దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన బిగ్ మూవీ ప్రొడక్షన్ హౌస్ పద్మినీ పిక్చర్స్.
బి.ఆర్.పంతులు తమిళియన్ అని కొందరు కాదు కన్నడ అని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు కానీ ఆయన తెలుగువాడు. అప్పట్లో మైసూర్ సంస్ధానం కింద ఉన్న తెలుగు గ్రామం కుప్పంలో 1911లో పుట్టారాయన. చదువంతా మద్రాసులోనే సాగింది. అక్కడే టీచర్ గా పనిచేస్తూ..చంద్రకళా నాటక సమాజం లో చేరి గుళేబకావళికథ, సంసారనౌక లాంటి నాటకాలూ ఆడారు. 1950లో నిర్మాతగా మారి అజరామరమైన చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు.
బి.ఆర్.పంతులు మొదట నటుడుగా సినీ ప్రవేశం చేశారు. బి.ఆర్ కు రంగస్థలం మీద పేరు తెచ్చిన సంసారనౌక నాటకం కన్నడలో సినిమాగా రూపొందింది. అందులో నటించడం ద్వారా తెరంగేట్రం చేశారు. సుకుమార్ ప్రొడక్షన్స్ వారు సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన మత్స్యరేఖ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అదే సమయంలో భక్తిమాల, తాసీల్దార్, నమ్ ఇరువార్ లాంటి సినిమాల్లో నటించారు.
ఆ అనుభవంతో 1956లో పద్మినీ పిక్చర్స్ స్థాపించి శివాజీగణేశన్ హీరోగా తంగమాలయ్ రగస్సియం చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇదే కథతో కన్నడంలో రత్నగిర్ రహస్యం తీశారు. దాన్నే రత్నగిరి రహస్యం అని తెలుగులోకి డబ్ చేశారు. 1957లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ తంగమాలియమ్ రగస్సియమ్ సినిమాలో శివాజీ డైలాగ్ మాడ్యులేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారట.
బి.ఆర్ పంతులు నిర్మాణ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా నటనకు దూరం కాలేదు. కన్నడంలో స్కూల్ మాస్టర్ అనే అనే సినిమా ఆయనే నిర్మించి డైరక్ట్ చేశారు. అందులో శివాజీ కూడా నటించారు. ఆ సినిమాయే తెలుగులో ‘బడిపంతులు’ గా వచ్చింది. మళయాళంలో ప్రేమ్ నజీర్ చేశాడీ సినిమా. ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ అయ్యింది. స్కూల్ మాస్టర్ సినిమా చూసిన దర్శకుడు వి.మధుసూధనరావు తెలుగులో తీస్తే బాగుంటుందన్నారు.
ఆ మాట విని రైట్స్ కొని తెలుగులో బడిపంతులు పేరుతో రీమేక్ చేశారు ప్రొడ్యూసర్ పేర్రాజు. పి.సి.రెడ్డి డైరక్ట్ చేసిన తెలుగు వర్షన్ లో ఎన్.టి.ఆర్ టైటిల్ రోల్ చేయడం విశేషం. బడిపంతులు సినిమా ఎన్.టి.ఆర్ కు చాలా మంచి పేరు తెచ్చింది. బి.ఆర్ పంతులు ఉద్దేశ్యంలో సినిమాలంటే కేవలం ఎంటర్ టైనింగ్ వ్యవహారం మాత్రమే కాదు. ఆడియన్స్ మీద ఓ ప్రభావం వేసేదిగా ఉండాలి సినిమా అనేవారు. తన దగ్గరకు ఎవరైనా ఎంటర్ టైనింగ్ కథలతో వస్తే…వారికి అదే విషయం చెప్పేవారు.
