ఎవరీ హక్కానీలు ? తాలిబాన్లకు ఏమవుతారు ?

Sharing is Caring...

Suicide forces…………………………………….

హక్కానీ నెట్ వర్క్ … కాకలు తీరిన ఉగ్రవాద యువకులతో కూడిన పెద్ద సమూహం. తాలిబన్ల కు ఈ సంస్థ గుండెకాయ లాంటిది.  గత రెండు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్నోఘోరమైన .. దిగ్భ్రాంతికరమైన దాడులు చేసింది హక్కానీ నెట్‌వర్క్ కార్యకర్తలే. ఈ నెట్ వర్క్ కు నిధులు తాలిబన్లే సమకూరుస్తున్నారు. 

హక్కానీ సంస్థకు ఏటా 60 మిలియన్ డాలర్లు అందుతాయని అమెరికా ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఆఫ్ఘన్ లో, పాక్ లో ఈ సంస్థ సభ్యులు కొన్ని అక్రమ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా కూడా మరి కొన్ని వనరులు సమకూరుతాయి. 

ఎవరీ హక్కానీలు 

1980 దశకంలో సోవియట్ వ్యతిరేక జిహాద్ హీరోగా పాపులర్ అయిన జలాలుద్దీన్ హక్కానీ  పేరు మీద నే ఈ హక్కానీ నెట్ వర్క్ ఏర్పడింది. అప్పట్లో కుటుంబ సభ్యులు .. దగ్గరి బంధువులతో ఈ ఉగ్రవాద గ్రూప్ ను జలాలుద్దీన్ ఏర్పాటు చేశారు. ఇతగాడు సీఐఏ ఏజంట్ గా కూడా చేసాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత ప్రభావవంతమైన కమాండర్‌లలో జలాలుద్దీన్ ఒకరని చెబుతారు. అలాగే జలాలుద్దీన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్‌లోని తొలి తరం ఉగ్రవాద ఇస్లామిస్టులలో ఒకరని అంటారు.

పాకిస్తాన్ సహాయంతో రష్యాకు అనుకూలంగా ఉంటున్న ఆఫ్ఘన్ నేత మహమ్మద్ దౌద్ ఖాన్ సర్కార్ ను కూలదోసేందుకు జలాలుద్దీన్  పనిచేసాడు. తర్వాత కాలంలో జలాలుద్దీన్ హక్కానీ విదేశీ జిహాదీలతో ..  ఒసామా బిన్ లాడెన్‌తో సహా సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకున్నాడు.  1996 లో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్‌లతో పొత్తు పెట్టుకున్నాడు. ఇస్లామిస్ట్ పాలనలో మంత్రిగా పనిచేశాడు. 2001 లో యుఎస్ నేతృత్వంలోని ఆర్మీ దళాలు దాడులు చేసిన దరిమిలా కొన్నాళ్ళు అజ్ఞాతం లోకి వెళ్ళాడు.

అనారోగ్యం కారణాలతో జలాలుద్దీన్ హక్కానీ  2018 లో కన్నుమూసారు. ఆ తర్వాత జలాలుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ అధికారికంగా నెట్‌వర్క్ చీఫ్ అయ్యాడు. సిరాజ్ వచ్చాక అత్యంత ఆధునిక ఆయుధాలు సమకూర్చుకున్నాడు. యువతను ఎంపిక చేసుకుని శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఆత్మహుతి దళాలను కూడా సిరాజుద్దీన్ ఏర్పాటు చేసాడు. తాలిబన్ల నియంత్రణలో ఉంటూ స్వయం ప్రతిపత్తి గల నెట్ వర్క్ గా  హక్కానీ ని పరిగణిస్తారు.

హక్కానీలు తరచుగా ఆత్మాహుతి బాంబర్లను ప్రయోగిస్తారు. పక్కాగా ప్లాన్ చేసి ఆత్మాహుతి దళాలను పంపుతారు. టార్గెట్ ఫిక్స్ అయిందంటే  ఇక వెనుకడుగు వేయరు.  అక్టోబర్ 2013 లో ఆఫ్ఘనిస్తాన్ దళాలు తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 28 టన్నుల (61,500 పౌండ్లు) పేలుడు పదార్థాలను కలిగి ఉన్న హక్కానీ ట్రక్కును పట్టుకున్నారు.

పాకిస్తాన్ సైనిక సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే కథనాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. తాలిబాన్ల పోరాటాలకు హక్కానీలు బాగా ఉపయోగ పడ్డారు. అల్-ఖైదా తో సంబంధాలు ఉన్నాయని చెబుతారు. సిరాజుద్దీన్ .. ఆయన బంధువు ఖలీల్  హక్కానీ లు అమెరికా వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. 

————–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!