ఎవరీ ఆర్టిస్ట్ భరణి ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………..

భరణి …ఆకలి రాజ్యంలో శ్రీదేవి, కమల్ హసన్ లు ఓ పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటూంటారు …ఇంతలో శ్రీదేవి ముఖం సీరియస్సుగా మారిపోతుంది. ఏమయ్యిందంటాడు కమల్ హసన్ .ఎవరో ఆ చెట్టు చాటు నుంచీ మన్ని చూస్తున్నాడు … గడ్డపోడు అంటుంది శ్రీదేవి. 

అంతే కమల్ హసన్ వెళ్లి ఆ గడ్డపాణ్ణి పట్టుకుని కొట్టేస్తాడు … అప్పుడు సైగలతో చెప్తాడు … బాబూ నేను ఆర్టిస్టుని … మీ జంటను చిత్రిస్తున్నాను … మీరు అపార్ధం చేసుకుని ఆవేశపడిపోతున్నారు అని..నీ పేరేమిటని అడుగుతాడు కమల్ హసన్ …భరణి అనే చెప్తాడతను. 

నిజమే …అతని అసలు పేరు పి.భరణీకుమార్ …బాలచందర్ కంపెనీకి పోస్టర్ డిజైనింగూ గట్రా ఆర్ట్ పనులు చేసేవాడు …అంతే కాదు …సెట్స్ లో కూర్చుని తీసే సన్నివేశాల గురించి బాలచందర్ తో చర్చించేవాడు కూడా …అలా దర్శకత్వం మీద కూడా అతనికి మక్కువ ఉంది …బాలచందర్ సినిమాల టైటిల్స్ లో డిజైన్స్ భరణి అని పడుతుంది.

మరి ఆ కుర్రాడు … మన నెల్లూరి వాడు … ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మిత్రుడు .బొమ్మలు వేయుట నాటకములు చూచుట …నటించుట ఇతని కార్యక్రమములు …అలా నెమ్మదిగా కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించే అవకాశమూ వచ్చింది …ఇలా ఉండగా ఒక శుభముహూర్తాన చలో చెన్నై అనేసి … అక్కడ సినిమా పబ్లిసిటీ రంగంలో పాతుకుపోయిన కేతా సాంబమూర్తిగారితో పాటు మరికొందరి దగ్గర విద్య నేర్చుకుని,కొంత కాలం సినిమా రంగం పత్రికకు డిజైన్లు చేసి … అలా సినిమా ప్రవేశం చేశారు. 

బొమ్మలేయడం ఏ విద్యాసంస్ధలూ నేర్పవు …బొమ్మలేయడం అనేది సహజంగానే వస్తుంది …దాన్ని విద్యాసంస్ధలు పదును పెడతాయంతే …అలానే భరణీ కూడా …అయితే .. ఈయన మీద బాపు గారి ప్రభావం ఉండేదంటారు ..సినిమా పబ్లిసిటీ విభాగంలో ఈయనకి ముందుగా అవకాశం ఇచ్చింది దర్శకుడు శ్రీధర్ .ఆ తర్వాత బాలచందర్. 

సినిమా మీద అవగాహన కాస్త అధికంగానే ఉన్న భరణి ఆనందరాగం అనే తమిళ సినిమాకు దర్శకత్వమూ చేశారు.శ్రీధర్ దర్శకత్వం వహించిన అక్కినేని మనసే మందిరం సినిమాకు ఆయనే పోస్టర్ డిజైనరు. ఆకలి రాజ్యం విడుదలైన మూడు నాలుగేళ్లలోపే ఆయన చనిపోయారు.
అప్పటికి ఆయన వయసు కేవలం 48 మాత్రమే. ఆకలి రాజ్యం సినిమాలో ఆయన నటన మాత్రం అలా గుర్తుండిపోతుంది.

ఎరుపు రంగు చూపిస్తే …ఆకలి అంటాడు కమల్ హసన్… ఇనుకోరా ఇనుకోరా పాటలో  తెలుపు రంగు సత్యానిది.. నలుపు రంగు చీకటిది.. పసుపు రంగు పైత్యానిది.. ఎరుపు రంగు ఆకలిది అంటాడు శ్రీశ్రీ …అక్కడితో ఆగకుండా …కాలే ఆకలి కార్చిచ్చు … కల్లు ముంతతో చల్లార్జు అని కూడా జోడిస్తాడు. 

రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టి దాని రంగు పసుపు అన్నప్పుడు …మరి మాకున్నూ ఈ పాటే గుర్తు వచ్చింది…పసుపు రంగు పైత్యానిది అని భలే చెప్పాడ్రా శ్రీశ్రీ అని …అయితే …భరణి పాత్రను ఆకలి రాజ్యంలో కూడా అంతే డ్రమటిక్ గా ముగిస్తారు బాలచందర్ .కూటి కోసం కూలి కోసం పాట లీడ్ సన్నివేశంలో కనిపించే యాక్సిడెంట్ లో కారు కిందపడి చనిపోతాడు భరణి…

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!