Subbu.Rv…………………………………………..
మానవత్వం, సేవాతత్వం పరిమళించే చోట అందరికీ మంచే జరుగుతుంది. ఆ మంచితనానికి కుల మత ప్రాతిపదికలు, చదువు, గొప్ప ఉద్యోగం, ఆర్ధిక స్థోమత అవసరం లేదు. పొరుగోడి కష్టాన్ని గ్రహించి సాయమందించడం కన్నా గొప్ప పనేదీ లేదు. అంతకంటే ఉన్నతమైన కార్యమేదీ కనిపించదు ఈ సమాజంలో. వయసుతో పనిలేని మనసుతో పొందే అనుభవాలు మనుషుల్లో అనేక మార్పులు తెస్తాయి.
పైకి పదిమందిలో పొందే గౌరవం కన్నా మనసుతో చేసే సేవ గుర్తింపు కోరకపోవచ్చు కానీ గుర్తించబడకుండా అయితే అసలు ఉండదు. పై ఫొటోలో ఉన్న ఇరవై ఒక్కేళ్ల ఓ కుర్రాడు సాయం అనే మాట పూర్తవ్వకమునుపే ఎలా వస్తాడో తెలియదు కానీ ప్రత్యక్షమవుతాడు. తన మార్గంలో కష్టంతో ఉన్నవారు తారసపడితే కాదని దాటవేసి పోడు. పరోపకారానికి ప్రత్యక్ష నిదర్శనం జమీర్.
పెద్దగా చదువుకోలేదు కానీ చదవడం రాయడం వచ్చు. చిన్నప్పుడు ఘోరంగా అవమానిస్తూ విద్యార్థులు, పాఠాలు చెప్పే టీచర్ ప్రవర్తన తనని చదువుకు దూరం చేశాయి. తల్లిదండ్రుల పేదరికం మరో చోటికి పంపలేకపోయింది. లాభాల కన్నా నష్టాలు తెచ్చే వ్యవసాయం చేస్తూ, అర కొర వస్తదో రాదో తెలియని పంటల కోసం జమీర్ కూడా తల్లిదండ్రులతో పొలం పనుల్లో భాగమయ్యాడు. కుటుంబ పోషణకు చిల్లర కొట్టు పెడితే అందరూ అప్పులు పెట్టి దివాళా తీసేలాగా చేశారు.
కోటా బియ్యమే వరంగా కాసిన్ని నీళ్ళ మజ్జిగ పరవన్నంగా మారిపోయింది. ఒక్కోసారి తినడమే అదృష్టం, అందుకే చిన్న వయసులోనే కుటుంబ పోషణే తనకి బాధ్యతగా మారింది. ఆ పని, ఈ పని అని లేదు ఎన్నో పనులు నేర్చుకున్నాడు. ఫ్రిడ్జ్, ఏసీ మెకానిక్ వర్క్స్ నేర్చుకున్నాడు. జీవితంలో వచ్చే కష్టాలు కొత్త మార్గాలకు దిశానిర్ధేశాలు కాబోలు, జమీర్ చెల్లెకి డెంగ్యూ వచ్చింది. రక్తం అవసరం అయింది. ఎంతలా తిరగాలో అంతలా తిరిగాడు , ఒకేసారి బాధలన్నీ చుట్టుముట్టాయి.
ఆరోజు రక్తం కోసం జమీర్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు అందుకే ఇలాంటి కష్టంలో ఎవరన్నా ఇంతలా బాధపడకూడదు ఏదైనా చెయ్యాలి, నా చెల్లిలాంటి ఎందరో రక్తం కోసం అల్లాడుతున్నారు, తిరుగుతున్నారని అప్పటి నుండి రక్తదానం గురించి, బ్లడ్ బ్యాంక్స్ గురించి, డోనర్ల కాంటాక్ట్ గురించి విజయ బ్లడ్ బ్యాంక్, నంద్యాలలో చేసే దాదా భాయ్ ద్వారా తనకు తెలియని విషయాలు తెలుసుకుని నేర్చుకున్నాడు. అనేక స్వచ్ఛంద సంస్థల దగ్గరకి పోయి అత్యవసర పరిస్థితుల్లో, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు.
