ఎవరీ స్టిల్స్ భూషణుడు ?

Sharing is Caring...

డ్రీమ్ గాళ్ హేమమాలిని, గ్లామర్ స్టార్ కాంచన, అభినేత్రి వాణిశ్రీ ఇలా అనేక మంది తారల తొలి మేకప్ స్టిల్స్ తీసిన ఖ్యాతి గొల్లపల్లి నాగ భూషణరావు అలియాస్ స్టిల్స్ భూషణ్ ది.   బాపు తీసిన దాదాపు అన్ని సినిమాలకూ భూషణే స్టిల్ ఫొటోగ్రాఫర్. ఏవో చిన్న అభిప్రాయబేదాలతో సంపూర్ణ రామాయణం మరింకేదో సినిమాకు ఆయన పనిచేయలేదు. తప్ప బాపు తీసిన సినిమాలన్నిటికీ ఆయనే స్టిల్స్ తీశారు. 

సాక్షి నుంచీ బాపుగారి సినిమాల స్టిల్స్ దొరకాలంటే భూషణే మార్గం ఎవరికైనా. స్టిల్స్ భూషణ్ గా ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఆయనకు ఎన్టీఆర్ తో అనుబంధం ఏర్పడింది. భూషణ్ లోని స్పార్క్ నచ్చి తన పర్సనల్ కెమేరామెన్ గా తీసుకున్నారు. నిజానికి భూషణ్ స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేసిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించిన మంగమ్మ శఫథం. డి.విఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఏర్పడింది.

అలా ఎన్టీఆర్ తో ఏర్పడిన అనుబంధం చివరి వరకు కొనసాగింది. సినిమాలను వదలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కావాలని మద్రాసులో ఉన్న భూషణ్ ను హైద్రాబాద్ తీసుకువచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఉన్నంతకాలం ఆయన ఏ సమావేశంలో పాల్గొన్నా భూషణే కవర్ చేసేవారు. అందుకే ఆయన దగ్గర తెలుగుదేశం పార్టీ సమావేశాల నుంచీ నేషనల్ ఫ్రంట్ సమావేశాల వరకు ఫొటోలు దొరికేవి.

ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారు…ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓ పొజిషన్ లో ఉండి తమ ముఖాన్ని ప్రపంచానికి మరింత అందంగా చూపించాలనుకున్న వాళ్లూ…ఆయన ముందు క్యూ కట్టే వారు.  భూషణ్  ఫొటో తీస్తే … అందులో బోల్డు కొత్త అందాలు కనిపిస్తాయి. ఇది నేనేనా అని ఫొటో తీయించుకున్న వాళ్లు అబ్బురపడేలా తీయడం ఆయన స్పెషాల్టీ.

అలా ఆయన దగ్గర ఫొటోలు తీయించుకున్నోళ్లల్లో దర్శకులు కూడా ఉన్నారు. బి.ఎన్ రెడ్డి ,. కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూధనరావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బాపు, విశ్వనాథ్ లాంటి దర్శకుల అపురూప చిత్రాలు భూషణ్ ఖాతాలోనే దొరుకుతాయి. ఎన్‌. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరోలే కాదు. శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, మల్లాది, దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాంటి కవులను కూడా ప్రపంచానికి సరి కొత్తగా చూపించే అందమైన ఫొటోల ను భూషణ్‌ తీశారు.

1948లో ఏడు రూపాయలు పెట్టి కెమేరా కొని ఫొటోలు తీయడం మొదలెట్టారు భూషణ్. ఆ తర్వాత తను చివరి రోజుల్లో వాడిన కెమేరా ఖరీదు లక్షా యాబై వేలు. ఈ మధ్యలో ఆయన ప్రయాణం మద్రాసులోని తెలుగు పత్రికలకు సినిమా ఫొటోలతో పాటు ఇతర ఫొటోలు ఇవ్వడంతో కొత్త మలుపు తిరిగింది.అలా ఫ్రీలాన్స్ ఫొటోలు తీస్తున్న సమయంలోనే చెన్నైలో జరిగిన చిత్రోత్సవాల్లో అక్కినేని నాగేశ్వరరావును పొటోలు తీశారు. అవి ఆయనకు నచ్చాయి.

