ఎవరీ మెకంజీ స్కాట్ ? ఏమిటో ఆమె కథ ?

Sharing is Caring...

ఆస్తిపాస్తులు … డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ  చాలామంది సామాజిక సమస్యల పట్ల స్పందించరు. కనీసం చిన్న చిన్న దానాలు కూడా చేయరు. కానీ మెకంజీ స్కాట్ అలాంటి వ్యక్తి కాదు. తనకున్న కోట్లకొలది సొమ్మును దానం గా ఇస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి వాళ్ళు దేశానికి ఒకరు ఉంటే చాలు. ఆ దేశంలో అవిద్య, పేదరికం కొద్దిగా నైనా తగ్గుముఖం పడతాయి.

ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ ర్యాంకులో ఉన్న మెకంజీ స్కాట్‌ 400 కోట్ల డాలర్ల(సుమారు రూ. 29,400 కోట్లు)ను దానం చేశారంటే అదేమీ చిన్న విషయం కాదు. ఆమె కీర్తిప్రతిష్టలు ఆశించి ఇలాంటి దానాలు చేయడం లేదు. మనసున్న మనిషిగా,బాధ్యత గల రచయిత్రి గా, సమాజం లో మార్పు కోరే మనిషిగా తనకు సంక్రమించిన ఆస్తులను దానం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు.  అరుదుగా పుడుతుంటారు.

అసలు ఎవరీ మెకంజీ స్కాట్ ?

కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో పుట్టి పెరిగిన మెకంజీ స్కాట్ 1992 లో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం లో డిగ్రీ వరకు చదువుకుంది. మెకంజీ .. జెఫ్ 1992 లో మొదటిసారిగా కలుసుకున్నారు, ఇద్దరూ హెడ్జ్ ఫండ్ డిఇ షా లో పనిచేశారు. 93 లో వివాహం చేసుకున్నారు, 1994 లో సీటెల్కు వెళ్లారు. జెఫ్ బెజోస్ 1994 లో తమ సీటెల్ గ్యారేజీలో ‘అమెజాన్‌’ను స్థాపించారు. ఆ వ్యాపారం అనూహ్యమైన వృద్ధి సాధించి … బహుముఖంగా విస్తరించింది.

దీంతో  బెజోస్ మల్టీ బిలియనీర్ అయ్యారు. బెజోస్ తో వివాహం అయిన ఇరవై అయిదు ఏళ్ళ తరువాత మెకంజీ దంపతులు  2019 జనవరిలో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు అబ్బాయిలు. ఒక అమ్మాయి (దత్తు తీసుకున్నారు) బెజోస్ మామూలు విలాస పురుషుడు కాదు.. ఈ క్రమంలోనే కొత్త స్నేహాల మోజులో పడ్డాడు. అమెరికన్ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్‌ తో పరిచయాలు పెరిగి ఆమె తో తిరగడం మొదలెట్టాడు .

ఇది తెల్సి సహించలేని మెకంజీ విడాకులకు దరఖాస్తు చేసింది. కోర్టు బయట ఒప్పందం కుదిరింది. 38 బిలియన్ డాలర్ల కు ఒప్పందం ఖరారు అయింది. అమెజాన్ షేర్లలో అనూహ్యంగా పెరుగుదల రావడంతో ఆమె ఆస్తి 60 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. విడాకుల  ఒప్పందం ప్రకారం, 49 ఏళ్ల స్కాట్ కు సుమారు 19.7 మిలియన్ అమెజాన్.కామ్ షేర్లు లభించాయి. 38.3 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీలో ఆమెకు నాలుగు శాతం వాటా వచ్చింది.

ఒక్కసారిగా ఆమె స్టేటస్ మారిపోయింది. విడాకుల ద్వారా వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయాలని భావించింది. కోవిడ్‌-19 బాధితులను ఆదుకునేందుకు మెకంజీ భారీ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. యూఎస్‌లో ఆరోగ్యం, ఆహారం, ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంగా 384 సంస్థలకు  పెద్దఎత్తున నిధులు అందజేశారు.

ఫుడ్‌ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు 4.1 బిలియన్‌ డాలర్లను ఇచ్చారు. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి, ఉపాధి శిక్షణ, న్యాయ సంరక్షణ తదితర ఖర్చుల కోసం  మరికొన్ని నిధులను అందించారు. జెఫ్‌ బెజోస్‌ నుంచి విడిపోయినప్పుడు తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు ఖర్చు పెడతానని ప్రకటించారు.

ఆ వితరణ కోసం 6,500 స్వచ్చంద సంస్థలను పరిశీలించాక 384 ఆర్గనైజేషన్స్‌ను  ఎంపిక చేసారు. ఆహారం, జాతి వివక్ష, పేదరికం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను విడుదల చేశారు. ఉన్నత విద్య సంస్థలు గిరిజన కళాశాలలు, ఆహార బ్యాంకులు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం తదితర అంశాల పై దృష్టి పెట్టిన సంస్థలకు మెకంజీ ఆర్ధిక సహాయం చేశారు. 

కాగా విలాస పురుషుడుగా పేరొందిన జెఫ్ బెజోస్.. గత కొంతకాలంగా తన జల్సాల కోసం  పెద్ద మొత్తంలో  ఖర్చు చేస్తున్నాడు.ప్రస్తుతం తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ తో తిరుగుతూ  ఇటీవల బెవర్లీ హిల్స్ లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని  165 మిలియన్ డాలర్లు (1150 కోట్లు) పెట్టి కొనుగోలు చేశాడు దీంతో పాటు ఇప్పటికే వాష్టింగ్టన్ డీసీ లాంటి అమెరికన్ తీర ప్రాంతాల్లో జెఫ్ బెజోస్ కు మరికొన్ని ఖరీదైన భవనాలున్నాయి. మాజీ భార్య అలా దానాలు చేస్తుంటే … ఇతగాడేమో జల్సాలు చేస్తూ జాలీగా తిరుగుతున్నాడు.

————— KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!