ఎవరీ అడ్వకేట్ సిద్ధార్ధ లూథ్రా  ?

Sharing is Caring...

సిద్ధార్ధ లూథ్రా సుప్రీం కోర్టు న్యాయవాదిగా మంచి పేరున్న వ్యక్తి. దేశంలోని అగ్రశ్రేణి క్రిమినల్ కేసుల  న్యాయవాదుల్లో ఈయన ఒకరు. పేరుకు తగినట్టు ఫీజు కూడా భారీగానే ఉంటుంది. సింగల్ అపిరియన్సు కు  3-4 లక్షలు తీసుకుంటారని అంటారు. అంతకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన కేసు టేకప్ చేశారంటే విజయం గ్యారంటీ. అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు తరపున అమరావతి హైకోర్టులో వాదించింది ఈయనే.

2016 లో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు తరపున ఓటుకు నోటు కేసులో ఈ సిద్ధార్ధ లూథ్రా  నే వాదించారు. 2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ కి మద్దతు ఇవ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్టీఫెన్ సన్ తో మొత్తం రూ. 5 కోట్లకు డీల్ ఒకే అయింది. అందులో 50 లక్షలు ఇవ్వడానికి ముందు కొచ్చిన వీడియో సాక్ష్యం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ సందర్భంగా చంద్రబాబు, స్టీఫెన్ సన్  మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టీడీపీ అధినేతను ఇరుకున బెట్టింది.”మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ” అంటూ చంద్రబాబు చెప్పిన ఆడియో పెద్ద దుమారమే రేపింది. అయితే తన ఫోన్ ను టాప్ చేసారని అప్పట్లో చంద్రబాబు కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇదే కేసు ఇంకా విచారణలో ఉంది.

ఆ తర్వాత చంద్రబాబు మీద విచారణ జరపడం లేదని .. ఆయనను ముద్దాయిగా చేర్చి .. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీం కి వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ లో ఈ కేసు విచారణకు వచ్చింది. ఆళ్ళ తరపున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని అప్పట్లో  జస్టిస్ బాబ్డే ప్రకటించారు.

ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. కానీ కేసులో బాబును ముద్దాయిగా చేర్చలేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు.  ఈ కేసును కూడా సిద్ధార్ధ లూథ్రానే డీల్ చేస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన రెండు కేసుల్లో లూథ్రా యే అపోజిట్ పార్టీ లాయర్ కావడం విశేషం.

అసైన్డ్ భూముల కేసులో  సీబీ సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయమని బాబు తరపున క్వాష్ పిటీషన్ దాఖలు అయింది.అయితే కోర్టు ఆ పని చేయలేదు. విచారణ మొదలు పెట్టడంతో ..లూథ్రా  సమయ స్ఫూర్తి తో స్టే అడిగి నాలుగువారాల పాటు చంద్రబాబు కి స్టే ఇప్పించారు.

ఇక సిద్దార్ధ లూథ్రా గురించి చెప్పుకోవాలంటే మూడు దశాబ్దాలనుంచి ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆయన తండ్రి కూడా కె కె లూథ్రా  కూడా ప్రముఖ న్యాయవాదే. తొలుత సివిల్ కేసులు వాదించిన సిద్ధార్ధ లూథ్రా  తర్వాత కాలంలో క్రిమినల్ లాయర్ గా మారారు . స్వల్ప కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు.

2002 లో వెస్ట్ ఎండ్ స్టింగ్ ఆపరేషన్ కేసులో తెహల్కా మ్యాగజైన్ తరపున వాదించారు. అప్పటి కేంద్ర రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ ను క్రాస్ ఎగ్జామ్ చేశారు. 2012 లో భారత్ అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. 14 లో ఆ పదవికి రాజీనామా చేశారు.

ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై దివంగత మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువునష్టం కేసు ను కూడా ఈయనే వాదించారు. నిర్భయ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. ప్రస్తుతం సిద్దార్ధ లూథ్రా యే చంద్రబాబు కి లీగల్ అడ్వైజర్ గా చేస్తున్నారు.

—————K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!