Siva Racharla ……………
మధుర మీనాక్షి సాక్ష్యం చెప్పిన చరిత్ర… ప్రతాపరుద్రుడు కప్పం కట్టిన చరిత్ర……కోహినూర్ వెలుగు చూసిన చరిత్ర….వీర బల్లాలదేవుడు ఓడిపోయిన చరిత్ర…. మధుర మీనాక్షి గుడి తగలబడిన చరిత్ర…… బీబీ నాంచారి పుట్టిన చరిత్ర…. వీటన్నింటితో ముడిపడిన కథ మాలిక్ కాఫర్ ది.
సంజయ్ లీలా బన్సాలి పద్మావతి సినిమా వివాదం ఖిల్జి, పద్మావతి సంబంధం మీద జరిగింది. పద్మావతి సినిమాలో ఖిల్జి,పద్మావతి తరువాత ముఖ్యపాత్ర “మాలిక్ కాఫర్”ది.ఆ సినిమాలో మాలిక్ కాఫర్ పాత్ర కేవలం ఖిల్జి మగ ప్రియురాలిగానే బన్సాలి చూపించాడు.
వాస్తవ చరిత్రలో మాలిక్ కాఫర్ ది పెద్ద పాత్ర.ముఖ్యంగా మనకు సంబంధించిన చరిత్ర మాలిక్ కాఫర్ తో ముడిపడి ఉంది. పోస్టు చదివే ముందు,దక్షిణ భారత దేశంలొ మహ్మదీయ చక్రవర్తుల పాలన ఎప్పుడు మొదలైందో ఒకసారి ఆలోచించండి!
“బానిస” వంశం వారితో ఢిల్లీ సుల్తానుల పాలన మొదలైంది. 1290లో జలాలుద్దీన్ ఖిల్జి గెలవటంతో ఉత్తర భారతదేశంలొ ఖిల్జీల పాలన మొదలైంది. అల్లాఉద్దీన్ ఖిల్జి 1296లో సొంతమామ అయిన జలాలుద్దీన్ ను చంపి సింహసనం అధిష్టించటంతో అల్లాఉద్దీన్ పాలన మొదలైంది.అల్లాఉద్దీన్ పాలనలో వాయువ్యం నుంచి మంగోలుల దాడులు ఒకపక్క, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లొ రాజ్య విస్తరణ దాడులతో నిత్యం యుద్దాలతో గడిచింది.
అల్లాఉద్దీన్ ఖిల్జి సేనలు ఉగుల్ ఖాన్, నుసూరత్ ఖాన్ నాయకత్వంలొ 1299లొ గుజరాత్ “కంబత్” మీద దాడిచేసి “కర్ణ దేవ్ వఘేలా”ను ఓడించాడు . ఖిల్జి సేనలు యుద్దం ప్రధాన లక్ష్యం ధనం.గెలిచిన ప్రతిచోట దోపిడి చేసి విలువైన సంపదను ఢిల్లీకి తరలించేవారు.గెలిచిన రాజ్యాన్ని పాతరాజుకే కప్పం చెల్లించే ఒప్పందంలో వదిలేసేవారు.
అందమైన రాణులను, యువరాణులను ఢిల్లీ కి తీసుకెళ్ళి సుల్తానుకు బహుమతిగా ఇచ్చేవారు.కర్ణదేవ్ వఘేలా భార్యను అల్లాఊద్దీన్ ఖిల్జి తన రాణిని చేసుకున్నాడు. గుజరాత్ యుద్దంలొ అల్లాఉద్దీన్ ఖిల్జీకి దొరికిన విలువైన సంపద “మాలిక్ కాఫర్”!ఒక హిందు బానిస అయిన మాలిక్ కాఫర్ను నూసరత్ ఖాన్ 1000 దినార్లకు కొని అల్లాఉద్దీనుకు బహుమతిగా ఇచ్చాడు.
