Key Maoist leader ………………..
ఛత్తీస్‌గఢ్‌లో మే 21 న భద్రతా బలగాలు..మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు బొదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు.ఆయన ఈమేరకు ఒక ట్వీట్ కూడా చేశారు.
నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లో 30 మంది మృతి చెందారు.ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కేశవరావు పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావుపై కోటిన్నర రూపాయల రివార్డును కొంతకాలం క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎదురుకాల్పుల్లో కేశవరావుతో పాటు మరికొందరు కీలక నేతలు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.
CM చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావే. అలాగే 2010లో 76 మంది CRPF జవాన్ల మృతిలోనూ కేశవరావుదే కీలకపాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018 నుంచి పార్టీకి సుప్రీం కమాండర్‌గా కేశవరావు వ్యవహరిస్తున్నారు.
బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ నుంచి ఆయన శిక్షణ పొందారు. కేశవరావు గెరిల్లా వ్యూహాలు రచించడం, ఐఈడీలు పేల్చడంలో దిట్ట.కాలేజీ రోజుల్లోనే నక్సలిజానికి ఆకర్షితుడై ఉద్యమంలోకి ప్రవేశించారు.
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న అలియాస్ ప్రకాశ్ అలియాస్ దారపు నరసింహారెడ్డి 1955లో శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు.వరంగల్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి నంబాల కేశవరావు బీటెక్ చేశారు. 1975 లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU)లో పనిచేశారు.
1980 నుంచి ఆంధ్రప్రదేశ్ CPI (ML) పీపుల్స్ వార్ కీలక నిర్వాహకులలో ఒకరు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో మొదటి కమాండర్ గా పనిచేశారు.1992 నుంచి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు.2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ లీడర్ గా,పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులయ్యారు.
చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో వివిధ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది. ఏపీలోని ఎమ్మెల్యే కిడారి ఈశ్వరరావు హత్యకు నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారి అంటారు. 2010 దంతేవాడలో జరిగిన భారీ బ్లాస్ట్ కు ఆయనే సూత్రధారి.జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.
తొలుత ఈ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అనుమానాలు వ్యక్తం చేసింది. “మృతుల్లో నంబాళ్ల కేశవరావు లేరని మాకు సమాచారం ఉంది. పోలీసులు కావాలనే మైండ్‌గేమ్ ఆడుతున్నారు” అన్నది. గతంలోనూ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై పౌరహక్కుల సంఘం ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే ఇప్పుడు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం తో నంబాల మృతి చెందాడని నిర్ధారించుకోవచ్చు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది.