ఎక్కడిదీ “హమాస్” ? దాని లక్ష్యమేంటి ?

Sharing is Caring...

Destruction vs liberation………………….

ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య గత ఏడాది రగిలిన వివాదం ఇంకా చల్లారలేదు. కొద్దీ రోజుల క్రితం ఇజ్రాయెల్  చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 40 వేల పైమాటే. అత్యధిక దాడులు పాలస్తీనా భూభాగంపై, ప్రత్యేకంగా గాజా స్ట్రిప్‌పై జరిగాయి.

ఈ నరమేధంలో  హమాస్ కమాండర్ ఫువాద్ షుక్ర్,  హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే ప్రాణాలు కోల్పోయారు.తాజాగా సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్ ని కూడా ఇజ్రాయెల్ సైనిక దళాలు మట్టుబెట్టాయి.  గత ఏడాది హమాస్ దాడులతో షాక్ తిన్న ఇజ్రాయెల్ ఎలాగైనా హమాస్ ను తుదముట్టించే లక్ష్యంతో గాజాపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.

ఈ రెండు దేశాల మధ్య వైరం గత 100 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. హమాస్ పాలస్తీనాలో అత్యంత శక్తివంతమైన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం హమాస్ పాలస్తీనాలో అత్యంత శక్తివంతమైన ఉగ్రవాద సంస్థగా కొనసాగుతోంది. ఇది పాలస్తీనాలోని ఇస్లామిక్ సంస్థలలో అతిపెద్దది, ఈ సంస్థ పూర్తిపేరు  “హరాకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా”  అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్.

1980లో షేక్ అహ్మద్ యాసిన్ దీనిని స్థాపించాడు.  ఇజ్రాయెల్‌పై తిరుగుబాటు చేయడానికి దీన్ని స్థాపించారు.  1988లో పాలస్తీనా విముక్తి కోసం హమాస్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.ఈ క్రమంలో హమాస్ ఇజ్రాయెల్‌పై ఇప్పటివరకు అనేకసార్లు దాడి చేసింది. ఇందులో అనేక ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. 

 1970  చివర్లో   ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్‌హుడ్‌ తో కలసి హమాస్ కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు, క్లినిక్‌లు, పాఠశాలల నెట్‌వర్క్‌ను స్థాపించారు.  1967 లో  జరిగిన ఆరు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్  గాజా స్ట్రిప్.. వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించిన దరిమిలా  హమాస్ కార్యకర్తలు  చురుకుగా మారారు.

ఈ ప్రాంతాల్లో ముస్లిం బ్రదర్‌హుడ్ కార్యకలాపాలు సాధారణంగా అహింసాత్మకమైనవి, అయితే ఆక్రమిత భూభాగాల్లోని అనేక చిన్న సమూహాలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జిహాద్ లేదా పవిత్ర యుద్ధానికి పిలుపునివ్వడం ప్రారంభించాయి.2006లో గాజాలో తిరుగుబాటు చేసి 2007లో గాజాను పూర్తిగా ఆక్రమించిందంటే హమాస్ ఎంత శక్తివంతమైనదో అంచనా వేయవచ్చు.

ప్రస్తుతం గాజా స్ట్రిప్ హమాస్ ఆధీనంలో ఉంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసింది ఇక్కడి నుంచే. ఇజ్రాయెల్ దీనిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే హమాస్‌ కార్యకలాపాలను బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇరాన్, నార్వే, ఖతార్, రష్యాతో సహా అనేక దేశాలు సమర్ధించడం విశేషం. ఈ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించకపోవడం విశేషం.

హమాస్ – ఇజ్రాయెల్ మధ్య అనేక సార్లు యుద్ధాలు జరిగాయి. 2014లో జరిగిన యుద్ధంలో రెండు వేల మందికి పైగా పాలస్తీనియన్లు, దాదాపు 80 మంది ఇజ్రాయెలీయులు మరణించారు. ఈ యుద్ధం 50 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత 2021లో అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ సైన్యం – హమాస్ మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు.

హమాస్ ఆయుధాగారం చాలా పెద్దది, ఇందులో రాకెట్లు, మోర్టార్లు తదితర అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇస్మాయిల్ హనియెహ్ వంటి రాజకీయ నాయకులు  హమాస్ దిశను నిర్దేశిస్తుంటారు.  
పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ) మరొక బలమైన పాలస్తీనా ఉగ్ర సంస్థ. హమాస్ తో పోలిస్తే ఇది చిన్నదే. ఈ రెండు గ్రూపులు పరస్పర సహకారాన్ని కలిగి ఉన్నప్పటికీ, రెండింటి మధ్య అంతర్గత విభేదాలున్నాయి.

గాజాలోకి దిగుమతి చేసుకునే ఈజిప్టు వస్తువులపై వచ్చే పన్నుల నుండి హమాస్ నెలకు $12 మిలియన్ల వరకు వసూలు చేస్తుంది. ఇరాన్ హమాస్ కి  నిధులు, ఆయుధాలు అందిస్తూ  కార్యకర్తలకు శిక్షణ ఇస్తోంది ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య 13 యేళ్లలో నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి. 2008-09, 2012, 2014, 2021లో రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.

యుద్ధం కారణంగా పాలస్తీనియన్ల వివాదం మరింత పెరుగుతోంది.  ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యలు లు ఓ కొలిక్కి వస్తేకానీ శాంతి నెలకొనదు.  రెండు-రాష్ట్రాల పరిష్కారం, ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్‌లు, జెరూసలేం స్థితి ..శరణార్థులు తదితర అంశాలు ఈ వివాదానికి మూలం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!