రావణుడికి సీతపై మోహం కలిగేలా చేసిందెవరు ?

Sharing is Caring...

Srinivasa Krishna patil ……………………..

లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించినవారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్నిఅని ఆమె ఉద్దేశం) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” {తస్యాశ్చ అనృజువత్తాయాః తయోశ్చ హతయోరహం, సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని } అంటూ పిచ్చి ఆవేశంతో గంతులు వేసింది. 

ఖరుడు కూడా ఆమెకు ఆపరిస్థితిని కల్పించినవాడిని ఎవరూ కాపాడలేరని, అతడిని చంపివేసి అతడి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తానంటూ వీరంగాలు వేసి తన అనుచరులను శూర్పణఖ వెంట పంపాడు.రాముడు వారి గుండెలను తన బాణాలతో చీల్చివేశాడు. శూర్పణఖ మరలా ఖరుడి దగ్గరకు పరుగెత్తుకు వచ్చింది.

‘నువు రాముని చంపకుంటే నీముందే నేను ప్రాణాలు వదిలేస్తాను’ అంటూ ఏడిచింది. ‘రామ లక్ష్మణులను చంపలేని నీవేమి శూరుడివి’ అని నిందించింది.’అతనిని చంపు.చేతకాకుంటే నీ అనుచరులతో సహా జనస్థానం వదలి వెళ్లిపో’ అంటూ ఆవేశపడిపోయింది.ఆమె వేధింపులను తట్టుకొనలేక ఖరుడు తన పద్నాలుగు వేలమంది రాక్షసవీరులను వెంటవేసుకుని రాముని ఆశ్రమం చెంతకు వచ్చాడు.  

రాముడు ఖరుని సేనాపతులైన దూషణుని, త్రిశురుని వారి వారి అనుచరులతో సహా హతమార్చేశాడు. చివరకు ఖరుని కూడా సంహరించాడు. చచ్చినవారంతా చావగా ఒక్క అకంపనుడు అనే రాక్షసుడు మాత్రం బ్రతికిపోయాడు.వాడు రావణుని దగ్గరకు పోయి జరిగిన విషయమంతా చెప్పాడు.

రావణాసురుడు కోపంతో ఊగిపోయి అయితే ఇప్పుడే పోయి రామలక్ష్మణులను చంపేస్తాను అన్నాడు. రాజభక్తుడైన అకంపనుడు “వద్దు రాజా,  రాముని యుద్ధంలో జయించడం అసాధ్యం. కాని యుక్తితో చంపవచ్చు.  అతడికి సీత అనే ఉత్తమురాలు అయిన భార్య ఉన్నది.  ఆమె అంటే రామునికి ప్రాణం. ఆమె దూరమైతే రాముడు ప్రాణాలు వదిలేస్తాడు” అని బోధించాడు.

ఆ సలహాను మెచ్చుకున్న రావణుడు తక్షణమే దండకారణ్యానికి పోయి, అక్కడ మారీచుని కలసికొని, తాను రాముని భార్య అయిన సీతను అపహరించదలచుకున్నానని, సహాయం చేయమని అడిగితే, మారీచుడు కలవరపడ్డాడు.

“రాజన్..  క్షుద్రజంతువులను సింహం అవలీలగా వధించే విధంగా, రాక్షసులను అతి సులువుగా వధించే ఈ నరసింహుడైన రాముడు నిద్రిస్తూ ఉండగా (తన దారిన తాను నిశ్చింతగా ఉండగా) నీవు మేలు కొలపడం మంచిది కాదు. లంకకు తిరిగి వెళ్లి, ఇప్పుడున్నట్లే హాయిగా జీవించు, పో” అని నచ్చజెప్పాడు.

రావణాసురుడు కూడా ఆ మాటలలోని నిజాన్ని గ్రహించి, సరేనని అంగీకరించి తిరిగి లంకకు చేరుకుని, ఎప్పటిలాగానే సభలో అమాత్యసహితుడై కూర్చున్నాడు. ఇంత జరిగాక, అప్పుడు ప్రవేశించింది శూర్పణఖ, తెగిన మక్కుచెవులతో ఏడ్చుకుంటూ. రామలక్ష్మణులను కామించింది ఆమె..

సీతపై దాడిచేసింది ఆమె.. వారి ఆగ్రహానికి గురై ముక్కుచెవులు పోగొట్టుకుంది.  వారిని చంపి పగతీర్చుకొనదలచింది ఆమె. ఖరాది రాక్షసులను రెచ్చగొట్టి వారిపై పంపింది ఆమె. సమస్త సైన్యంతో సహా వారందరి మరణానికి కారణమైంది కూడా ఆమె.

