Sheik Sadiq Ali………………………………………….
అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి ధీరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. నెహ్రు మరణాంతరం ఇందిరకు మరింత చేరువ అయ్యాడు.గురువు,సచివుడు ,హితుడు,సన్నిహితుడు అన్నీ తానే అయ్యాడు.
అక్కడినుంచి అతని ప్రభ వెలిగిపోయింది. అత్యంత ఖరీదైన ఆశ్రమాలు, యోగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రులు,బడా పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులు అతని శిష్యులుగా మారిపోయారు. అతని ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా మంజూరు అయ్యేవి.మరో వైపు ఆయుధ కర్మాగారంలో భాగస్వామి అయ్యాడు. ఆయుధాల వ్యాపారిగా, రక్షణ పరికరాల సరఫరా దారుగా ఎదిగాడు.
ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో అతని ముద్ర స్పష్టంగా కన్పించేది. ఇక ఇందిరా తనయుడు సంజయ్ గాంధీకి ధీరేంద్ర ఎంతచెబితే అంతేగా ఉండేది. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ చేపట్టిన కుటుంబ నియంత్రణ, గుడిసెల నిర్మూలనా కార్యక్రమాలకు ధీరేంద్ర బహిరంగ మద్దతు ప్రకటించాడు. ఇక్కడ ఇలా ఉండగా, రష్యా ఆహ్వానం మేరకు అక్కడి వ్యోమగాములకు యోగా శిక్షణ కూడా ఇచ్చి వచ్చాడు.
ధీరేంద్ర కు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. విదేశాల నుంచి ఖరీదైన కార్లు,విమానాలు, ఎలెక్ట్రానిక్ పరికరాలు కానుకలుగా అందేవి. జమ్మూలో అతిపెద్ద ఆశ్రమం,సొంత విమానాశ్రయం,సొంత విమానం ,హెలికాప్టర్లు ఉండేవి. నిరంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు సొంత విమానాల్లో తిరిగేవాడు. దాంతో ఫ్లయింగ్ స్వామి గా సుప్రసిద్దుడయ్యాడు.
సంజయ్ గాంధి మరణానికి కారణమైన విమానం కూడా ధీరేంద్ర దే కావటం విశేషం. సంజయ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ పరిపూర్ణంగా ధీరేంద్ర పైనే ఆధార పడ్డారు. ఆయన సూచనలతోనే ఇందిరా అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో ధీరేంద్ర ప్రమేయం చాలా ఎక్కువగా ఉండేది .
అప్పట్లో దూరదర్శన్ లో ప్రతీరోజు ధీరేంద్ర యోగా కార్యక్రమాలు వచ్చేవి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువుగా విరాజిల్లాడు. అదే సమయంలో ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. కలకత్తా నుంచి ఢిల్లీ వరకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని వార్తలు గుప్పుమనేవి.అలాగే, ఎమర్జెన్సీ కాలంలో వేలకోట్ల అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు రావటం, జనతా ప్రభుత్వం నియమించిన షా కమీషన్ వాటిని నిర్ధారించటం, వాటిలో కొన్ని ఆస్థులను జప్తు చేయటం కూడా జరిగింది. ఇందిరా గాంధీ ,రాజీవ్ ల మరణం తర్వాత ధీరేంద్ర పతనం మొదలయ్యింది.
అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 1994 జూన్ 9 జమ్మూ పరిసరాల్లో ఆయన ప్రయాణిస్తున్న సొంత విమానం కూలిపోవటంతో ఆయన మరణించాడు. ఆ విమానం ఎలా కూలింది అనే విషయంలో మీడియా కానీ, అప్పటి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మరణం తర్వాత వారసులెవరూ లేకపోవటంతో ఆయన ఆశ్రమాలు,ఆస్థులు దోపిడీకి గురయ్యాయి.ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకునే వారే కరువయ్యారు.
యోగాసాధకుడిగా నిస్సందేహంగా ధీరేంద్ర గొప్పవాడు . కానీ,రాజకీయ ప్రమేయాలు, ఆయుధాల వ్యాపారాలు,అక్రమాలు, మహిళలతో సంబంధాలు ఆయన లోని విద్వత్తును పూర్తిగా కనుమరుగు చేసేశాయి. యోగి భోగిగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ధీరేంద్ర జీవితమే ఒక ఉదాహరణ. అలాగే బిజేపి హయాంలోనే యోగులు, సాధువుల రాజకీయ ప్రమేయం పెరిగిందని చెప్పటం కూడా అసత్యం. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఒక యోగి కనుసన్నల్లో ఎలా నడిచిందో చెప్పటానికి ధీరేంద్ర బ్రహ్మచారి జీవితం ఒక చారిత్రక తార్కాణం.
Read also ……………….. ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ?