ్లు అంత తొందరగా కుదరవు. మొత్తం మీద ఒక ఇరవైఏళ్ళ నాటి పెళ్లిళ్ల తీరుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!