జమీర్ అనే వ్యక్తి తన చేతిలో ఉన్న చిన్నపాటి ఫోన్ తో అనేకమందికి సేవ చేయగలిగాడు. కరోనా సమయంలో రక్తదానం విషయంలో జమీర్ ఎంతమందికి సాయం చేశాడంటే లెక్క కూడా పెట్టలేము. ఆక్సిజన్ సీలిండర్లని ఏర్పాటు చేయడం, ICU బెడ్స్ సమాచారం ఇవ్వడం, కరోనా పేషంట్స్ కి భోజనం ఏర్పాటు చేయడం, ప్లాస్మా డొనేషన్, మందుల సమాచారం ఇలా ఒకటేమిటి తనవల్ల అయిన ప్రతిదీ చేశాడు.
గుడ్ సమారిటన్ అని బైబిల్లో ఒక కథ ఉంటుంది. ఒక వ్యక్తి దారిదోపిడీకి గురయ్యి, ప్రాణాపాయ స్థితిలో వివస్త్రుడిగా పడి ఉంటే అటుగా యాజకుడు (దేవుని పూజారి), లేవీయుడు (దేవుడి సన్నిధిలో పరిచారకుడు) చూసి కూడా తప్పుకుని వెళ్తారు. కానీ ఎవరూ గుర్తించని, అతని మాటకు విలువ ఇవ్వని, అవమానించబడ్డ ఒక సమారిటన్ అతని గాయాలకు నూనె రాసి, ద్రాక్షారసము పోసి, అతన్ని గాడిదపై వేసుకుని ఒక పూటకూళ్ళ ఇంటికి చేర్చి అతనికి సపరియలు చేయమని రెండు దీనాలు ఇచ్చి అవి సరిపోకుంటే మరలా వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెళ్తాడు.
జమీర్ నాకు ఒక గుడ్ సమారిటన్ లాగా కనిపించాడు. తనకు ఒక వృద్ధుడు కనిపిస్తే మట్టిబట్టి, చినిగిపోయిన బట్టలు, భయంకరమైన దుర్గంధంతో ఉంటే తనకెందుకులే అని అందరిలా వదిలి వెళ్ళకుండా అతన్ని శుభ్రం చేసి బట్టలు మార్చి, రోజూ భోజనం అందించి వేరే స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఒక ఆశ్రమానికి చేర్చాడు. ఎవరికైనా రక్తం అవసరం అని తెలిస్తే తానే డోనర్ని పిలిపించి డోనర్ బాగోగులు చూసుకుని మరలా తిరిగి అతను ఇంటికి చేరేదాక క్షేమ సమాచారం కనుక్కుంటాడు.
ఒక్కోసారి డోనర్ బ్లడ్ ఇచ్చాక అతనికి కనీసం జ్యూస్ కూడా ఇప్పించకుండా కొందరు వదిలేస్తారు. అలాంటప్పుడు అక్కడకి పంపిన జమీర్ ని ఎన్నో రకాలుగా తిట్టేవారు. వారి దారి ఖర్చులు కూడా జమీర్ భరించేవాడు. ఇలాంటి చేదు సంఘటనలెన్నో చవి చూసిన జమీర్ సేవ మాత్రం ఆపలేదు.అంధ విద్యార్థులకి పరీక్షలు రాయడానికి ఒక వాలంటీర్ (స్క్రైబ్) అవసరం. అలా అంధ విద్యార్థుల పరీక్షలకు, ఇంటర్వ్యూ లకు అవసరమైనప్పుడు స్క్రైబ్ ని ఏర్పాటు చేయడం, విద్యార్థులకు కావాల్సిన అవసరాలు, బాగోగులన్నీ తానే చూస్తాడు.