బానిస కావటం వలన మాలిక్ కాఫర్ పుట్టుక,తల్లితండ్రులు తదితర అంశాలు చరిత్రకు ఎక్కలేదు.మాలిక్ కాఫర్(ఈ పేరు కూడ మతమార్పిడి,అధికార హోదావలన వొచ్చిందే) మీసం, గడ్డంలేని అందమైన యువకుడు అన్నది అందరు చరిత్రకారులు అంగీకరించిన అంశం.అల్లాఉద్దీన్ ఖిల్జీకి అందమైన యువకులతో సెక్స్ చేసే అలవాటు వలనే నుసూరత్ ఖాన్ మాలిక్ కాఫరును బహుమతిగా ఇచ్చాడు అన్నది కూడ నిజం.
మాలిక్ కాఫర్ సైనికుడైతే నుసూరత్ ఖాన్ అతన్ని డబ్బులు ఇచ్చికొనడు,ఓడిన సైనికులు గెలిచిన వారిసొత్తు. బానిసలను మాత్రం కొనటం జరుగుతుంది.కాబట్టి మాలిక్ కాఫర్ యుద్దవీరుడు అనుకోను.అల్లాఉద్దీన్ దగ్గరకు చేరిన తరువాత ఖిల్జి కాఫరును”నపుంసకుడి”ని చేసి సైన్యంలో స్థానంలో కల్పించాడు.మాలిక్ కాఫర్ నేర్చుకున్నాడో లేక సహజ నైపుణ్యమో కాని 10 సంవత్సరాలలో యుద్దనీతిలో ఆరితేరి,ఖిల్జి సైన్యంలొ కమాండర్ స్థాయికి చేరుకున్నాడు.
చిత్తోర్ యుద్దం 1303లొ జరిగింది.పద్మావతి ఖిల్జి రాణి అయ్యిందా లేక ఆత్మాహుతి చేసుకుందా?చరిత్రకారుల మధ్య దీని మీద ఏకాభిప్రాయంలేదు. కొందరు అసలు పద్మావతి అనే రాణే లేదని మరి కొందరి ఖిల్జి,పద్మావతి వేరు వేరు కాలాలకు చెందినవారని రాశారు.
చిత్తోర్ యుద్దం జరిగిన 1303లోనే మొదటిసారి ఖిల్జి సేనలు దక్షణాది మీదికి దండయాత్రకు దిగాయి.దక్షిణాది మీద డిల్లీ సుల్తానుల దండయాత్రల ఏకైక లక్ష్యం “సంపద” దోపిడి.మంగోలుల దండయాత్రలు,రాజ్ పుత్ రాజులతో యుద్దాలు సామ్రాజ్య నిర్మాణానికి,సైనిక బలం పెంచుకోవటానికి సంపద కావాలి.
దక్షిణాది రాజ్యాలలో బంగారం, వజ్రాలు, ఏనుగులు, అశ్వాలు మిక్కిలిగా ఉన్నాయని తెలుసుకున్న ఖిల్జి తన సైన్యాన్ని దక్షిణాది మీదికి పంపించాడు. నుసూరత్ ఖాన్ మేనల్లుడు మాలిక్ చజ్జు 1303లో కాకతీయ సామ్రాజ్యం మీద దాడికి దిగి ప్రతాపరుద్రుని చేతిలొ ఓటమి చెంది వెనుతిరిగాడు.
1307లొ మాలిక్ కాఫర్ నాయకత్వంలో ఖిల్జి సేనలు దక్షిణాది మీద దండయాత్ర మొదలుపెట్టి మొదట యాదవ వంశం “దేవగిరి”ని జయించి వారిని సామంతులను చేసుకున్నారు.యాదవ రాజుల ఖజానాను ఇతర సంపదను డిల్లికి పంపి కాకతీయ రాజ్యం వైపు దండయాత్ర కొనసాగించారు.తరువాత కాలంలొ మహమద్ బీన్ తుగ్లక్ ఈ దేవగిరినే దౌలతాబాదుగా పేరు మార్చి దేశరాజధాని చేసి పిచ్చి తుగ్లక్ అనిపించుకున్నాడు .