ఆ తర్వాత అక్కినేని కుటుంబాన్నీ ఫొటోలు తీశారు. అలా స్టిల్ ఫొటోగ్రాఫర్ గా ఎదుగుతూనే బాపుగారితో ఏర్పడ్డ స్నేహం వల్ల సాక్షిలో నటించే అవకాశం వచ్చింది.రాజమండ్రిలో తొలి స్టూడియో కట్టి సంపూర్ణ రామాయణం తీసిన నిడమర్తి ఫ్యామ్లీతో భూషణ్ కు అనుబంధం ఉండేది. అలా నిడమర్తి మూర్తి ద్వారా సినీ ప్రవేశం చేశారు. ఆ తర్వాత రైల్వే సర్వీస్‌ కమిషన్‌లో అసిస్టెంటు ఫొటోగ్రాఫర్‌గా ఉద్యోగం సంపాదించారు. వృత్తి, ప్రవృత్తీ ఒకటే కావటంతో ఆ ఉద్యోగాన్ని భూషణ్‌ ఎంతగానో ఇష్టపడి చేశారు. ఉద్యోగం చేస్తూనే ఎన్నో సినిమాలకు స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎపి విజువల్‌ మీడియా సెల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ట్యాంక్‌ బండ్‌ మీద విగ్రహాల ప్రతిష్ట సమయంలో సహకారం అందించారు. సినీరంగ ప్రముఖులవే కాకుండా తెలుగు భాషా సంస్కృతీ వికాసానికి సేవలందించిన వివిధ రంగాల ప్రముఖుల లామినేటెడ్‌ ఫొటోలను అపురూపంగా పదిలపరచారు. దాదాపు 16,000 నెగెటివ్స్‌, ఆర్చివ్స్ తో  ఆయన ఇల్లు ఒక మ్యూజియంలా, గ్యాలరీలా ఉండేది. ఫొటో అంటే నాలుగు ఫ్రేముల మధ్య ఇరుక్కున్న బొమ్మ కాదు…అందమైన జ్ఞాపకం అని చెప్పిన భూషణ్ లేని లోటు తెలుగువారికి తీర్చలేనిది.

భూషణ్ కాస్త కాస్ట్లీ. ఆయనెంత అడిగితే అంతా ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే అంగీకరించేవాడు కాదు. అందుకే ఓ సారి ముళ్లపూడి వేరే దారికి మళ్లారు. అయితే మళ్లీ స్నేహం కుదిరింది అది ఎన్టీఆర్ తో తీసిన శ్రీనాధ కవిసార్వభౌముడు వరకూ కొనసాగింది. విజయచిత్ర కు రంగుల ఫొటోలన్నీ భక్త తీసేవాడు.

అయితే సెట్స్ మీదకు వెళ్లి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తీసేది ఎవరు అనుకున్నప్పుడు భూషణ్ రంగంలోకి వచ్చారు. ఆ పత్రికతో చాలా కాలం భూషణ్ బంధం కొనసాగింది.ఆ రోజుల్లో భూషణ్ సినిమా జర్నలిస్టు గౌతమ్, మైకు రామారావు కలసి కల్పనా ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఒక పబ్లిసిటీ కంపెనీ కూడా నడిపారు.

హేమమాలిని సినిమా రంగంలో ప్రవేశించడానికి భూషణే గేట్ వే. ఆయన తీసిన ఫొటోలు చాలా బావుండేవి. ఆ ఫొటోల్లో ఉన్న వ్యక్తులే అందులో ఉంది తామేనా అని ఆశ్చర్యపడిపోయేసేంత బావుండేవి. ఆదుర్తి సుబ్బారావుగారు విశాలనేత్రాలు సినిమా తీయాలనుకున్నప్పుడు భూషణ్ దగ్గరున్న హేమమాలిని పొటోలు చూసి ఈ అమ్మాయే హీరోయిన్ అన్నారు.

