ఎవరీ టెంపోరావు ?ఏమిటాయన కథ ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………. 

డిటెక్టివ్ పరశురాం, డిటెక్టివ్ వాలి అనే పాత్రలతో వందలాది నవలలు రాసారు టెంపోరావు. ఇంగ్లీషు మ‌నుషుల బొమ్మ‌ల‌తో … అన్ని కాయితాల‌కీ చివ‌ర ఎర్ర ఇంకు తో పాకెట్ సైజులో … ఇలా ఉండేది అప్ప‌ట్లో డిటెక్టివ్ న‌వ‌ల ఆహార్యం. ఇంగ్లీషులో ‘టెంపో’ అనే పత్రికని స్థాపించి, అందులో కూడా తన రచనల ఆంగ్లానువాదాలు ప్రచురించే వారు టెంపోరావు.

టెంపో మిస్స‌య్యింద‌య్యా అనే మాట‌కు ఆస్కారం లేకుండా క‌థ‌ను న‌డిపించ‌డ‌మే టెంపోరావు ప్ర‌త్యేక‌త అన్న‌మాట …ఈ టెంపోరావ్ అస‌లు పేరు కూర‌పాటి రామ‌చంద్ర‌రావు..టెంపోరావు టెంపో ప‌త్రిక‌లోనే జ‌ర్న‌లిస్టు జీవితాన్ని ప్రారంభించారు. 

తెలుగు క్రైమ్ సినిమా నిర్మాత వైవి రావు. వై వి రావంటే ల‌క్ష్మిగారి ఫాద‌ర్ కాదండ‌య్య … ఎన్టీఆర్ నిప్పులాంటి మ‌నిషి నిర్మాతండి …టెంపోతో పాటు రావుగారికి ‘ఫిలిం’ అనే టైటిల్ తో ఓ సినిమా ప‌త్రిక‌, ‘ర‌తి’ పేరుతో ఆ త‌ర‌హా ప‌త్రిక కూడా ఉండేవ‌న్న‌మాట.

మ‌ద్రాసులోనే టెంపోరావుగారు కుబేరా ప్రెస్ పేరుతో ఓ ప్రింటింగ్ ప్రెస్సు కూడా నిర్వ‌హించారు. దాని బాధ్య‌త‌లు ఆయ‌న త‌మ్ముడు సుబ్బారావుగారు … ప‌త్రిక‌ల బాధ్య‌త వైవి రావు చూసుకుంటూండ‌గా … ఈయ‌న పైన అజ‌మాయిషీ అదీ చూస్తూ న‌వ‌ల‌లు రాసుకుంటూండేవార‌ని చెప్తారు.

1954లో వైవి రావు బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా డిటెక్టివ్ పేరుతో అప‌రాధ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌ల‌తో ఓ ప‌త్రిక తీసుకువ‌చ్చార‌నుకోండి …తెలుగు డిటెక్టివ్ న‌వ‌ల‌ల అభిమానుల‌కు ప్రాతఃస్మ‌ర‌ణీయుడు టెంపోరావు … అనేది మాత్రం వాస్త‌వం … చాలా సినిమా క‌థ‌ల విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌మేయం ఉండేది …టెంపోరావు త‌ర్వాత అంత‌గా డిటెక్టివ్ ముద్ర వేసిన వాడు అప్ప‌ట్లో కొమ్మూరి సాంబ‌శివ‌రావు.. ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ లో మ‌ధుబాబు అనుకోండి. 

———–

Tharjani …………

ఈ టెంపోరావు  తూర్పు గోదావరి జిల్లా, వేలంగి గ్రామంలో పుట్టారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి PG పట్టా పుచ్చుకున్నారు. మద్రాసులో స్థిరపడ్డారు. ఈయన  చిన్నతనం నుంచే కథలు  రాసేవారు.  అప్పట్లో సుప్రసిద్ధులైన  ఆంగ్ల రచయితల రచనలు అన్నీ చదివి ప్రభావితుడై తెలుగులో రచనలు చేయడం మొదలు పెట్టారు. 

ఆరోజుల్లో ఈయన డిటెక్టివ్ కథలు, నవలలు పాఠకులను బాగా ఆకట్టుకునేవి. టెంపోరావు 350కి పైగా కథలు .. నవలలు రాశారు. మహాకవి శ్రీశ్రీ  టెంపోరావుకి  “సాహితీ సామ్రాట్” అనే బిరుదును ఇచ్చారు. ఈయన సి.ఐ.డీ.రాజు, గూడుపుఠాణి తదితర  సినిమాలకు సంభాషణలు రాశారు.  

1985, జూలై 24వ తేదీన ఆయన మద్రాసులో కన్నుమూశారు. టెంపోరావు కథలు తనను బాగా ప్రభావితం చేశాయని ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి కూడా ఒక సందర్భంగా చెప్పుకున్నారు.  ఆయన స్ఫూర్తి తో డిటెక్టివ్ కథలు రాసిన వారు చాలామందే ఉన్నారు.   

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!