ఎవరీ అఘోరాలు ?

Sharing is Caring...

Lifestyle of Agoras …………………….

అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.వీరంతా శివ భక్తులు.శివ సాధువుల్లో వీరు ప్రత్యేక వర్గం అని చెప్పుకోవచ్చు.మనిషి ఆత్మను శివుడిగా నమ్ముతారు.అఘోరా అంటే ‘భయం లేని వాడు’ అంటారు. చూసే వారికి మాత్రం భయం కలుగుతుంది. వీరి వ్యవహార శైలి మామూలు ప్రపంచానికి అర్ధం కానిది.వీరినే అఘోరీ,అఘోరీ బాబా అని కూడా పిలుస్తారు.  

వీరు సాధారణంగా జన జీవనంలోకి రారు. సాధారణ ప్రజలు ఆచరించే జీవన విధానానికి వీరి జీవన శైలికి చాలా తేడా ఉంది.వారు కోరుకున్నట్టు జీవిస్తుంటారు.అఘోరాలు ఎక్కువగా ఉత్తర భారత దేశంలోనే కనిపిస్తారు.అది కూడా అరుదైన సమయాల్లోనే. వీళ్ళలో కొందరు నూరేళ్ళకు పైబడి జీవించిన వారు కూడా ఉన్నారని అంటారు.

వీళ్ళ చాలా విచిత్రంగా ఉంటారు.కొందరు దిగంబరంగా ఉంటారు.కొందరు శ్మశానంలో తిరుగుతుంటారు. ఒళ్ళంతా బూడిద రాసుకుంటారు. వీరు మానవ కపాలంలో ఆహారం స్వీకరిస్తారు. ఆహార విషయంలో కొందరికి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు. దొరకకపోతే మానుకుంటారు.పచ్చి ఆకులు తింటారు. కొందరు పచ్చి మాంసం కూడా తింటారు.

అఘోరాలు హిందువులే అయినప్పటికీ హిందూమత జీవన విధానాలకు వీరి జీవన విధానానికి తేడాలున్నాయి. సామాజిక నియమాలను వీరు అంగీకరించరు. వీరు ఎక్కువగా నగ్నంగానే తిరుగుతారు. అవసరమైనపుడు మాత్రమే చెట్టు బెరడుతో జననేంద్రియాలను కప్పుకుంటారు. కామరూప సిద్ధి కోసం వీరు కఠోర ఉపాసనలు చేస్తారు. వీరిలో కొందరికి కామరూప, పరకాయ ప్రవేశ విద్యలు కూడా వచ్చు అంటారు.

కామరూప విద్య వల్ల పలు రూపాల్లో వీరు సంచరిస్తారని అంటారు. అఘోరాలు మనకు ఎక్కువగా కనిపించరు. కుంభమేళాలు, పుష్కరాలలో మాత్రమే కనిపిస్తుంటారు. మిగిలిన రోజులలో మానవ సంచారానికి దూరంగా ఉంటారు.

ఇదివరలో శ్మశానాలలో ఉండేవారు.ఇపుడు అలా చేస్తే పోలీసులు పట్టుకెళుతున్నారు.దీంతో జనసంచారం లేని ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎక్కువగా ధ్యానంలో ఉంటూ రాత్రి సమయాల్లో తాంత్రిక పూజలు చేస్తుంటారు.

కుంభమేళా,పుష్కరాలలో ఎక్కువగా  కనిపించే వీరు ఎలా వస్తారు ? ఎలా వెళ్తారు అనేది ఖచ్చితంగా ఎవరికి తెలీదు. వీరికి సూక్ష్మయాన విద్య కూడా తెలుసని … దాని ద్వారానే అలా వచ్చి ఇలా వెళుతుంటారని అంటారు. వారికి శక్తులు ఉంటాయని చెప్పుకోవడమే తప్పించి .. నిజంగా చూసిన వారు ఎవరూ లేరు.

ఏళ్ళ తరబడి హిమాలయాల్లో.. మంచు పర్వతాల్లో ఉండటం మానవ మాత్రులకు సాధ్యం కాదు. కాబట్టి వీరికి శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు.ఈ అఘోరాలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తుంటారు.ఇక శివుణ్ణి పూజించే సాధువుల్లో పలు రకాలున్నారు. అఘోరాలు , నాగసాధువులు చూడటానికి ఒకేలా కనిపిస్తారు.

నాగ సాధువుల కంటే అఘోరాల హోదా ఎక్కువ. మరింత కఠినమైన సాధన చేస్తే నాగ సాధువు అఘోరా అవుతాడు. అఘోరాల్లో కొందరు తాంత్రిక పూజలు చేస్తుంటారు. శవాలపై కూర్చుని ధ్యానం చేస్తుంటారు. వీరు ఏం చేసినా శివుణ్ణి ప్రత్యక్షంగా చూడటం కోసమే అంటారు.

చాలామంది సాధువులు అఘోరాలు కావడానికి ప్రయత్నించి విఫలమైనారు. ఈ క్రమంలో అఘోరాల సంఖ్య తగ్గిపోయిందనే వాదన కూడా ప్రచారం లో ఉంది.దేశవ్యాప్తంగా జనవరి 2025 నాటికి దాదాపు 19,500 మంది అఘోరాలున్నట్టు అంచనా. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో జన్మించిన అఘోరీ సన్యాసి బాబా కీనారామ్, అఘోరీ శాఖకు మొదటి గురు అని నమ్ముతారు.

బాబా కీనారామ్ అఘోరీ శాఖ ప్రధాన కార్యాలయం వారణాసిలోని రవీంద్రపురిలో ఉంది. ‘బాబా కీనారం స్థల్‌’లో కీనారామ్ సమాధి అయ్యారు.దీనిని అఘోరీల పుణ్యక్షేత్రంగా భావిస్తారు.. 

అఘోరా సంప్రదాయం కొనసాగడానికి బాబా భగవాన్ రామ్‌జీ తన శిష్యులలో ఒకరైన బాబా సిద్ధార్థ్ గౌతమ్ రామ్‌ను క్రిమ్ కుండ్,అఘోరావంశానికి అధిపతిగా నియమించారు. క్రిమ్ కుండ్, పరావ్ ఆశ్రమాలు వారణాసిలో గంగా నది వద్ద ఉన్నాయి.

ఉజ్జయిని, హరిద్వార్,ప్రయాగ రాజ్, కలకత్తా కాళీఘాట్ ప్రాంతాల్లో కనిపిస్తుంటారు… అలాగే శక్తి పీఠాల్లో కూడా వీరు  సంచరిస్తుంటారు. ఇటీవల కాలంలో ‘అఘోరా’లమంటూ చెప్పుకుని తిరిగే బ్యాచ్ కూడా తయారైనారు. 

 

————–K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!