ఓ సారి బి.ఆర్.పంతులు కథాన్వేషణలో ఉన్నారని తెల్సి డి.వి.నరసరాజు ఆయన దగ్గరకు పోయి రాముడు భీముడు కథ చెప్పారు. అయితే కథ పూర్తి ఎంటర్ టైనింగ్ గా ఉంది…నేను తీసే సినిమా కాదు అని సున్నితంగా తిరస్కరించారట. అదే కథను రామానాయుడు తెరకెక్కించి ప్రీవ్యూ వేస్తూ బి.ఆర్.పంతులును పిల్చారు. అప్పుడు కూడా సినిమా చూసి ఎంటర్ టైనింగ్ గా ఉంది..బాగా డబ్బు వస్తుంది. కానీ నేను తీసే సినిమా కాదు అనే అన్నారట.
ప్రభావవంతమైన సినిమా తీయాలనే తపన ఉన్న బి.ఆర్ పంతులు శివాజీ గణేశన్ తో వీర పాండ్య కట్ట బొమ్మన్ తీసి సంచలనం సృష్టించారు. పంతులే డైరక్ట్ చేసిన ఈ సినిమా వీర పాండ్య కట్ట బ్రహ్మనగా తెలుగులోకి డబ్ అయింది. ఆ సినిమాలో శివాజీకి నటుడు కె.వి.ఎస్.శర్మ డబ్బింగ్ చెప్పారు. సినిమా తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తరం మీద బలమైన ముద్ర వేసింది.
కర్ణాటకాంధ్ర చక్రవర్తి కృష్ణదేవరాయల జీవిత చరిత్రను రాజ్ కుమార్ హీరోగా సినిమా తీశారు పంతులు. ఆ సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్ట్ అయింది. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని బడిపంతులు నిర్మాత పేర్రాజు ప్రయత్నించారు. కానీ కలసిరాలేదు. ఎమ్.ఎస్.రెడ్డి కన్నడ సినిమా హక్కులు కొని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఎన్టీఆర్ ను కృష్ణదేవరాయలుగా చూసిన తెలుగు జనాలకు రాజ్ కుమార్ ఎక్కలేదు.
బి.ఆర్ పంతులు దక్షిణాది భాషల్లోనే కాదు. హిందీలోనూ సినిమాలు తీశారు. అక్కడా ఆయన తన మార్క్ ప్రబోదాత్మక, భారీ చిత్రాలే తీశారు. అమర్ షహీద్, సుహాగ్, దిల్ తేరా దీవానా లాంటి సినిమాలతో అక్కడా విజయకేతనం ఎగరేశారు. వీటిలో దిల్ తేరా దీవానా ఒకటే కాస్త ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. షమ్మీకపూర్ కి బాగా పేరు తెచ్చిన సినిమా కూడా ఇదే. కర్ణుడి కథ ఆధారంగా తమిళ్ లో ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేశారు బి.ఆర్. పంతులు.
భారీ తారాగణంతో ఎక్కడా రాజీ పడకుండా తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. శివాజీ గణేషన్ కర్ణుడుగా, ఎన్.టి.ఆర్ శ్రీ కృష్ణుడుగా నటించిన ఈ సినిమాలో భానుమతి పాత్రలో సావిత్రి నటించడం విశేషం. బాలమురళీ కృష్ణ డ్యూయట్లు పాడిన రెండు మూడు సినిమాల్లో కర్ణ ఒకటి. అందులో ‘నీవూ నేనూ వలచితిమీ’ పాట అప్పటికీ ఇప్పటికీ పెద్దహిట్ .కర్ణ తెలుగు డబ్బింగ్ వర్షన్ కు డి.వి.నరసరాజు డైలాగ్స్ రాశారు.
తెలుగు సినిమా చూసిన బి.ఆర్.పంతులు తల్లి డైలాగ్స్ బాగా వచ్చాయి. చాలా కాలం తర్వాత మంచి తెలుగు విన్నాను అన్నారట.దీంతో డి.వికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కు అదనంగా రెండు వేలు కలిపి పంపించారట పంతులుగారు. అదేంటంటే మా అమ్మ మెచ్చుకునేలా డైలాగ్స్ రాశావు గురూ అన్నారట.