అటువంటి శూర్పణఖ చేసిన తప్పులను గూర్చి, ఆ తప్పులవల్లనే తనకు అంతటి సైన్యం నష్టమైందని అప్పటికే తెలుసుకున్న రావణుడు తానే స్వయంగా ఆమె ముక్కు చెవులు కోసేసేవాడేమో మరి, కాని లక్ష్మణుడు తానే ముందుగా ఆ పని చేసేశాడు.

శూర్పణఖ మాత్రం,తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ నిజాలు చెప్పకుండా తాను చేసినదంతా తన అన్నకోసమేనంటూ, అందుకు అడ్డువచ్చిన రామలక్ష్మణులదే తప్పు అని మొర పెట్టుకుంది.

“ఎవడా రాముడు? ఎందుకు వారితో నీకు తగవు వచ్చింది?” అని అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు అడిగాడు రావణుడు.“నేను వారిని మోహించి వారి చెంతకు వెళ్లాను” అని ఎలా చెప్పుకోగలదు?

ఒకవేళ చెబితే, “సిగ్గులేదా శూర్పణఖా?  నా మొగుడు నాకు ప్రాణప్రియుడు, అతడిని నువు చంపేశావు, ఇక నా గతి ఏమిటి అని నువ్వు నా దగ్గరకొచ్చి ఏడిస్తే అందుకు పరిహారంగాను, నీ మనశ్శాంతికిగాను నిన్ను దండకారణ్యానికి పంపాను. అక్కడ చేరి నువు చేసిన ఘనకార్యం ఇదా” అని అన్న ఈసడించుకోడా?

అందుకని, తాను నిజంగా చేసినదంతా దాచేసి, అన్నగారికి సంతోషం కలిగించడం కోసమే తానొక పని చేశాను అన్నట్టు కట్టుకథలు అల్లి చెప్పేసింది. కామాంధుడైన అన్నకు నచ్చే కథనే చెప్పింది. “అన్నా, రాముడనే రాజకుమారుడొకడు లక్ష్మణుడనే తన తమ్మునితోను, సీత అనే తన భార్యతోను మన దండకారణ్యానికి వచ్చి నివసిస్తున్నాడు.

 ఆహాహా, సీత ఎంత చక్కనిదో తెలుసా? సా సుకేశీ సునాసోరుః సురూపా చ యశస్వినీ, దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా” – అంటూ మొదలు పెట్టి రావణాసురునికి మత్తెక్కేలా సీత అందాన్ని వర్ణించి,వర్ణించి చెప్పింది.

“సీత ఎవరికి భార్య అవుతుందో, అతడిదే అసలైన అదృష్టం. తవానురూపా భార్యా స్యాత్, త్వం చ తస్యాస్తథా పతిః (ఆమె నీకు భార్య కాదగినది. నీవు ఆమెకు భర్త కాదగినవాడవు)” అని చెప్పి స్త్రీవ్యామోహమనే అతడి బలహీనతను కనిపెట్టి దానిపైనే గట్టి దెబ్బ కొట్టింది.

సరే. మరి రామలక్ష్మణులతో పేచీ ఎందుకొచ్చిందో కూడా చెప్పాలి కదా? చెప్పింది, అన్నకు అమాంతం తన మీద ఎంతో ప్రీతిని కలిగించే మాటలనే చెప్పేసింది. “ఓ మహాభుజుడా, ఆ సుందరాంగిని తెచ్చి నీ భార్యగా చేయాలనే నేను ప్రయత్నం చేశాను.అప్పుడు క్రూరుడైన లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసి నాకు వికృతాకారం కల్పించాడు.ఇలా అవలీలగా అబద్ధమాడేసింది. అన్నను బుట్టలో పడేసింది.  

నీకు ఆనందం కలిగించేందుకు ప్రయత్నించినందువల్లనే నాకు ఈ దురవస్థ కలిగింది అని చెప్పకనే చెప్పేసింది. నిజానికి శూర్పణఖ సీతను చంపేసి శ్రీరాముడిని పెండ్లాడాలనే ఉద్దేశంతో సీతపై దాడి చేసింది. ఆ ప్రయత్నం విఫలమైన తరువాత సీత రక్తాన్ని త్రాగాలి చంపమంటూ ఖరుడిని ఉసిగొలిపింది.

