Ramana Kontikarla …………………………
కొత్తా దేవుడండీ… కొంగొత్తా దేవుడండీ…….. ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ…… బాబు రండీ.. రాండీ శిశువా…
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ … అండండీ.
ఫొటోలో ఉన్న క్విబోలాయ్ కథ తెలిస్తే వేటూరి వారు రాసిన పై పాట గుర్తుకొస్తుంది. అతగాడు ఒక వైపు అమెరికా ని .. మరోవైపు ఫిలిప్పీన్స్ ని దేవుని ముసుగేసుకుని దడదడలాడించిన ఓ అంతర్జాతీయ క్రిమినల్.. తనకు తాను దేవుడి కుమారుడిగా పరిచయం చేసుకుంటూ పలు దేశాలను ముప్పుతిప్పలు పెట్టి.. నేరాలకు పాల్పడ్డాడు.
అతగాడి పూర్తి పేరు అపోలో క్విబోలాయ్.. ఇతగాడి పేరు ఇపుడు అంతర్జాతీయ నేర సామ్రాజ్యంలో ట్రెండింగ్ అవుతోంది. ఎఫ్బీఐ ఏకంగా 2 వేల మంది అధికారులను అతడిని వెతికే పనికోసం నియమించింది. అంతటి మోస్ట్ వాంటెడ్ క్విబోలాయ్.
ఇంతకీ ఎవరా క్విబోలాయ్..?
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే కి ఇతగాడు సన్నిహిత మిత్రుడు. ఫిలిప్పీన్స్‌లో లక్షలాది మంది అనుచరులన్న ఫిలిప్పీన్ పాస్టర్, ప్లస్ లీడర్. కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పేరిట నిర్వహిస్తున్న రెస్టోరేషనిస్ట్ క్యాథడ్రాల్ చర్చ్ పాస్టర్.
క్విబోలాయ్ పై.. మానవ అక్రమరవాణా, పిల్లలపై లైంగిక వేధింపులు,స్మగ్లింగ్, నకిలీ వీసాలు కేసులున్నాయి. వీటితోపాటు మోసాలకు పాల్పడుతూ పెళ్లిళ్లు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి,
సోన్ షైన్ మీడియా నెట్ వర్క్ ఇంటర్నేషనల్ పేరుతో… మీడియా కార్యకలాపాలతో ఫిలిప్పీన్ 16వ అధ్యక్షుడైన రోడ్రిగోతో సాన్నిహిత్యాన్నిపెంచుకున్నాడు. ఆపై తానాడిందాట, పాడింది పాట అన్న చందంగా చెలరేగిపోయిన నొటోరియస్ క్రిమినల్. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో దర్యాప్తు కి ఫిలిప్పీన్ ప్రభుత్వానికి సహకరించ లేదు. ఈ క్రమంలోనే సెనేట్ ఆఫ్ ది ఫిలిప్పీన్స్ 2024, మార్చి 19వ తేదీన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ లోకల్ గవర్నమెంట్ క్విబోలాయ్ సమాచారం అందించిన వారికి 1 కోటీ 43 లక్షల, 32 వేల రూపాయల రివార్డ్ అందిస్తామని 2024, జూలై 8న ప్రకటించింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 8, 2024న క్విబోలాయ్ ఫిలిప్పీన్ పోలీసులు అరెస్ట్ చేసారు.
క్విబోలాయ్ నేపథ్యం!
రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా లుబావో నుంచి ఫిలిప్పీన్స్ కు బతుకుదెరువు కోసం వచ్చారు క్విబోలాయ్ తల్లిదండ్రులు. 9 మంది పిల్లల్లో అందరికంటే చిన్నవాడైన క్విబోలాయ్ ఏనాడూ తాను ఓ పాస్టర్ అవుతానని అనుకోలేదు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి పైలట్ కావాలనే కలలు కనేవాడు.