ఎనభై ఏనుగులు, 400 గుర్రాలతో కురుక్షేత్ర సంగ్రామాన్ని భారీగా చిత్రీకరించారు. కృష్ణ పాత్రధారి ఎన్.టి.ఆర్ మీద చిత్రీకరించిన “భువిలో దేహమ్ము…నిలువదు నమ్మర” పాట అద్భుతం గా ఉంటుంది. శీర్గాలి గోవిందరాజన్ ఈ పాటను ఆలపించారు. బి.ఆర్.పంతులు తెలుగులోనూ రెండు మూడు స్ట్రెయిట్ సినిమాలు తీశారు. వాటిలో “పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం” ఒకటి. అందులో స్వయంగా బి.ఆర్ పంతులే ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు.
ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన “గాలి మేడలు” కూడా బి.ఆర్. పంతులు సినిమానే. పద్మినీ పిక్చర్స్ సినిమాలన్నిటికీ దాదాపు టి.జి.లింగప్పే సంగీతం అందించారు. లింగప్ప సంగీత దర్శకత్వంలో మ్యూజికల్ గా పెద్ద సక్సస్ కొట్టిన పాటలన్నీ పద్మినీ ఫిక్చర్స్ లోవే. ఎమ్.ఎస్.సోలమలై రాసిన కథ ఆధారంగా బి.ఆర్.పంతులు తీసిన సినిమా “గాలిమేడలు”. దాదా మిరాసి స్క్రీన్ ప్లే రాసిన ఈ సినిమాకు కూడా డి.వి.నరసరాజే డైలాగ్స్ రాసారు.
ఓవర్ నైట్ కోటేశ్వరుడు కావాలనే ఆశపోతు ఎస్వీరంగారావు పాత్ర చుట్టూ గాలిమేడలు కథ తిరుగుతుంది. ఎస్వీఆర్, ఎన్.టి.ఆర్, జగ్గయ్య ముగ్గురూ ఒకరికొకరు పోటీ పడి నటించిన చిత్రం గాలిమేడలు. లో “ఈ మూగచూపేలా…బావా మాట్లాడగా నేరవా”…రేణుక, ఘంటసాల యుగళగాత్రంలో సాగే డ్యూయట్ ఎవర్ గ్రీన్ హిట్.
షణ్ముగం కథతో తెరకెక్కిన బి.ఆర్. పంతులు మరో చిత్రం “పెంపుడు కూతురు”. రాముడు భీముడు కథను కాదని బి.ఆర్ పంతులు తీసిన సినిమా ఇదే. సినిమా ప్రేక్షకుల్లో ఒక అనుభూతిని నింపాలని బలంగా నమ్మే బి.ఆర్. పంతులు కథ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. ఎన్.టి.ఆర్, హరనాథ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమాలో దేవిక హరనాథ్ లవర్ గా నటించడం విశేషం.తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సుమారు 45 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన బి.ఆర్.పంతులు 1974లో కన్నుమూశారు.
ఆయన తీసిన తమిళ కర్ణన్ సినిమా రీసెంట్ గా సరికొత్త ప్రింట్స్ తో తమిళనాడులో పునర్విడుదల అయి శతదినోత్సవం జరుపుకుంది. ఆ శతదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడా. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ గర్వంగా చెప్పుకునే పేరు బి.ఆర్.పంతులు. పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే ప్రేక్షకులు చాలా గర్వంగా ధియేటర్లకు వెళ్లేవారు. భారతదేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ సినిమాలు తీసి విజయం అందుకున్న బి.ఆర్ పంతులు అసలు పేరు బి. రామకృష్ణయ్య పంతులు. అదీ విషయం.
బ్.ఆర్ పంతులు గారి ని విస్తృతంగా వ్యాసం లో చెప్పారు. ఆయన తెలుగు వారు కావటం మన అదృతం అయితే తెలుగువారు మరిచారు మీరు ఈ వ్యాసం ఆ దించటం ముదావహం. కుప్పం వారి జన్మ స్థలం ఆo టే తెలుగు వారే అంటే ఆంధ్రుడే.
కనీసం కుప్పం లో నన్నా ఆయన మెమోరియల్ పెట్టాలి.
యూ.వి.రత్నం