అది మైనస్సైనా.. ప్లస్సైనా.. కానీ లెక్కమాత్రం పక్కా!

Sharing is Caring...

రమణ కొంటికర్ల …………………………………………………….

నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది అంటాడు ఓ తెలుగుహీరో. తిక్కకు లెక్కుందో, లేదో.. ఉంటే ఆ కొంచెమెంతో పరిమాణం చెప్పకుండానే ప్రేక్షకులను మెప్పించేందుకు పడే ప్రాసల తాపత్రయమది. సరే ఆ డైలాగ్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ప్రతీదానికీ ఓ లెక్క మాత్రముంటది. ఓ రోడ్డు వేయాలన్నా ఎంత వైశ్యాల్యంతో… ఎన్ని ఫీట్లు… ఎన్ని కిలోమీటర్లు… ఎంతవుతుంది..?

ఓ ఇల్లు కట్టాలన్నా  ఎన్ని చదరపు గజాలు… కట్టిందానికి గజం చొప్పున  ఛార్జ్ చేయడమా.. లేక, గంపగుత్తగా మాట్లాడటమా…?  ఓ ప్రాజెక్ట్ కు భూసేకరణ చేయాలంటే ఎంత మంది రైతులకు నష్టం వాటిల్లుతుంది… ఎన్ని ఎకరాలు కోల్పోనున్నారు… ఎంత పరిహారమందించాల్సి ఉంటుంది… పరిహారంతో సరిపెట్టేదా…

ఆర్ అండ్ ఆర్ కింద పునరావాస ప్యాకేజీ అమలు చేసేదా…?  చేసే ఉద్యోగాన్ని బట్టి నెల జీతమెంత… ఏడాది ప్యాకేజెంత…? చదువుకునే స్కూల్, కాలేజీని బట్టి ఒకేసారి మొత్తం ఫీజు కట్టేస్తే ఎంత డిస్కౌంటూ… లేకపోతే విడతలు విడతలుగా కడితే ఎంతవుతుంది…?  ఓ కారో, ఇల్లో   మన దగ్గరున్న డబ్బులతో కొంటే ఎంతవుతుంది…

ఈఎంఐల వారీగా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ ల లోన్ల సాయంతో కొంటే అయ్యే మిత్తీ ఎంత…?  ఇదిగో ఇలా చెప్పుకుంటూ పోతే… జీవితంలో మనిషి పుట్టక నుంచి చావు వరకూ ప్రతీదీ లెక్కే. అందుకే లెక్కకూ ఓరోజు పెట్టారు మన మానవులు.

ఓ తండ్రీ, ఓ తల్లీ, ఓ కొడుకు… మొత్తంగా ఓ ఆదర్శ కుటుంబం. కొడుక్కి పెళ్లీడు వచ్చింది… పెళ్లి చేసేశారు. కోడలు వచ్చేసింది. ఇంకేం A+B+C గా ప్లస్సుల్లో మాత్రమే లెక్కించుకునే ఆ కుటుంబం ఇక అప్పుడు A+B+C  హోల్డ్ స్కైర్ గా మారి మల్టీపుల్ అవ్వొచ్చు. అలా ఓ ఆదర్శ కుటుంబం..

స్క్వైర్ నుంచి క్యూబ్ కూ.. పెరిగి పెరిగి అంతకుమించి విస్తరించే వటవృక్షమై ఓ ఉమ్మడి కుటుంబంలా మారొచ్చు.   వచ్చే కోడలు ఒకవేళ గడుసుదై… అత్త నేచరూ అలాంటిదే అయితే మాత్రం ఉన్న చిన్ని ఆదర్శ కుటుంబం కూడా కలహాలతో డివె’డెడ్’ బై అయిపోనూ వచ్చూ! ఎలా అయినా లెక్క మాత్రం పక్కా!!

ఓ వ్యక్తి జీవితంలోగానీ… ఓ కుటుంబంలోగానీ… మొత్తంగా ఓ రాజ్యంలోగానీ… ఏం చేస్తే ప్లస్సు… ఏం చేస్తే మైనస్సనే లెక్క తప్పనిసరి. ఆ లెక్క తప్పిందాన్ని బట్టి… ఆర్థికంగాగానీ, సామాజికంగాగానీ మనమెదిగిన స్థానం నుంచి 0 అనే న్యూట్రల్ స్థాయికీ రావొచ్చూ… లేదంటే లెక్క భారీగా తప్పితే మైనసుల్లోకి వెళ్లొచ్చు. కానీ ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే ఆ లెక్క అమాంతం ప్లస్సులై… మల్టీ’ఫుల్’ ఐపోవచ్చు.

ఎవరికెంత అని డివెడెడ్ బై చేసుకున్నా… తరగని ప్లస్సులనందించి గోల్డెన్ హ్యాండనే పేరూ తీసుకురావచ్చూ! లేదంటే ఎంత జాగర్తపడ్డా… సాడే సాత్ రివర్సుదన్ని.. మైనస్సులు వ్యక్తులనైనా.. కుటుంబాలనైనా.. రాజ్యాన్నైనా ఉనికికే ముప్పు తెచ్చే ప్రమాదాల్ని తీసుకురావచ్చునూ!  ఏదేమైనా లెక్క మాత్రం తప్పనిసరి. అందుకే గణాంకాల దినోత్సవ శుభాకాంక్షలనే విషయాన్ని మర్చిపోయామనే లెక్క తప్పకుండా చెప్పే ప్రయత్నమే ఇది.

అసలీ గణాంకాల అభివృద్ది చేసిందెవరూ… అసలెలా ఇది పుట్టుకొచ్చిందనే లెక్కలు కావాలనుకుంటున్నారా…?  ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని భారత్ జరుపుకుంటుందన్న విషయంతో పాటే.. ఏ లెక్కలైనా… ఏ చిక్కులైనా.. చక్కగా తీర్చే వికీపీడియానే మన సర్వలెక్కల క్వొశ్చన్ బ్యాంక్ గా ఎలాగూ ఉండనే ఉండె!! జీవితమంతా లెక్క పక్కానే. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!