ఏది ఒరిజినలో ? ఏది ఫేకో ?

Sharing is Caring...

Paresh Turlapati  ………………………..

ఏది ఒరిజినలో? ఏది ఫేకో ? కనిపెట్టలేని డీప్ సీక్..Ai అయోమయపు రోజుల్లో ఉన్నాం.. కూరగాయలు కోయడానికీ.. మనుషుల గొంతులు కోయడానికి అదే కత్తి ఎలా పనికొస్తుందో ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచికీ చెడుకూ రెంటికీ అలాగే పనిచేస్తుంది… ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే .. 

ఈమధ్య HCU వెనక 400 ఎకరాల భూముల విషయంలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. ప్రోక్లైనర్లతో చెట్లు కొట్టేస్తుంటే నెమళ్ళు హాహాకారాలు చేస్తూ గాల్లో ఎగుర్తూ ఉంటాయి.. జింకలు ప్రాణభీతి తో చెల్లాచెదురు అవుతుంటాయి.. దీనికి తోడు అర్థరాత్రి నెమళ్ళ హాహాకారాలతో వీడియో కూడా రిలీజ్ అయ్యింది. 

నిజం చెప్పొద్దూ…  నెమళ్ళ ఫోటో చూడగానే ఆవేశంతో నా పిడికిళ్లు బిగుసుకున్నాయ్.. ఆర్ నారాయణ మూర్తిలా పళ్లు పటపటా కొరికి నేను సైతం నెమళ్ళ ఫోటోనొక్కటి సోషల్ మీడియాకు ఆహుతిస్తాను అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకున్నా.. ఇంతలో ” హలో పరేష్ తుర్లపాటి రెన్నిమిషాలు ఆగుతవ ” అన్న అరుపు వినబడి చూద్దును కదా…షాక్..

శోభన్ బాబు సినిమాలో రెండో శోభన్ బాబు అద్దంలో మాట్లాడినట్టు వాడెవడో రెండో పరేష్ తుర్లపాటి అద్దంలో కనిపించాడు..“ఎవడ్రా నువ్వు?” అసలే కోపంగా ఉన్న నేను ఆవేశంగా ఆర్ నారాయణ మూర్తిలా కనుబొమలు పైకెగరేస్తూ అరిచా… వాడు నవ్వాడు.. 

“చూసావా గబుక్కున అద్దంలో ఉన్న నిన్ను నువ్వే పోల్చుకోలేకపోతున్నావు.. ఇక ఫోటో చూసి ఆ నెమళ్ళు నిజమైనవే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావ్రా ?”  ఒక్క క్షణం డైలమాలో పడ్డా. అయినా బయటపడకుండా ” అయితే ఏటటా? అందరూ ఆ నెమళ్ళ ఫోటో షేర్ చేస్తున్నారు కదా.. అందుకే నేను సైతం…” అని చెప్పబోతుండగా… 

వాడు తగులుకుని ,“చూడు అజ్ఞాన్.. నువ్వు ప్రస్తుతం Ai కాలంలో ఉన్నావని మర్చిపోకు.. అద్దం కూడా అబద్దం చెప్పే రోజులు ముందు ముందు వస్తాయి.. ఏది ఒరిజినలో ఏది ఫేకో తెలియని రోజుల్లో విషయం తెలుసుకోకుండా తొందరపడి ఫోటో షేర్ చేసి చిక్కుల్లో పడకు ” హెచ్చరించాడు వాడు..

 ” ఏంటి బెదిరిస్తున్నావా ? ఆ ఫోటో ఒరిజినల్ కాదా? నెమళ్ళు అరవడం నిజం కాదా?” నా ఆవేశానికి అడ్డుకట్ట వేస్తున్న వాడిమీద ఉక్రోషంగా అరిచా.. వాడు మళ్లీ నవ్వాడు.. 
“చూడు గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అంతా మాయ.. నడిచేది నడిపించేది నేనే.. అంతటా నేనే..మీరంతా నిమిత్తమాత్రులు అన్నాడా ?” “అన్నాడు .

‘అయినా దానికీ దీనికీ ఏంటి సంబంధం?”
“ఇప్పుడు ఆ మాయ పాత్ర Ai పోషిస్తుంది.. ఇందులో నువ్వు మాత్రమే నిజం.. మిగిలినదంతా మాయ ”  వీడు నాకు ఆధ్యాత్మికత బోధిస్తున్నాడో ? అనవసరంగా భయపెడుతున్నాడో నాకు ఒక్క ముక్క అర్థం కాలే… ఆ ముక్కే వాడితో చెప్పా.. 

“ఇందులో అర్థం కావడానికి ఏముంది? నువ్వు చూసిన నెమళ్ళ ఫోటో.. హాహాకారాల వీడియో Ai సృష్టి బాసూ”  “ఓహో అలానా? అయితే బుల్ డోజర్లు చెట్లు కొట్టడం కూడా Ai గారి పనేనా?” వెటకారంగా అడిగా.. “ఇప్పుడు అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడం ఎంత నిజమో అక్కడ చెట్లు నరకడం కూడా అంతే నిజం “

“మరి అది తప్పే కదా?”
“తప్పే.. అటవీ ప్రాంతంలో చెట్లను నరికి HCU నిర్మించడం తప్పు అయితే ఇది కూడా ముమ్మాటికీ తప్పే ” ఒక్క క్షణం ఉలిక్కిపడ్డా… వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… వీడు నన్ను కన్ఫ్యూజ్ చేసి డైలమాలో పడేస్తున్నాడు.. వీడి ట్రాప్ లో పడకూడదు.. 

