wonderful stage artist ………………………….
‘భామనే సత్య భామనే’ అంటూ వాలుజడ ను వయ్యారంగా తిప్పుతూ స్టేజి మీద నడుస్తుంటే …. ప్రేక్షకులు ఈలలు,చప్పట్లతో చెలరేగిపోయేవారు. తెలియని వాళ్ళు ఎవరీ అభినయ సరస్వతి అంటూ మెచ్చుకునేవారు. ఆ నటిస్తున్నది ఆమె కాదు అతడు అని తెలిసాక విస్తుపోయేవారు.
అంతలా ఆయన స్త్రీ పాత్రల్లో ఇమిడిపోయేవారు.కొత్త వాళ్ళు నిజంగా మహిళే కాబోలు అని భ్రమ పడేవారు.అంతటి గొప్ప నటుడు ఆయన. ఆయన పేరే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి.ఆంధ్ర నాటక రంగాన లబ్దప్రతిష్టులు.ఆడవాళ్ళకే సోయగాలు నేర్పగలిగేలా స్త్రీ పాత్రధారణ చెయ్యటంలో ఘటికుడు.
ఏ పాత్రలోనైనా లీనమై నటించేవారు. సత్యభామ,చింతామణి,చంద్రమతి, మోహిని, ద్రౌపది , సక్కుబాయి, ఇలా ఒకటేమిటి ఎన్నోపాత్రల్లో జీవించేవారు.అలవోకగా నటించేవారు. వైవిధ్య భరిత పాత్రల్లో నటించి మెప్పించే వారు.
విశ్వనాథ సత్యనారాయణ , కొండవీటి వెంకట కవి వంటి ప్రముఖుల ద్వారా నాట్యాచార్య , అభినయ సరస్వతి,నాట్యమయూరి వంటి బిరుదులు కూడా అందుకున్నారు. 1936, ఫిబ్రవరి 9 న కృష్ణా జిల్లా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు శాస్త్రి జన్మించారు. చిన్ననాడే మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పద్యాలు నేర్చుకున్నారు.
వాటిని భావ యుక్తంగా పాడటం లోని మెళకువలను వానపాముల సత్యనారాయణ వద్ద అభ్యసించారు.ఈయన నటనా శైలిని గమనించి బి.వి.నర్సింహారావు నటనలో మెళకువలను నేర్పించారు. మగువల హావభావాలను ఎలా ప్రదర్శించాలో సుబ్రహ్మణ్య శాస్త్రి స్వల్ప కాలంలో అవపోశన పెట్టేసారు.స్టేజి మీద ఆయన వాలు చూపులతో పద్యం పాడుతుంటే ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అయ్యవారు.
ఆయన ఎక్కువగా చింతామణి పాత్ర పోషించారు. అందుకే ఆయనను చింతామణి శాస్త్రి అని కూడా పిలిచేవారు. నాటక రంగంలో శాస్త్రి స్త్రీ పాత్రల్లో అపూర్వంగా నటించి తెలుగునాట ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నాటకమంటే చాలు జనాలు తప్పనిసరిగా వెళ్లి చూసే వారు. సత్య సాయిబాబా నాటక సమాజం స్థాపించి కొన్నివందల సార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చారు.
70 వ దశకంలో ఈరంకి శర్మ తీసిన నాలాగా ఎందరో సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనారు. కే. విశ్వనాథ్ ..చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ‘స్వయం కృషి’ తో పాటు మరి కొన్ని సినిమాలలో కూడా నటించారు. తర్వాత బుల్లితెర కొచ్చారు. అక్కడ కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
నటనతోపాటు ప్రవచన కర్తగా కూడా సుబ్రహ్మణ్య శాస్త్రి మంచి గుర్తింపు పొందారు. దేవీ భాగవతం, హనుమత్ చరితాన్ని ప్రవచనంగా చెప్పేవారు. అలాగే ‘అష్టవిధ శృంగార నాయికలు’ అనే కావ్యంతో సాహితీ లోకంలో పేరు తెచ్చుకున్నారు. ‘త్యాగయ్య’ పేరిట నాటకం రాసారు. దాన్ని ప్రదర్శించకుండానే 83 ఏళ్ళ వయసులో 2019 ఏప్రిల్ 8 న ఆయన కన్నుమూసారు.
సుబ్రమణ్యశాస్త్రికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా రచయిత బుర్రా సాయిమాధవ్ ఈయన పెద్ద కుమారుడు.