Paresh Turlapati ……………………
నేరం నాది కాదు ఆకలిది .. అదేదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది.. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది ..ఇంతకీ ఆ డైలాగ్ వెనక కవి హృదయం ఏంటంటే,నేరం జరిగింది..నేరస్థుడూ అతడే, కానీ నేరం నాది కాదు ఆకలిది అంటాడు.
నేను మంచోడ్నే.. నేరాలు చేయను ..కానీ జరిగిన నేరానికి ఆకలిదే బాధ్యత అంటాడు.. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే..
సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే ఆమె కుమారుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడని అందరికీ తెలిసిందే .. అయితే హీరో అల్లు అర్జున్ ధియేటర్ కు వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కావాలని ముందే పోలీసు వారికి లెటర్ ఇచ్చినట్టు ధియేటర్ వారు చెప్తూ ఆ లెటర్ కాపీ కూడా సరిగ్గా అల్లు అర్జున్ హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సోషల్ మీడియాలో వదిలారు… కౌంటర్ గా పోలీసులు కూడా ఓ లెటర్ కాపీ రిలీజ్ చేశారు..
హీరో అల్లు అర్జున్ కనుక ధియేటర్ వద్దకు వస్తే హెవీ క్రౌడ్ వస్తుంది కాబట్టి జనాలను కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది కావున మీ హీరోని ధియేటర్ వద్దకు రావద్దని చెప్పండి అనేది ఆ లెటర్ సారాంశం .. జరిగిన దుర్ఘటనలో తమ పాత్ర ఏమీ లేదని ఇరువైపులా చక్కటి ఎవిడెన్స్ లు పెట్టుకున్నారు..
ఈ లెటర్లు నిజమైనవే అయితే సాంకేతికంగా లీగల్ గా ఇరువైపులా తప్పు మాది కాదు మీదే అనటానికి బలమైన ఎవిడెన్స్ లు ఉన్నాయని అనుకోవాలి..సరే … లెటర్ల సంగతి అలా కాసేపు పక్కన పెడదాం.. అల్లు అర్జున్ రావడానికి గంట ముందే అభిమానులు విషయం తెలుసుకుని తండోప తండాలుగా థియేటర్ వద్ద గుమిగూడారు..
అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు విషయం అర్థమయ్యే ఉంటుంది.. వారి లెక్క ప్రకారం యెటువంటి అనుమతులు లేకుండా హీరో ధియేటర్ వద్దకు వస్తున్నాడు కాబట్టి అల్లు అర్జున్ ను ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చెయ్యొచ్చు.
నేషనల్ అవార్డు విన్నర్ ని హౌస్ అరెస్ట్ చేస్తే అగౌరవం అని ప్రతిపక్షాలు గోల చేస్తాయి అనుకుంటే అరెస్ట్ లేకుండా ఇంటి దగ్గరే అతడ్ని ఆపేయవచ్చు ..పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా యాంటిసిపేషన్ ఇంటలిజెన్స్ వింగ్ ఒకటి ఉంటుంది.. అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది..
పాలిటిక్స్ లో చూడండి … ఫలానా నాయకుడు బయటికి వస్తె అల్లర్లు జరుగుతాయి అన్న సమాచారం ఉన్నప్పుడు ఆ నాయకుడ్ని బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు..అలాగే అల్లు అర్జున్ ధియేటర్ వద్దకు వస్తె జనాల్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందని పోలీసులు ముందుగానే పసిగట్టినప్పుడు ముందు జాగ్రత్త గా ముందుగానే నష్ట నివారణ చర్యలు చేపట్టి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కదా.
ఉన్నతాధికారులు తప్పుకు పూర్తి బాధ్యత ను థియేటర్ యాజమాన్యం మీదే నెట్టకుండా ఆ రోజు బందోబస్తు ఏర్పాట్లు చూసిన స్థానిక పోలీసులను కూడా బాధ్యులుగా చేసి సస్పెండ్ చేసి ఉంటే మరింత బాగుండేది.జరిగిన దుర్ఘటన ఏదో సాదారణ విషయం అన్నట్టు ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోకపోవడం విషాదకరం..
కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చటానికి ప్రభుత్వం తరుపున ఒకరు వెళ్లుంటే బాగుండేది..అల్లు అర్జున్ ఆ కుటుంబానికి పాతిక లక్షలు సాయం ప్రకటించి ఆదుకుంటానని ప్రామిస్ చేసినట్టు వార్తల్లో చూసా… ఆర్థిక సాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా పరామర్శిస్తే మరింత బాగుండేది.
ఇక అల్లు అర్జున్ ఒక్కపూట జైలుకు వెళ్తే తండోప తండాలుగా అతడి ఇంటికి క్యూ కట్టిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఉల్లాసంగా కాఫీలు జ్యూసులు తాగి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారే.. కానీ సినిమా ఇండస్ట్రీ తరపున బాధిత కుటుంబానికి ఓదార్పు మాటలు చెప్పినవాళ్ళు ఒక్కళ్ళు లేరు.
పోయిన ప్రాణం విలువైనది…తిరిగి రాలేనిది ..ఎవరో చేసిన తప్పుకు బాబుకి తల్లి లేకుండా పోయింది .. బాబు చావుబతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దుర్ఘటనకు బాధ్యులు ఎవరు?