Vmrg Suresh………………….
కలదారి వంతెన నిజంగా వుందా, లేక కల్పనా అని చాలామంది మిత్రులు నన్నడుగుతుంటారు. నిజంగానే వుంది. 1995 వరకూ వుండేది. దొరబావి వంతెనగా ప్రసిద్ధం. గిద్దలూరు, నంద్యాల పట్టణాల మధ్య వుండేది. ఇప్పుడు లేదు.
మన ఘనత వహించిన ప్రభుత్వాల్లో ఒకటి ఆ వంతెనను విప్పదీయించి తుక్కు సామాను కింద ఒక కంపెనీకి కొన్ని లక్షలకు అమ్మేసింది. ప్రస్తుతం మొండి రాతిగోడలు మాత్రమే కనిపిస్తాయి. అవి రాతివి కాబట్టి బతికిపోయాయి. అవే ఉక్కువైవుండుంటే ఎన్ని వందల అడుగులైనా తవ్వుకుని వెళ్లి అమ్మేసుకునేవాళ్లు. సందేహం లేదు.
ఆ వంతెనను మీరు చూడాలంటే వెంకటేష్ హీరోగా చేసిన ‘క్షణక్షణం’, ‘బొబ్బిలిరాజా’ సినిమాలు చూడొచ్చు. హీరో కృష్ణ పాత సినిమా ‘దొంగలవేట’లో చూడొచ్చు. ఇంకా కొన్ని హిందీ సినిమాల్లో కూడా చూడొచ్చు. ‘తేజాబ్’ సినిమాలో ఒక పాటను ఈ వంతెన మీద తీశారు. సినిమాలో కనిపించలేదు.
అలా పాత ఇనుము కింద దానిని కొనుక్కున్న కంపెనీ ఆ ఉక్కును ఏం చేసిందో మీకు తెలుసా? ఆశ్చర్యపోకండి. ఏ బ్రిటిష్ ప్రభుత్వమైతే ఈ వంతెనను నిర్మించిందో అదే బ్రిటన్ దేశానికి స్పేర్ పార్ట్స్‌గా వెళ్లిపోయింది. దాని స్ప్రింగ్ టెక్నాలజీ ఇవ్వాళ్టికీ బ్రహ్మండంగా పనిచేస్తోంది. 2000 మిలినియం సంవత్సరం సందర్భంగా బ్రిటన్ నిర్మించిన మిలెనియం బ్రిడ్జిలో ఈ స్పేర్ పార్ట్స్ భాగమైపోయాయి. సరికొత్త పోకడలతో కింద ఇమేజ్‌లో మీరు చూస్తున్న వంతెనగా మారిపోయింది.
మనకు ఇవ్వాళ్టికీ ఉపయోగపడుతూనేవుంది. ధవళేశ్వరం వంతెనను స్థానికులు కాపాడుకోగలిగారు. నోరూ వాయా లేని చెంచులు ఏం పోరాడగలరు? గొప్ప అస్థిత్వానికి చిహ్నంగా మారాల్సిన వంతెన ఇలా మొండిగోడల మధ్య అదృశ్యమైపోయింది. ఒక కన్నీటి చుక్క విడుద్దాం ఆ వంతెన కిందున్న గుబురైన అడవి లోయ మీద.
పీవీ నరసింహారావును ఎంపీగా గెలిపించుకుని, దేశ ప్రధానమంత్రిని చేయటంలో నంద్యాలదే పాత్ర. మన తెలుగువాడు దేశ ప్రధాని కావటానికి అవకాశమొస్తే మనం పోటీ పెట్టటమా, ఠాఠ్ అని ఎన్‌టీఆర్ గర్వంగా చెప్పుకున్న నంద్యాల ఇదే. పీవీ హయం లోనే దేశమంతా బ్రాడ్‌గేజ్ రైల్వే ట్రాక్ మాత్రమే వుండాలనే నిర్ణయం జరిగింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ అభివృద్ధిలో భాగంగా ఈ వంతెనకు కాలదొషం పట్టేసింది.
వంతెన తాజా రూపాన్నిఇమేజ్‌గా చూడాలని ఉన్నా….దాని కథను చదవాలనిపించినా ఈకింది లింక్ పై క్లిక్ చేయండి.. చూడండి. ఈ పేజీలో కూడా బ్రిటన్ ఇది తమ సొంత తయారీ అనే చెప్పుకుంది.