మాలిక్ కాఫర్ మొదట సిర్పూర్ కోటను తరువాత నిజామాబాద్ కోటను జయించి హనుమకొండ దాటి వరంగల్ కోట ముందు తిష్టవేశాడు.పద్మావతి సినిమాలో చూపించినట్లు బలమైన కోటను పగలకొట్టే ప్రయత్నం చెయ్యకుండ నెలలతరబడి వేచి చూస్తూ ,కోట లోపలికి ఆహారధాన్యాలు వెళ్ళకుండ కట్టడి చేసి చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసి అల్లకల్లోల పరిస్థితులు సృస్టించి చివరికి కోట లోపలి రాజే బయటకు వచ్చేలా చేయడం ఖిల్జి సైనిక వ్యూహం.
కొన్ని నెలల తరువాత ప్రతాపరుద్రుడు బయటకు వొచ్చి పెద్దప్రతిఘటన లేకుండానే ఓటమి అంగీకరించి మాలిక్ కాఫరుతో సంధిచేసుకోని కప్పంకట్టటానికి ఒప్పుకోని సామంతుడుగా మారాడు.ఈ సంధిలో భాగంగానే ఖిల్జీకి దక్కిన సంపదలో ప్రఖ్యాత “కోహినూర్” వజ్రం డిల్లీకి చేరింది.
వరంగల్ ను గెలిచిన తరువాత మాలిక్ కాఫర్ సేనలు హొయసల రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్ళాయి.1311లో హొయసలుల రాజధాని “ద్వార సముద్ర”ను ముట్టడించి రాజు వీరబల్లాల-3ను ఓడించారు.వీరబల్లాల కూడ కప్పంకట్టటానికి అంగీకరించి డిల్లీకి సామంతుడిగా మారాడు.
ఈదాడిలొ శిధిలమైన ద్వారసముద్రనే ప్రస్తుత “హళైబేడు”-కన్నడలో శిధిల నగరం అని అర్ధం.అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు హళైబేడు,బేలూరు గుడుల మీద చూడొచ్చు.హోయసాల ను గెలిచిన తరువాత మాలిక్ కాఫర్ పాండ్య రాజ్యం మీదికి మధురై రాజధాని వైపు కొనసాగింది.1311లొ పాండ్య రాజ్య వారసత్వం కోసం సవతి సోదరులైన సుందర పాండ్యన్ ,వీర పాండ్యన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న రోజుల్లో మాలిక్ కాఫర్ వారి మీదికి దండయాత్ర చేశారు.
సుందర పాండ్యన్ సహాయం కోరటం వలనే మాలిక్ కాఫర్ పాండ్య రాజ్యనికి వెళ్ళాడని కొందరు చరిత్రకారులు రాయగా,మరొకొందరు సుందర్ పాండ్యన్ను విడిపించుకోవటానికే వీర పాండ్యన్ మాలిక్ కాఫరుకు సొమ్ము చెల్లించాడని రాశారు.
మాలిక్ కాఫర్ పాండ్యుల దండయాత్రలో మొదట శ్రీరంగం గుడి ని ధ్వంసం చేసి అక్కడి బంగారం, ఇతర విలువైన సంపదను దోచుకున్నాడు. తదుపరి మధుర మీనాక్షి అమ్మవారి గుడిని ధ్వంసం చేసి సంపదను,విగ్రహాలను ఢిల్లీకి తరలించాడు.మాలిక్ కాఫర్ రామేశ్వరం వరకు వెళ్ళాడు అని అక్కడ ఒక మసీదును కట్టాడని చరిత్రకారులు రాశారు.