చివరకు ఖరుడితో సహా రాక్షసులందరూ హతమయ్యాక, నీకోసం చేసిన సాహసం వల్లనే నాకు ఇటువంటి గతి పట్టింది అన్నయ్యా అంటూ నంగనాచి మాటలు మాట్లాడింది.కాని శూర్పణఖ చెప్పిన మాటలలోని సత్యాసత్యాలన్నీ రావణుడికి స్పష్టంగా ముందే తెలుసు. అయినప్పటికీ సీత అందాన్ని శూర్పణఖ వర్ణించి వర్ణించి చెప్పగానే రావణాసురుడు మోహంలో  పడిపోయాడు.

చెల్లెలు దండనార్హురాలు అనే విషయం పూర్తిగా విస్మరించాడు. అయితే అతడు అలా రాయిలా కదలక మెదలక ఉండిపోతే రామలక్ష్మణులపై తన పగ తీరేదెలా?  అందువల్ల శూర్పణఖ అన్నను రెచ్చగొట్టింది.

“ఇదుగో, నువ్వు సీతను భార్యగా కోరుకుంటే వెంటనే బయలుదేరు. రాముడిని చంపేసి, ఖరదూషణాదులకు ఆత్మశాంతిని కలిగించు. (నాకు మనశ్శాంతిని కలిగించు, నాకోసం ప్రతికారం చెయ్ – అని చెప్పలేకపోయింది పాపం.) నీ బాణాలతో లక్ష్మణున్ని హతమార్చు. మరో దిక్కు లేక సీత నీకు వశమైపోతుంది. నువు హాయిగా సుఖపడవచ్చు.” అని రావణాసురుడు కోరుకునే ‘కర్తవ్యబోధ’ చేసింది.

అప్పుడు రావణుడు బయలుదేరాడు. ఎందుకు?  ఖరదూషణుల వధకు ప్రతిక్రియ చేయడానికి కాదు,తన చెల్లెలికి జరిగిన పరాభవానికి ప్రతికారం తీర్చుకొనడం కోసం కూడా కాదు. కేవలం తన వ్యామోహం కొద్దీ సీతమ్మవారిని అపహరించడానికి. రామలక్ష్మణుల జోలికి పోతే తనకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి నంగనాచి చెల్లెలి పగను తీర్చిపెట్టే విపత్కరసాహసానికి అతడు ఒడిగట్టలేదు.

మారీచుడు మరలా రాముడితో వైరం పెట్టుకోవద్దని సూచిస్తే, అప్పటికే మోహాంధకారంలో నిలువునా కూరుకుపోయిన రావణాసురుడు, నాకు సాయం చేయకుంటే చంపేస్తానని బెదిరించి చివరకు ఆ మారీచుని సహాయంతోనే మాయ చేసి సీతాపహరణం చేశాడు.కానీ, తన చెల్లెలి పగను మాత్రం తీర్చలేదు. పాపం శూర్పణఖ.తాను ముక్కిడియైన ముచ్చటలు, తన నంగనాచి మాటలు అన్నకు తెలియవనుకుంది.

తెలిస్తే మాత్రం అన్నకు కలిగిన లాభం గాని, ఆమెకు కలిగిన నష్టం గాని ఏముంది గనుక?  ఆ విధంగా ఆమె అన్నను రెచ్చగొట్టి సీత జోలికి పోయేలా చేసి, చివరకు అతడి వినాశనానికి కారణమైంది. పుట్టింటి కొంపను లోనుండి తగలబెట్టిన నిప్పుగా మారింది. తాను పుట్టిన రాక్షస జాతిని సుడు గాడుకు పంపింది.

ఇదీ జరిగిన కథ.

మన తెలుగు సినిమా  ఔత్సాహిక-డైరెక్టరు ఎవడైనా ఈ వ్యాసాలు చదివి “శూర్పణఖాప్రతికారం” అనే పేరుతోనో మరో పేరుతోనో తన భర్తను చంపిన అన్నను యుక్తిగా రాముని చేత చంపించి, తన వదినగారికి వైధవ్యం తెచ్చిపెట్టిన  మహా ధీశాలినిగా ఒక సినిమా తీసినా తీస్తాడు.

ఆ కథ ఆధునికం కావచ్చు. పాత్రల పేర్లు మారవచ్చు. కాని,మిడిమిడి జ్ఞానం వాళ్లకు సత్యమేమిటో తెలిస్తే మన రంగనాయకమ్మ & కో వారలు తమ మొహాలు దాచుకొనేందుకు తగిన వస్తువు ఏమీ దొరకకపోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!