ఎవరీ సారస్వత బ్రాహ్మణులు ?

Sharing is Caring...

పూదోట శౌరీలు.బోధన్ …………………………………………………………

ఈ భూమండలం మీద ఏ ప్రాణి జీవితం లో నైనా ” వలస” అనేది తప్పనిసరిగా జరిగే తంతు. పక్షులు,జంతువులు,మనుషులు జీవజాలమంతా ఎప్పటికీ ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండటం అసాధ్యం. ఆర్థిక,సామాజిక,రాజకీయ విషయాలకు అనుగుణంగా వలసలు జరుగుతుంటాయి.

నెమ్మదిగా,మార్పుల కనుగుణంగా జరిగే వలసలు జనాన్ని అంతగాబాధించవు.కానీ,హఠాత్తుగా జరిగే వలసలే మనుషుల్ని విపరీతంగా బాధిస్తాయి. ప్రాణాలను సైతం బలి గొంటాయి.ఆ విధంగా అనివార్యంగా, హఠాత్తుగా వలస పోవలసిన పరిస్థితే కొంకణియుల వలస కత.అదే ఈ “స్వప్న సారస్వతం.”

ప్రతి ఐదు తరాలకు ఒక వలస ఉంటుందనేది విజ్ఞుల మాట.నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా పూర్వీకులు 1650–1700 మధ్య కాలంలో కడప జిల్లా గండికోటలో పెమ్మసాని రాజవంశ పాలన అంతమైన తర్వాత,అతని ఆస్థానం లో సైనికాధికారులు గా,మంత్రులుగా,వివిధ పెద్ద హోదా లలో పనిచేసిన వారు పలు ప్రాంతాలకు వలసలు వెళ్లారు. 

66 ఇంటి పేర్లు గల కమ్మవారు ఇటు ప్రకాశం జిల్లా కందుకూరు మీదుగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి కొందరు, అటు మద్రాస్ ప్రాంతంలోని కిలచేరు,పన్నూరు ప్రాంతాల వైపు కొందరు వలస వెళ్లారని మా తాతలు కతలు, కథలుగా చెప్పగా విన్నాను..ఇది నేను చూడని వలస.

అయితే 1945 నుండి కొన్నేళ్ల పాటు,పల్నాడు ప్రాంతం నుండి నైజాం( నిజామాబాద్)కి మా బంధువులు వలస వెళ్ళటం నేను చూసిన వలస.అంటే 300 వందల ఏళ్లలో మావాళ్ళు ఈ విధంగా రెండుసార్లు వలస వెళ్లారు. అలా వాళ్ళు వలస వెళ్ళినపుడు పడిన కష్టాలన్నీ చెప్పగా విన్నాను,చూశాను.

అందుకే వలసల మీద వచ్చిన రచనలంటే నాకు ప్రత్యేక ఆసక్తి..నాకు నచ్చిన వలస రచన “గోపల్లె”.దీన్ని తమిళం లో కీరా గారు రాయగా నంద్యాల నారాయణరెడ్డి గారు తెలుగులోకి అనువదించారు.

ఇక విషయానికొస్తే గోమంతకం(గోవా)పోర్చుగీస్ వారి ఆక్రమణకు గురవగానే,వారిని ఎదిరించలేని స్థితిలో కొందరు మతం మార్చుకోవటానికి ఇష్టపడి పోర్చుగీస్ వారితో కలిసి పోయారు.  అలా మతం మార్చుకోవటానికి ఇష్టం లేని సుమారు 12 గోత్రాల సారస్వత బ్రాహ్మణులు వారి మాతృభూమి గోవా ని వదిలి,దక్షిణం వైపుగా ప్రయాణించి కేరళ లోని కాసరగోడ్ ప్రాంతంలోని కుంబలే కి చేరి అక్కడ నుండి “బళ్ళంబెట్టు”లో స్థిరనివాసం ఏర్పరచుకునే వరకూ సాగిన కత ఇది.

అసలు సారస్వత బ్రాహ్మణులు అంటే ఎవరు.? సరస్వతీ నదీ తీరాన నివస్తిస్తున్న కొన్ని గోత్రాల బ్రాహ్మణులను తెచ్చి దక్షిణ భారతంలోని గోమంతకం( గోవా) లో పరశురాముని చే ప్రతిష్టింపబడిన వారే ఈ సారస్వత బ్రాహ్మణులు. వారి వలస కతే ఇది.

అలా వచ్చిన ఆయా గోత్రాల వారిలో ” పై” గోత్రం వారు ఎక్కువ పేరెన్నిక గన్నారు.వారిలో 20 వ తరానికి చెందిన” “గోపాలకృష్ణ పై” కన్నడలో రాసిన నవల ఇది.కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందటమే గాక ఇప్పటికి ఆరుసార్లు పునర్ముద్రణ పొందింది.దీన్ని తెలుగులోకి అనువదించిన వారు గుత్తి చంద్రశేఖర రెడ్డి గారు.

పోర్చుగీస్ వారి అణచివేత నుండి తప్పించు కోవటానికి తమ ఆధ్యాత్మిక గురువు నాగ్డో బేతాలుని ఆజ్ఞ మేరకు రాత్రికి రాత్రే గోవా లోని మంజేశ్వర గ్రామం నుండి కట్టుబట్టలతో కొద్దిపాటి సామానుతో 44 కుటుంబాల వారు ఎద్దుల బండ్లు మీద సాగించిన యాత్ర.

