Bharadwaja Rangavajhala………………………………………………..
విఠలాచార్య ….. ఈ పేరు వినగానే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ఇతర దర్శకులు జానపదాలు తీసినప్పటికి విఠలాచార్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉండేది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి చేసే హడావిడి చూడ్డానికి ఆయన సినిమాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. దెయ్యాలను ఆబాలగోపాలం అభిమానించేలా చేయడం ఆయన వల్లే అయ్యింది. వెరసి ఆ జనరేషన్ పిల్లలకు విఠలాచార్య ఒక చిన్నప్పటి జ్ఞాపకం.
విఠలాచార్య నాలుగైదు సాంఘికాలు తీశారు. కానీ ఆయనకవి అచ్చి రాలేదు. బీదలపాట్లు, పల్లెటూరి చిన్నోడు సినిమాలు ఆ విధంగా వచ్చినవే. ఆ రోజుల్లో విఠలాచార్య జానపద సినిమాలు అనేక భాషల్లోకి డబ్ అయ్యేవి. ఆఫ్రికా దేశాల్లోనూ, మలేషియా లోనూ కూడా విఠలాచార్యకు డిమాండు ఉండేది. ఎందుకంటే ఆయా ప్రాంతాల ప్రాంతీయ భాషల్లో ఆయన సినిమాలు డబ్ అయ్యేవి. ఆ రోజుల్లో తమిళ్ లోకి డబ్బై డబ్బులు తెచ్చిన సినిమాలు విఠలాచార్య తీసిన జానపదాలే. అరవై ఏడు ప్రాంతాల్లో దక్షిణ భారతంలో హయ్యస్ట్ పెయిడ్ డైరక్టర్ గా రికార్టు సృష్టించారు విఠలాచార్య.
1920 జనవరి 28న కర్ణాటక ఉడిపిలో పుట్టారాయన. ఫస్ట్ ఫారమ్ అంటే ఆరో తరగతితోనే చదువు ఆపేశారాయన. నవలలు చదవడం అంటే ఎక్కువ ఇంట్రస్టు ఉండేది. అలాగే చరిత్రకు సంబంధించిన విశేషాంశాలతో వచ్చే పుస్తకాలు చదివే అలవాటు ఆయనకు చాలా ఎక్కువ. ఈ పిచ్చతోనే ఆయన మూడు వేలకు పైగా పుస్తకాలు కొన్నారు. మద్రాసులో ఆయన ఇల్లు ఓ లైబ్రరీలా ఉండేది.చదువు ఆపేసిన తర్వాత కర్ణాటకలోనే అరిసికరై అనే ఊళ్లో ఉన్న అన్నగారి హోటల్ లో పనిచేయడానికి వెళ్లారు.
ఆ ఊళ్లోకి ప్రవేశించగానే అక్కడి కొండమీదున్న వెంకటేశ్వరస్వామి గుడికివెళ్లి…స్వామీ నేను తుండుగుడ్డతో మీ ఊరొచ్చాను. నన్ను ఏం చేసినా నువ్వే చేయాలి అన్నారట. తను సినిమా దర్శకుడై నిర్మాతై నాలుగు రాళ్లు సంపాదించడానికి ఆ వెంకటేశ్వరుడే కారణం అనే నమ్మకం ఆయనలో ఉండేది. అందుకే తాను సంపాదిస్తున్న రోజుల్లో ఆ గుడి ఎలక్ట్రికల్ పనులకు అయిన ఖర్చు అంతా తానే భరించారాయన.
హోటల్ లో పనిచేస్తూనే నాటకాలు ఆడడం ప్రారంభించారు. ఆ కాలం అందరు యువకుల్లాగే స్వతంత్రోద్యమంలో పాల్గొని మూడు సార్లు జైలుకు కూడా పోయారు. ఐదేళ్లు రాజకీయాల్లో ముమ్మరంగా తిరిగి 43 ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారంలో పడ్డారు. ఈ సారి హోటల్ బిజినెస్సు కాదు … టూరింగు టాకీసు వ్యాపారం … ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో కొందరు స్నేహితుల్ని కలుపుకుని చిన్న చిన్న కన్నడ సినిమాలు తీయడం ప్రారంభించారు.
