కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స చేసేదెవరో ?

Sharing is Caring...

వరుస ఓటములతో కుదేలు అవుతున్న తెలంగాణా కాంగ్రెస్ కు సారధ్యం వహించేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. నిజంగా అంతమంది రేసులో ఉండటం గొప్పవిషయమే. పార్టీ కోలుకుంటుందని .. పరుగులు దీస్తుందని వారంతా భావించడం మంచిదే. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ ఓటమి  తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో ఆ పదవి కోసం పోటీ మొదలయింది. పలువురు పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు.  గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. పరాజయాలు క్రుంగ దీస్తున్నాయి. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లోపార్టీ  ఘోరమైన ఓటమి చవి చూసింది. తర్వాత వచ్చిన  పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించి.. ఫరవాలేదనిపించుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మళ్ళీ చేతులు ఎత్తేసింది.  2018లో  పీసీసీ అధ్యక్షడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో విజయం సాధించినా.. ఆ తర్వాత తన రాజీనామాతో ఖాళీ అయిన అదే స్థానంలో తన సతీమణిని గెలిపించుకోలేక పోయారు. అప్పటినుంచే ఉత్తమ్ కుమార్ పీసీసీ  పీఠం నుంచి తప్పుకోవాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక.. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక..నిన్నటి గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్ ను బాగా దెబ్బతీశాయి. కారణాలు ఏవైనా పార్టీ వరుసగా ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా అంతగా పట్టించుకోలేదు.

రాహుల్ గాంధీ పార్టీ పై శ్రద్ధ చూపక పోవడం … సీనియర్లు అసమ్మతి గళం వినిపించడం వంటి అంశాల ప్రభావం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై ప్రభావం చూపింది. చూపుతోంది. ఈ క్రమంలోనే  పీసీసీ అధ్యక్ష స్థానం కోసం  రేసు మొదలైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంపై  పెదవి విరిచిన నేతలంతా ఇపుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.   ప్రస్తుతం రేసులో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు రేసులో ముందున్నారు. రేవంత్ రెడ్డి కి అడ్డం పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రేవంత్ అయితే పార్టీ ని పరుగెత్తించగలరని అనే వాళ్ళు ఉన్నారు. ఇక శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి పరస్పరం ఎవరికి అవకాశం దక్కినా కలిసి పనిచేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

వీరితో పాటు  సీనియర్ నేత వి.హనుమంతరావు .. వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు  జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంపత్ కుమార్, పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు కూడా పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకంపై డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఒక ప్రకటన వెలువడ వచ్చని అనుకుంటున్నారు. డిసెంబర్ 8వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. అందరి అభిప్రాయలు సేకరించి సోనియాకు పంపుతారు. దరిమిలా పార్టీ కొత్త అధ్యక్షుని పేరు ప్రకటించవచ్చని తెలుస్తోంది.  అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అయినప్పటికీ … అందరిని కలుపుకుపోతూ పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలి. కార్యకర్తలను జాగృతం చేయాలి. అధిష్టానం కూడా మరింత క్రియాశీలకం కావాలి. సమస్యలెన్నో ఉన్నాయి .. నాయకుడు దూకుడుగా వెళ్లకపోతే ఉన్న నేతలు కూడా దారి మళ్లే ప్రమాదం ఉంది. 

———--KNM 

ఇది కూడా చదవండి ——————  జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!