బ్రిటిషర్లు అందరూ చెడ్డవారు కాదు. వారిలో మంచివారు, మానవతావాదులు ఎందరో ఉన్నారు. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే కూడా ఆ కోవకు చెందినవాడే . 1834 లో సుప్రీం కౌన్సిల్ మెంబర్ గా మెకాలే ఇండియా వచ్చారు. అప్పటికి దేశ గవర్నర్ జనరల్ గా విలియం బెంటిక్ ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు,ప్రజల విద్య …తెలివితేటలను గమనించిన మెకాలే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని సంకల్పించారు. తద్వారా ప్రజలు ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకుంటారని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మెకాలే భావించారు.
భారత్ లో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టాలని మెకాలే గవర్నర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. దీన్ని బెంటింక్ ముందు తిరస్కరించాడు. తర్వాత మెకాలే ఇచ్చిన వివరణతో 1835 లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. అలా మనదేశంలోని పాఠశాలల్లో దశలవారీగా ఆంగ్ల విద్య మొదలయింది. అలాగే భారతదేశంలో విద్య మూఢనమ్మకాలను పెంచటానికి ఉపయోగపడుతున్నదే కానీ ప్రజల్లోచైతన్యం లేదని గ్రహించి ఇంగ్లీషు, గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం,మాతృభాష అనే ఐదు పాఠ్యాంశాలతో సాధారణ సెక్యులర్ విద్యా విధానాన్ని మెకాలే అమలు చేసాడు. ఇప్పటికి దేశంలో అమలవుతున్న విధానం అదే. ఆ క్రమంలోనే మన ముత్తాతలు , ముత్తవ్వలు .. తదుపరి తరాల్లో మరికొందరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అందరు పండితులు కాకపోయినా కొంతవరకు ఆంగ్లం నేర్చుకోవడం గొప్పవిషయమే.
మెకాలే ఇండియాలో నాలుగేళ్లు మాత్రమే పనిచేశారు. ఇక్కడి విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసాడు. అదే సమయంలో మెకాలే మొదటి లా కమిషన్ ఛైర్మన్ అయ్యారు. అపుడే నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా వంటి ప్రామాణిక గ్రంథాలను తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ ‘చిత్తుప్రతి’ ని తయారు చేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా అధ్యయనం చేశారు. నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు.
శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. తన అభిప్రాయాలకంటే, నాటి దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సు తో ‘ఇండియన్ పీనల్ కోడ్’ చిత్తుప్రతిని తయారు చేశాడు. 1835 లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ పీనల్ కోడ్ చిత్తుప్రతిని సమర్పించారు. నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, ఇప్పటికి చెక్కు చెదరలేదు.
దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ ఈ నాటికీ న్యాయశాస్త్రంలో దీనికి తిరుగు లేదు. ఆయన కృషి ఫలితం గానే ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. తర్వాత కాలంలో మరికొన్ని సెక్షన్లు అందులో యాడ్ అయ్యాయి. ఇండియాలో పనిచేసింది స్వల్పకాలమే అయినా మెకాలే ఎన్నోతరాలకు ఉపయోగపడే మంచి పనులు చేసి వెళ్లారు.ఇక ఏళ్ళ తరబడి పదవుల్లో ఉన్నప్పటికీ మన నేతల్లో కొందరు మినహా ప్రజలకు ఉపయోగ పడే పనులు చేయలేకపోయారు.
——— KN.MURTHY
Read Also >>>>> న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీ కాదా ?