తీరా హేమమాలినిని పిల్చి చూసి అబ్బే అన్నారు. అంత గొప్పగా తీసేవారాయన. అయితే ఆ తర్వాత రోజుల్లో అదే హేమమాలిని సినిమాల్లోకి వచ్చి డ్రీమ్ గర్ల్ అనిపించుకున్నదనుకోండి. మహాకవి శ్రీశ్రీ ఫొటోలు అని ఎవరు వేసినా..  చూపించినా అవి భూషణ్ తీసినవే. వేళ్ల మధ్య సిగరెట్టు బిగించి దమ్ములాగుతున్న శ్రీశ్రీ ఫొటో చాలా పాపులర్ . ఆ ఫొటో భూషణ్ తీసినదే.

తన మనసుకు నచ్చిన కొందరు ప్రముఖులను ఇంటికెళ్లి మరీ ఫొటోలు తీసేవారు. భూషణ్ ఒంటరే. ఆయన జీవితాంతం కెమేరాతోనే ప్రయాణించారు. గోరంతదీపం సినిమాకు భూషణ్ తీసిన స్టిల్ ఫొటోలతో ఒక పుస్తకం అచ్చేయించారు బాపు రమణలు. అలాగే బాపుగారే తీసిన కలియుగ రావణాసురుడుకి అయితే ఆయన తీసిన స్టిల్స్ కు కొదవే లేదు.

అప్పట్లో ఓ సాంప్రదాయం ఉండేది. రిలీజవబోయే సినిమా స్టిల్స్ థియేటర్లలో ప్రదేర్శించేవారు. విశ్రాంతి సమయాల్లో ప్రేక్షకులు ఈ స్టిల్ బాక్సుల దగ్గర నిలబడి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే కాఫీలు టీలు గట్రా తాగేవారు. అలా భూషణ్ స్టిల్స్ తో తొలి రోజు సినిమాకు ఆడియన్సును రప్పించిన సందర్భాలున్నాయి.

భూషణ్ ఎవరితోనైనా ఇట్టే కలసిపోయేవాడు. స్నేహం చేసేవాడు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు పాత్రికేయులందరినీ ఫొటోలు తీసి భద్రపరచాడు. భూషణ్ భాండాగారంలో దొరకని ఫొటో ఉండదు. ఉదాహరణకు బయట పెద్దగా దొరకని పింగళి నాగేంద్రరావుగారి పొటోలు కూడా భూషణ్ దగ్గర దొరికాయి.

అలాగే పింగళి, సముద్రాల , కె.విరెడ్డి లాంటి మహామహులు కలసి ఉన్న ఫొటోలు కూడా ఆయన దగ్గర నిక్షిప్తం. నిజానికి తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి చిత్రాధారాలు ఆయన దగ్గరే దొరికేవి.బాపు రమణలతో చిత్ర పరిశ్రమలోనే భూషణ్ కు పరిచయం.

కానీ వారు ముగ్గురూ కలిసున్నప్పుడు చూసినోళ్లు వాళ్లు చిన్ననాటి మిత్రులేమో అనుకుంటారు. ఎంతటి వారితో అయినా పరిచయమైన కొద్ది సేపటికే నువ్వు అంటూ మాట్లాడేయడం భూషణ్ స్టైల్. అలా బాపుగారిని నువ్వు అనే పిల్చేవారాయన. బాపు రమణల సినిమాలే కాదు … వారింట్లో ఏ ఫంక్షన్ అయినా భూషణే ఫొటోలు తీయాలి. తీసారు కూడా.

తెలుగు సినిమా స్టిల్ కెమేరా విభాగపు చరిత్రలో భూషణ్ ది ఒక శకం. సినిమా నిర్మాణంలో చాలా మంది కంట్రిబ్యూషన్ ఉంటుంది. అన్నీ బయట ప్రపంచానికి చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. సినిమాలకు సంబంధించి నిశ్చల ఛాయాగ్రాహకులు మన సత్యం, బౌనా తదితరులు ఉండేవారు. వీరిలో సత్యం బౌనా మాత్రం చాలా సినిమాలకు చేసేవారు. భూషణ్ తన కెరీర్ మొత్తంలో యాభై సినిమాలకు మాత్రమే స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేశారు. వంద సినిమాలకు పైగా పబ్లిసిటీ వ్యవహారాలు చూశారు. 2013 లో భూషణ్  అనారోగ్యంతో కన్నుమూసారు. 

——————–  Bharadwaja Rangavajhala

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!