ఎవరీ డెయిఫ్ ? హమాస్ తో లింక్ ఏమిటీ ?

Sharing is Caring...

Hunted and took revenge…………………

హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ .. ఆషామాషీ సంస్థ కాదు. దాని వద్ద పెద్ద సంఖ్యలో ఆయుధాలు .. నిధులు ఉన్నాయి.   హమాస్ కు పెద్ద ఎత్తున ఫండ్స్ అందుతాయి. ఈ నిధులను రహస్యంగా ఉంచుతారు.  ఆ నిధులు చాలా వరకు క్రిప్టో కరెన్సీ, ఆఫ్‌షోర్ బ్లైండ్ ట్రస్ట్‌లలో ఉన్నాయని అంటారు. టన్నెల్ స్మగ్లింగ్, క్యాప్టికాన్ మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా కూడా హమాస్ కి నిధులు అందుతాయి.

అలాంటి హమాస్‌ కి సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్ (Mohammed Deif) పనిచేశారు. ఆయనను ఇజ్రాయిల్ సైనిక దళాలు వేటాడి చంపేశాయి. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో డెయిఫ్ హతమైన విషయాన్నిఇజ్రాయిల్ నిర్ధారించింది. పలు మార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న డెయిఫ్‌  ఈసారి మాత్రం ఇజ్రాయిల్ దళాల  దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 

గత ఏడాది అక్టోబరు 7 న ఇజ్రాయిల్ పై జరిగిన మెరుపు దాడులకు ఇతగాడే ప్రధాన సూత్రధారి. నాటి నుంచి  17 జూలై 2024 వరకు  ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 40,000 మందికి పైగా మరణించారు.. వీరిలో 39,145 పాలస్తీనియన్లు కాగా  1,478 ఇజ్రాయెలీలు ఉన్నారు.  అలాగే 108 మంది జర్నలిస్టులు మృతి చెందారు. వీరిలో 103 పాలస్తీనియన్లు, 2 ఇజ్రాయెలీలు ,  3 లెబనీస్) జర్నలిస్టులు ఉన్నారు. మరో 224 మంది సహాయక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

హమాస్ జరిపిన దాడులకు నాయకత్వం వహించిన సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్ అసలు ఎక్కడి  వాడంటే .. అతను గాజాకు చెందిన వాడే. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థుల శిబిరంలో 1965లో మహమ్మద్‌ డెయిఫ్ జన్మించాడు. అతగాడి పూర్తి పేరు మహమ్మద్‌ డియాబ్‌ ఇబ్రహీం అల్‌ మస్రీ. వీరిది పాలస్తీనా యుద్ధం కారణంగా పారిపోయిన కుటుంబం.

చిన్నతనంలో డెయిఫ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. కుటుంబాన్ని పోషించడానికి రకరకాల పనులు చేసేవాడు. కొన్నాళ్ళు కోళ్ల ఫారం కూడా నడిపాడు. 1980  దశకం చివర్లో హమాస్‌లో చేరాడు. అప్పట్లో హమాస్‌ ఉగ్రవాదులు తమ ఉనికి ఇజ్రాయెల్‌ దళాలకు తెలియకుండా జాగ్రత్త పడేవారు. రోజుకో సానుభూతిపరుడి ఇంట్లో దాక్కునేవారు.  ఈ క్రమంలోనే  మస్రీ పేరు డెయిఫ్‌గా మారింది. డెయిఫ్‌ అంటే అరబిక్‌ భాషలో ‘అతిథి’ అని అర్థం.

మహమ్మద్‌ డెయిఫ్ హమాస్‌ మిలిటరీ యూనిట్‌ ‘అల్‌ కస్సం బ్రిగేడ్‌’లో పనిచేశాడు. ఇతను ఎక్కడ పెరిగాడు.. ఏం చదువుకున్నాడు అనే విషయాలు ఎవరికీ తెలియవు. బాంబుల తయారీలో డెయిఫ్ నైపుణ్యం సంపాదించాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈక్రమంలోనే బాంబు దాడులు చేసే  అయ్యాష్‌ ను కలిసాడు . గతంలో అయ్యాష్‌ ఇజ్రాయెల్‌ దళాలపై పలు మార్లు బాంబుదాడులు చేశాడు. డెయిఫ్ కూడా పలు బాంబు దాడుల్లో పాల్గొన్నాడు.

అయ్యాష్‌ ఇజ్రాయెల్‌ దళాల చేతిలో హతమయ్యాడు. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్‌ బాధ్యతలు డెయిఫ్‌ స్వీకరించాడు. హమాస్‌ వాడే ‘కస్సాం’ రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర ఇతగాడిదే. ఇజ్రాయెల్‌ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం వెనుక మాస్టర్‌ మైండ్‌ కూడా డెయిఫ్ దే..

ఇవన్నీ గమనించిన ఇజ్రాయిల్  ఇతగాడిని అంతమొందించడానికి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసింది. ఆ దళాలు కూడా  గట్టి ప్రయత్నాలే చేశాయి. అయితే ఇజ్రాయిల్ దళాలకు చిక్కకుండా రోజులపాటు డెయిఫ్ సొరంగాల్లోనే గడిపేవాడు.  ఇజ్రాయిల్ సైనికులను, పౌరులను చంపినందుకు డెయిఫ్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా రికార్డులకెక్కాడు.

ఇజ్రాయెల్‌ సైనిక దళాలు డెయిఫ్‌ కోసం తీవ్రంగా గాలించాయి. అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, కంప్యూటర్లకు దూరంగా  ఉన్న కారణంగా నిఘా సంస్థలు డెయిఫ్‌ను గుర్తించ లేకపోయాయని అంటారు. అతడి రహస్య జీవితం గురించి వివరాలు నిఘా సంస్థలు సేకరించలేకపోయాయి. తర్వాత కాలంలో అతని ఫోటోలను నిఘా సంస్థలు సేకరించాయి  .. ఇప్పటి వరకు డెయిఫ్ పై ఇజ్రాయిల్  దళాలు ఏడుసార్లు దాడులు చేశాయి. ప్రతిసారీ తప్పించుకున్నాడు.

2000లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.కంటికి గాయమైంది.  2006లో హమాస్‌ సభ్యుడి ఇంట్లో ఉండగా కూడా దాడి జరిగింది.  దీంతో హమాస్‌ సంస్థలో  అతడు పాపులర్‌ అయ్యాడు. అప్పటినుంచే అతగాడిని ‘ది మాస్టర్ మైండ్ ‘  అని ‘ది క్యాట్‌ విత్‌ నైన్‌ లైవ్స్‌’ అని పిలిచేవారు.2014లో జరిగిన దాడి లో డెయిఫ్ భార్య, పిల్లలు మరణించారు.

గతేడాది అక్టోబరులో ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా స్ట్రామ్‌’ మొదలైందని డెయిఫ్ ప్రకటించాడు. ఇజ్రాయిల్ పై రాకెట్ల వర్షానికి కారణమైన డెయిఫ్ ను ఎట్టకేలకు ఇజ్రాయిల్ హతమార్చింది.ఇక హమాస్ నాయకుల్లో యయాహా సిన్వార్,ఇస్మాయిల్ హనియే, ఖలీద్ మషల్, అబు మర్జౌక్ తదితరులున్నారు. వీళ్లంతా విదేశాల్లో ఉన్నారు. వీరంతా కోట్లకు పడగలేత్తినవారే. అందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నవారే అని విదేశీ మీడియా చెబుతోంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!