ఆ సినిమాల్లో ఎప్పుడన్నా కామెడీ వేషం ఉంటే చేసేవారు తప్ప దర్శకత్వానికి మాత్రం వేరే వారిని పెట్టుకునేవారు. విఠలాచార్యతో పాటు తెలుగులో జానపద చిత్రాలు తీయడంలో పాపులార్టీ సంపాదించిన దర్శకుడు జి.విశ్వనాధం కూడా విఠలాచార్య నిర్మాణంలో వచ్చిన కన్నడ సినిమాకు దర్శకత్వం వహించినవారే. ఒక సినిమా అయ్యాక విశ్వనాథం సినిమా కమిట్ అయి హ్యాండు ఇవ్వడంతో తనే ఆ బాద్యత భుజాన వేసుకుని దర్శకుడు అయ్యారు విఠలాచార్య.
కన్నడ సినిమాలు హిట్టైనా మిగిలే డబ్బులు తక్కువ కావడంతో 53 ప్రాంతాల్లో తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకుని విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో ముందుకు వచ్చారు. తెలుగులో మొత్తం ఇరవైకి పైగా సినిమాలు నిర్మించారు. విఠలాచార్య మద్రాసు వచ్చినప్పుడు ఆయనకు బాగా సాయం చేసిన వ్యక్తి నాగిరెడ్డి. కన్నడ సినిమా వసూళ్లు చాలా తక్కువుంటాయని చెబితే … స్టూడియో రేటు తక్కువ చేసి ఇచ్చేవారట నాగిరెడ్డి. ఓ సారి విఠలాచార్య తీసిన ఓ కన్నడ సినిమా భారీగా దెబ్బతిని స్టూడియో బకాయిలు చెల్లించలేకపోయారు. దీంతో స్టూడియో అద్దె కింద ఆ సినిమా రీమేక్ హక్కులు నాగిరెడ్డిగారికి రాసిచ్చేశారట విఠలాచార్య.
అదే సినిమాను తెలుగులో గుండమ్మకథ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్టు కొట్టారు విజయాధినేతలు. దాదాపు యాభై సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో జై భేతాళ అనే త్రీడీ సినిమా కూడా ఉండడం విశేషం. విఠలాచార్య హీరోలని అప్రోచ్ అయినప్పుడు వారి దగ్గర నుంచీ చాలా తక్కువ కాల్షీట్స్ తీసుకునేవారు.
ఓ సారి ఎన్టీఆర్ ను కాల్షీట్స్ అడిగారాయన. వారం రోజులు మాత్రమే డైరీ ఖాళీ ఉందని జవాబు చెప్పారు అన్నగారు. ఆ వారం నాకివ్వండి సినిమా తీసుకుంటాను అన్నారు విఠలాచార్య. కానీ రామారావుకు భయం వేసింది. వారం రోజులూ తనను ఏ డ్యూయట్లకో వాడుకుని ఆ తర్వాత శాపవశాన ఏదో అయిపోయానని చూపిస్తాడేమో అని భయపడి ఆ డేట్స్ ఇవ్వడానికి నిరాకరించారు ఎన్టీఆర్.
అయితే డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో ఎన్టీఆర్ తో జానపద చిత్రం ప్లాన్ చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. అడవిరాముడు తర్వాత ఎన్టీఆర్ తో తను చేసిన సినిమా అదే సింహబలుడు. ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాపు కోసం ఆలోచించి జానపదాన్ని ఎంచుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కృష్ణ ను హీరోగా పెట్టి సింహగర్జన తీయ సంకల్పించారు గిరిబాబు. దేవతలారా దీవించండి సినిమా తీసి సక్సస్ మీదున్నారు గిరిబాబు.
దీంతో కొమ్మినేని డైరక్షన్ లోనే తను ఒక హీరోగా కృష్ణ మరో హీరోగా సినిమా అనౌన్స్ చేశారు. అదే సమయంలో … విఠలాచార్య తన సొంత సంస్ధలో నరసింహరాజు, జయమాలిని కాంబినేషన్ లో జగన్మోహిని అనౌన్స్ చేశారు. ఈ మూడు జానపదాల్లోనూ జగన్మోహిని సినిమానే ఎక్కువ వసూలు చేసిందనేది అప్పటి మార్కెట్ టాక్ . అలా జానపదాల్లో తనకు ఎదురు లేదని ప్రూవ్ చేసుకున్నారాయన.
విఠలాచార్యగారికి నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు. ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాసాచార్య కూడా దర్శకుడే. విఠల్ బ్యానర్ లోనే ఆయన కొన్ని సినిమాలు డైరక్ట్ చేశారు. కానీ పెద్దగా రాణించలేదు. యూట్యూబ్ లో విఠలాచార్యుడి జానపద సినిమాలు బోలెడున్నాయి.