యునైటెడ్ పెంటాకోస్ట్ బైబిల్ ఇనిస్టిట్యూట్ లో చదువుకోవడంతో.. తన ఆసక్తి ,లక్ష్యం మారాయి. అలా పాస్టర్ అయిన క్విబోలాయ్ కి కొంతకాలం తర్వాత యునైటెడ్ పెంటాకోస్ట్ బైబిల్ ఇనిస్టిట్యూట్ పెద్దలతో విభేదాలేర్పడ్డాయి. దీంతో ఇతగాడిని పాస్టర్ గా పక్కన పెట్టారు. 1985లో కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పేరుతో చర్చ్ ను నెలకొల్పి.. తనకు తానే లీడర్ గా.. పాస్టర్ ఆఫ్ చర్చ్ గా ప్రకటించుకున్నాడు.
తనను తాను ఆ దేవుడు పంపిన దూతగా.. ఆ దేవుడి కుమారుడిగా అభివర్ణించుకున్నాడు. అలా తన చర్చ్ తో భక్తులు, అభిమానులు, అనుచరగణాన్ని పెంచుకున్న క్విబోలాయ్ ఏకంగా కింగ్ డమ్ ఆఫ్ నేషన్ గా కూడా తన చర్చ్ ను ప్రకటించుకుని.. తాను చేసే అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశాడు. మరో సమాంతర ప్రభుత్వాన్నే నడిపాడు.
ప్రీస్ట్ ముసుగు వేసుకుని క్విబోలాయ్ చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేరాడు. పరారీలో ఉంటూ పోలీసులకు, ఎఫ్బీఐకీ చిక్కకుండా తిరుగుతున్న అతగాడిపై ఇంటర్ పోల్ ఉత్తర్వులు జారీ చేశారు. 12 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న బాలికలు, స్త్రీలను అక్రమ రవాణా చేసినందుకు యూఎస్ న్యాయ శాఖ 2021లో అతనిపై అభియోగాలు మోపింది. అతడి దగ్గర పని చేసిన వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
74 ఎకరాల విస్తీర్ణంలోని తన చర్చ్ లో రెండు వేల మంది పోలీసులు సోదాలు జరిపారు. రెండు వారాల పాటు జరిగిన భారీ పోలీసు ఆపరేషన్ తర్వాత గానీ.. క్విబోలాయ్ ని ఫిలిప్పీన్స్ పోలీస్ శాఖ అరెస్ట్ చేయలేకపోయింది. అంతేకాదు, ఆ సమయంలో పోలీసులు పెద్ద ప్రతిఘటనే ఎదుర్కొన్నారు.
పోలీసులనే నిర్బంధించే ప్రయత్నం చేశారు క్విబోలాయ్ అనుచరులు. 75 వేల మంది ఉండగల్గే సామర్థ్యం కల్గిన చర్చ్ స్టేడియంలో సోదాల కొరకు పోలీసులు ఏకంగా హెలిక్యాప్టర్స్ ఉపయోగించారు. థర్మల్ ఇమేజింగ్ రాడార్స్ వంటి పరికరాలనుపయోగించి.. క్విబోలాయ్ ఆ చర్చ్ కింద ఉన్న బంకర్ లో దాక్కున్నట్టు గుర్తించారు. చివరికి క్విబోలాయ్ ని అరెస్ట్ చేశారు.
అయితే, ఇప్పటికీ క్విబోలాయ్ తాను దేవుడి కుమారుడినేనని… ఈ విశ్వానికి తానే యజమానినేనంటూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడం కొసమెరుపు. అయితే, క్విబోలాయ్ పై యూఎస్ లోనూ కేసులున్న నేపథ్యంలో అతణ్ని అక్కడికి అప్పగించే ముందు ఫిలిప్పీన్స్ లో ప్రాసిక్యూషన్ పూర్తి కావల్సి ఉంటుందని ప్రస్తుత ఫిలిప్పీన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అంటున్నారు.