ఈలోపు వాడే అందుకుని ” అంతెందుకు ఇప్పుడు ఆంధ్రా వాళ్ళు మొత్తం సెటిల్ అయిన కూకట్పల్లి ఒకప్పుడు అటవీ ప్రాంతమే కదా? మరి ఇప్పుడు ఎంతమందికో ఆవాసం అయ్యింది కదా? ఇదంతా ఎలా అయ్యిందంటావ్ ? అది తప్పు అయితే ఇదీ తప్పే?” ఇంకో బాంబు పేల్చాడు. 

“ఈ మధ్య కాలంలో రైతులు వ్యవసాయం చేసి తిండి గింజలు పండించిన 30 వేల ఎకరాల్లో అధ్బుతమైన అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారు కదా? అది తప్పు అయితే ఇదీ తప్పే?”

“అలా అయితే దేశంలో ఉన్న పొలాలను అటవీ ప్రాంతాలను ఆక్రమించుకుని అభివృద్ధి పేరిట నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ అంటావా? అప్పుడు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినదూ ?”

“కరెక్ట్ కాదు. దేశంలో మొత్తంగా అటవీ విస్తీర్ణం ఎంత? అందులో అభివృద్ధి కోసం వాడుకుంటున్న విస్తీర్ణం ఎంత అనేది లెక్కలు కట్టాలి? వందేళ్ల క్రితం ఉన్న లెక్కలు ఇప్పుడు సరిపోవు..పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజ వనరుల వాడకం కూడా పెరుగుతుంది..

అయితే 100 లో ఒక శాతం అభివృద్ధికి వాడుకుంటే పర్యావరణ సమతుల్యం పెద్దగా పాడవదు.. అదే 99 శాతం అటవీ భూములు చదును చేస్తే ఖచ్చితంగా డ్యామేజీ జరుగుతుంది.. శాతాలు షుమారుగా చెప్తున్నా..పర్యావరణానికి అనుగుణంగా లెక్కలు వేసుకోవాలి..అంతేకాదు అటవీ భూములను అభివృద్ధికి వాడుకునేటప్పుడు వన్య ప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే పనులు మొదలు పెట్టాలి “

“సరే మరి ప్రభుత్వం ఆ భూములను చదును చేసి వేలం వేస్తుందటగా? అది కరెక్ట్ ఏనా?”
“నీకు వ్యవసాయ భూమి ఉందనుకో.. అవసరానికి డబ్బులు కావాల్సి వస్తే కొంత అమ్మి సొమ్ము చేసుకోవడం కరెక్ట్ అయితే ప్రభుత్వం చేస్తుంది కూడా కరెక్ట్ అవుతుంది.. అయినా ఒకవేళ ప్రభుత్వ చర్య పర్యావరణానికి విఘాతం కలిగించేలా ఉంటే జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం.. గ్రీన్ ట్రిబ్యునల్.. న్యాయస్థానాలు ఉన్నాయి.. ఆ సంగతి వాళ్ళు చూసుకుంటారు “

“అవన్నీ జరిగే పనేనా? అయినా అదంతా వ్యాపార ధోరణి.. ఫక్తు కమిషన్ల కోసమని అందరికీ తెలుసులే ” రెట్టించి వెటకారంగా అన్నా .. “వేలంలో తప్పులుంటే న్యాయస్థానాలకు పోవచ్చు కదా ?”

“సర్లే మాకు టైం లేదు కానీ బాధ్యత కలిగిన పౌరుడిగా ఇప్పుడేం చెయ్యాలంటావ్?”
“ముందు ఫేక్ ఫోటోలు..వీడియోలు షేర్ చేయడం ఆపి భూముల వేలంలో అవకతవకలు ఉంటే బాధ్యత కల పౌరుడిగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించు.. ఆఖరిగా ఒక మాట?” అంటూ ఆగాడు వాడు. “ఏంటి?” క్యూరియాసిటీగా అడిగా.. 

“రాజకీయాలు ఎలా ఉంటాయంటే..గత ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల కోసం అటవీ భూములు..పొలాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఇప్పటి అధికార పక్షం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో రైతుల తరపున ధర్నాలు చేసింది.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రతిపక్షం అదే పని చేస్తూంటే అప్పటి అధికార పక్షం, ఇప్పటి ప్రతిపక్షం అయిన పార్టీ ధర్నాలు చేస్తుంది..

ఇంకో విషయం సోషల్ మీడియాని రాజకీయ నాయకులు వాడినంతగా ఎవరూ వాడరు.. తొందరపడి వారి ఉచ్చులో చిక్కుకోవద్దు.. వాళ్ళు బానే ఉంటారు ఆనక ఇబ్బందులు పడేది మీరే “అని చెప్పి బుడుంగున మాయం అయ్యాడు.. 

వాడి గీత బోధతో ఆలోచనలో పడి ఫోటో షేర్ చేయలేదు.. రెండ్రోజుల తర్వాత పేపర్లో ఓ ప్రకటన వచ్చింది.. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ఫోటోలు వీడియో షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా హైకోర్టులో పిటిషన్ వేసింది..

 సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు షేర్ చేసిన వారి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటికే పోలీసులు కొంతమందికి నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు.. ఈ వార్త చూడగానే వాడికి థాంక్స్ చెప్దామని గబగబా పరిగెత్తుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళా..  వాడేం మాట్లాడలేదు.. చిన్నగా నవ్వి మాయం అయిపోయాడు!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!