ఇప్పుడున్న మీనాక్షి అమ్మవారి గుడిని 1623-1650 మధ్య విజయనగర సామ్రాజ్య దండనాయకులైన మధుర నాయకులు కట్టించారు. మాలిక్ కాఫర్ గుడుల మీద దాడికి ప్రధాన కారణం బంగారు విగ్రహాలు,విలువైన ఆభరణాల కోసమే.దోచుకున్న విగ్రహాలను, బంగారు వస్తువులను ఢిల్లీ కి తరలించి అక్కడ వాటిని కరిగించే వారు.
శ్రీరంగంలో దోచుకున్న రంగనాథ స్వామి విగ్రహాన్ని ఖిల్జి కూతురు ఇష్టపడటంతో దాన్ని బిడ్డకు కానుకగా ఖిల్జి ఇచ్చాడని,కొందరు భక్తులు శ్రీరంగం నుంచి డిల్లీకి వెళ్ళి ఖిల్జీని మెప్పించి కానుకగా రంగనాథస్వామి విగ్రహాన్ని సంపాదించి శ్రీరంగానికి తీసుకొచ్చారని ,ఆవిగ్రహం మీద ఇష్టంతో ఖిల్జి కూతురు కూడ శ్రీరంగం వొచ్చి స్వామిని ఆరాధిస్తూ అక్కడే చనిపోయిందని ,ఆవిడే “బీబీ” నాంచారని నమ్మకం, వాదన, అభిప్రాయం ప్రచారంలో ఉన్నాయి.
ఈ చరిత్రలో నిజానిజాలు నాకు తెలియదు. అసలు బీబీ నాంచారి అనే స్త్రీ ఉందా లేక ముస్లిం రాజులు మళ్లీ ఆయా గుడుల మీద దాడి చేయకుండా నిరోధించటానికి స్థానిక పూజారులు,మత పెద్దలు మెల్కోటే, శ్రీరంగం తదితర గుడుల్లో బీబీ నాంచారి విగ్రహాన్ని పెట్టారా? వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారి, శ్రీరంగం బీబీ నాంచారి లను ఒకే సమయంలో ప్రతిష్టించారా లేక వేరు వేరు కాలాలోనా? ఇవి ఎప్పటికి తేలని వాదనలు.
ఆ విధంగా మాలిక్ కాఫర్ దక్షిణాది దండయాత్ర ముగిసింది. మొట్టమొదటిసారి దక్షిణాదిలో ఢిల్లీ సుల్తానుల పాలన కిందికి వొచ్చి మొత్తంగా ప్రస్తుత భారతదేశంలో 70% పైగా ఢిల్లీ సింహాసనం కింద చేరింది.ఇది మాలిక్ కాఫర్ చరిత్ర.
మాలిక్ కాఫర్ నపుంసకుడిగా చెయ్యబడ్డ ఖిల్జి మగ ప్రియురాలే.(ఇలా రాయొచ్చా?) దక్షిణాదితోసహా అనేక యుద్దాలకు నాయకత్వం వహించిన సైన్యాధ్యక్షుడు. 1316లొ మాలిక్ కాఫర్ కుట్ర చేసి అల్లాఉద్దీన్ ను చంపి,ఇద్దరు రాకుమారుల కళ్ళు పెకిలించి చిన్నకొడుకును పేరుకు సింహాసనం మీద కూర్చోపెట్టి 36 రోజుల పాటు అరాచక పాలన సాగించాడు.
చివరికి 1316 ఫిబ్రవరిలో సొంత అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. సినిమాలలొ చరిత్రను ఆశించలేము.చరిత్రను చదవి తెలుసుకోవలసిందే. కానిపక్షంలో బాహుబలి చూసి మహావీరుడు బిజ్జలదేవుడు అవిటి వాడని,పద్మావతి చూసి మాలిక్ కాఫర్ ఖిల్జి కోరిక తీర్చే బానిస మాత్రమే అనుకోగలం.