పరిశుభ్రత లోపించి కలుషితం చేస్తున్న మనుషుల తీరు చూసి #బీచ్_క్లీనింగ్ అనే ప్రోగ్రాం ద్వారా సముద్ర తీరాన్ని శుభ్రం చేయడం, #క్లీన్_గుంటూరు అనే పేరుతో గుంటూరులోని ప్రధాన కూడళ్ళలో తన స్నేహితులతో కలిసి రోడ్లలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ కవర్లు, మట్టిని ప్రతీ ఆదివారం రాత్రి రెండు తరువాత ఓ చీపురు, తట్ట తీసుకుని మొత్తం ఊడ్చేసి ,రోడ్ల గుంతలు బూడ్చి, కాలువలో ఆగిన చెత్త తీసి, చెత్త కుండీల చుట్టూ పేరుకుపోయిన అశుద్దాన్ని తీసేసి బ్లీచింగ్ చల్లి క్లీన్ గా మారుస్తాడు.
రెండేళ్ళ క్రితం ఓ బీసీ హాస్టల్ కి మోటారు రిపేరుకి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థుల దీనపరిస్థితి చూసి చలించి పోయాడు. రెండేళ్ల తరువాత వెళ్ళి అప్పటికి మారని దుస్థితిలో ఉన్న 120 మంది విద్యార్థులకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్, ప్లేట్స్, మగ్గులు, బకెట్లు, గ్లాసులు, చాపలు, అలాగే రూమ్ లకు ఫ్యాన్లు వేరే స్వచ్ఛంద సంస్థల సాయంతో తీసుకురావడమే గాక, దగ్గరుండి ఫ్యాన్లు కూడా బిగించి వచ్చాడు.
ఈ కార్యక్రమాలు అన్నీ కూడా తనకు వచ్చే ఐదారు వేల జీతంలోనే చేస్తాడు, సొంత బండి లేదు, ఆటోలో వస్తాడో,బస్సులో వస్తాడో, నడుచుకుంటూ వస్తాడో తెలియదు కానీ ప్రతీ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో జమీర్ కనిపిస్తాడు. తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతీ 10 లేదా15 రోజులకు రక్తం మార్చాలి. అటువంటి వారికి డోనర్ అవసరం ఎప్పుడూ ఉంటుంది.
ఒక్కోసారి డోనర్ దొరకడం కష్టం కూడా అవుతుంది. అలాంటిది సత్తెనపల్లి, యడ్లపాడు, వినుకొండ ప్రాంతాలకు చెందిన ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను జమీర్ దత్తత తీసుకున్నాడు. ఆ ముగ్గురు పిల్లలకు కావాల్సిన రక్త మార్పిడి పూర్తి బాధ్యత జమీర్ దే ఇప్పుడు. ఇంకో ఇద్దరు పిల్లలను కూడా త్వరలో దత్తత తీసుకుంటాడు. చిన్న వయసులో ఎంతటి సేవా దృక్పథం. కేవలం ఒక్క వ్యక్తితో ఇన్ని సాధ్యమా అని అనిపిస్తుంది జమీర్ ని దగ్గరగా చూసిన వారందరికీ.
ఒక్కోసారి సేవ కోసం వెళ్ళి రోడ్డుపక్కన, ప్లాట్ ఫామ్ మీద పడుకున్న అనుభవాలు, డోనర్ కి ఖర్చులకు ఇచ్చి కడుపు మాడ్చుకున్న మధురానుభూతులు అన్నీ జమీర్ కి స్వీయానుభవాలే. ఇప్పటికి కోటా బియ్యమే తన ఆకలి తీర్చేది. ఇన్నింటా తనకు తృప్తి నిచ్చేది ఒకరికి సాయం చేశాననే ఆత్మసంతృప్తి మాత్రమే.
“ఆపదలో ఉన్నవారు సాయం అందలేదని నాలాగా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు. సాయం కావాల్సిన వారికి సాయం అందేలా చేయడమే నా లక్ష్యం” అంటాడు జమీర్. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారికి పది రూపాయలకు మంచి భోజనం, జ్యూస్ ఇవ్వాలనేది జమీర్ మరో ధ్యేయం. అది నెరవేరాలని కోరుకుందాం. పరోపకారానికి పర్యాయ పదమైన జమీర్ వంటి స్వచ్ఛమైన స్వచ్చంధ సేవకులు యువకులు సమాజానికి అవసరం. ఈ సంవత్సరం జాతీయ యువజనోత్సవంలో భాగంగా ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ, నెహ్రూ యువజన కేంద్రం వారు యువసేవా పురస్కారంతో జమీర్ ని సత్కరించారు.