దారిలో వారు అనుభవించిన కష్టాలు, పయనించే శక్తి లేక,అక్కడక్కడ ఆగి పోయి అక్కడే నివాసం ఏర్పరచుకున్న కొన్ని కుటుంబాల వారు, శారీరక,మానసిక,ఆర్థిక ఇబ్బందులు,జననాలు, మరణాలు,ప్రేమలు, తగవులు అన్నిటినీ వివరించిన కత,చరిత్ర ఇది.

విట్టు పై ఆధ్వర్యం లో గోవా లో మొదలై రామచంద్ర పై నాయకత్వంలో కేరళ లోని బళ్ళం బెట్టు లో ముగిసిన యాత్ర. 1542 లో విట్టూ పై పుట్టిన నాటి నుండి,ఐదవ తరానికి చెందిన వేంకటేశ పై పుట్టిన వరకూ ఈ కత సాగుతుంది. ఈ నవలలో పోర్చుగీస్ వారు స్వార్థపరులు, క్రూరుల్లాగా అగుపించినా, పోర్చుగీస్ వారందరూ ఒకే మనస్తత్వం కలిగి ఉండేవారు కాదు. వారి దురాగతాలే గాక,వారిలోని కొందరు ఔదార్య వంతుల గురించి కూడా రాశారు.

 మరీ ముఖ్యంగా జేవియర్ మంచి తనాన్ని,అతడు చేసే మంచి పనులు,ప్రజల పట్ల అతడు చూపించిన ప్రేమానురాగాలు,అతని బోధనలు వారి ఆధ్యాత్మిక గురువు నాగ్దో బేతాలుని ప్రశంసలు పొందాయి.. జేవియర్ వస్ర ధారణ,ఆహార్యం,అతని నడవడిక ఈ సారస్వత బ్రాహ్మణుల మన్నన పొందటమే గాక,వీరిలో కొందరు క్రైస్తవ మతం లో చేరటానికి కారణం అయింది.

ఆ జేవియర్ పార్థివ దేహామే ఇప్పుడు గోవా లోని BOM JESUS( బాల యేసు) దేవాలయం లో వున్నది. ఇంకా పోర్చుగీస్ వారైనా కొమినో మంచితనం.. విట్టు పై,పోర్చుగీస్ యువతి అల్విరా మధ్య చిగురించిన ప్రేమ, వారిద్దరి శారీరక సంబంధం..ప్రేమకు ఎల్లలు, కులమతాలు లేవని చెబుతుంది.

నాగ్డో బేతాలుని ఆన ప్రకారం సారస్వత బ్రాహ్మణులు ఎక్కడ వున్నా కొంకణి భాష లోనే మాట్లాడాలని, ఆడవారిని మామ్మా అని,మగవారిని మాయ్యే అని సంబోధించాలని,400 వందల ఏళ్ల తర్వాత వీరి 21 వ తరం వారు మాత్రమే గోవా కి వెళ్లి,తమ దేవత అయిన మహాలసా దేవి ఆలయంలో పూజలు చేయాలి.  

ఈ పుస్తకంలో వళ్ళు గగుర్పొడిచే సన్నివేశం..నాగశాపం కారణం గా అచ్చం పాము శరీరం,మనిషి తలతో జన్మించిన బాలుడు..వెచ్చగా పొయ్యి పక్కనే చుట్టచుట్టుకుని పడుకుని ఉండగా. ..  చుట్టకుదురు అనుకుని   అతని శరీరం పై తల్లి వేడి వేడి  పాలకుండ  పెడుతుంది. ఆ వెంటనే గమనించి తల్లి కుండ పైకెత్తగానే కుండతో పాటు అతని శరీరం అంటుకుని పైకి వస్తుంది. ఆ తల్లి వేదన రోదన  ఇంతా కాదు.  ఈ సన్నివేశం చదివిన కాసేపటి వరకూ నేనూ మామూలు స్థితికి రాలేకపోయాను.

పై వంశీయులు యుద్దవీరులు కాదు.తమ నాలుకనే పెట్టుబడిగా పెట్టీ పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు. ఎడారిలో ఇసుకను,సముద్రంలో నీటిని అమ్మగల చతురులు.చేపల పులుసు, కల్లు లేనిదే ముద్ద దిగని వారీ సారస్వత బ్రాహ్మణులు. వ్యవసాయం,వ్యాపారం రెండు చేతులా చేసిన వారు. తమ మాతృభూమికి  400 ఏళ్లు దాటాక గానీ తిరిగి రాకూడదని,అప్పటి వరకూ అక్కడి నీళ్ళు తాగరాదని వారి ఆధ్యాత్మిక గురువు నాగ్దో బేతాలుని శాసనం.

అదే సారస్వతులు  ఏడు తరాల తమ మాతృ భూమిని చేరుకోవాలనే తపనతో కూడిన స్వాప్నిక జీవనయానమే ఈ స్వప్న సారస్వతం. వారి ఏడు తరాల వలస చరిత్రే ఈ “స్వప్న సారస్వతం”
ఈ పుస్తకం నాకు కానుకగా పంపిన నా మిత్రులు,పుస్తక ప్రేమికుడు,రచయిత,పాడేరు డిగ్రీ కాలేజ్ ఎకనామిక్స్ లెక్చరర్ అలజంగి మురళీధర రావు గారికి మనసారా నెనరులు..ఈ పుస్తకం కావలసిన వారు “నవోదయ,కాచిగూడ నుండి తెప్పించుకోవచ్చు. పేజీలు..513. వెల..350/ రూ..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!