జాకబ్ నోట ఏ పాట అయినా మధురమే !

Sharing is Caring...

Taadi Prakash………………………………………

కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో చిరుద్యోగి. గోదావరిఖని లో భార్యా ముగ్గురు బిడ్డలతో జీవితం. జాకబ్ గొంతు ప్రత్యేకమైనది. అతనొక కదంబం. తెలుగు, హిందీ, ఉర్దూల్లో చాలా పాటలు పాడతాడు. గజల్స్ పాడటం జాకబ్ core strength.

ఒక్క చాయ్ తాగి ఒక్క సిగరెట్ దమ్ము పీల్చాడంటే, కుర్చీలో వెనక్కి జరిగి, శ్రుతి చెక్ చేసి రాగం తీస్తాడు. వాడూ వీడూ కాదు, ఏకంగా మెహదీ హసనే మన మధ్యకి నడిచి వచ్చేస్తాడు.. రంజిషీ సహీ దిల్ హి దుఖానేకెలియే ఆ.. అంటూ … వీడు గాయకుడా, మెహదీ హసన్ మధుపాత్రని దొంగిలించి సేవించి వచ్చాడా? అనిపిస్తుంది.దాంతో ఒక హైలో ఉంటామా … అంతలోనే జగ్జీత్ సింగ్ గజల్ని గుండెల్లో నింపుతాడు. మరపుడు గులాం అలీ లేకపోతే ఎలా. డన్. ఇక సురేష్ వాడ్కర్ వంతు. అలా మీనాకుమారి పాదాల మీద గోరింటాకులా పండుతుంది పార్టీ. నల్లగా నాజూగ్గా అందంగా వుంటాడు జాకబ్. సాదాసీదా మనిషి. సాధారణమైన మధ్యతరగతి బతుకు. ఆ గొంతు ఒక్కటే అసాధారణం.

He is a class part, a cut above the rest అంటామా అలా. రాత్రిపూట వెన్నెల్లో విరబూసిన మల్లె తోటల్లో తిరుగాడుతూ పరిమళాన్ని పట్టుకోడానికి చేసే ప్రయత్నం లా వుంటుంది జాకబ్ గానం. లెజెండరీ విఠల్ రావే జాకబ్ పాట విని హార్మోనియం తో శ్రుతి కలిపారు. సీపీఐ ప్రజానాట్య మండలికి సాంస్కృతిక నాయకుడు జాకబ్. ఉద్యమాల కి, ఊరేగింపులకీ అర్జెంట్ పాటలు రాస్తాడు. టీమ్ తో పాడిస్తాడు. తెలంగాణా పాటలూ, చీటికి మాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురో రొయ్యో కొయ్యోడా … లాంటి జనపదాలూ పాడతాడు. నాకవి పట్టవు. గజల్ గనక ఎత్తుకున్నాడా చచ్చి సున్నం అయిపోతాం. ఏ పని మీద హైదరాబాద్ వచ్చినా మోహన్ దగ్గరికి మిత్రులు, మంచి గాయకులు అంజయ్య, స్వామి, లక్ష్మీనారాయణల్ని వెంటేసుకొచ్చే వాడు. తెలంగాణా మట్టి గొంతుకతో పాడి వాళ్ళు ఎర్రని దుమ్ము రేపేస్తారు. అలా చాలా సాయంకాలాలు హంసధ్వని, మాల్కొంస్ … ఇంకా ఎలాంటి మాయా మాళవ గౌళ రాగమైనా జాకబ్ గొంతులో గారాలు పోతుంది.

” దోపహర్ కీ ధూప్ మే – మేరే బులానేకే లియే .. నంగే పావో ఆనా యాద్ హై .. అని గులాం అలీ లా హొయలు పోతున్నప్పుడు ఆ గొంతు లోని కళా నైపుణ్య విన్యాస మాధుర్యాన్ని అనుభవించి తీరాలి. మగ్దూం మొహియుద్దీన్ గేయం ఆజ్ కీ రాత్ నజా … లేదా ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్ … పాడినా – మంకెన పూల లాంటి కలల సీతాకోకలు వచ్చి పలకరిస్తాయి. జాకబ్ కోసం మోహన్ గోదావరిఖని వెళ్ళేవాడు. వాళ్ళ స్నేహం 40 ఏళ్లకు పైగా నడిచింది.ఇద్దరు మగాళ్లు ఎలా ప్రేమించుకుంటారు?
వన్ బై టూ చాయ్ తాగి, ఒకే సిగరెట్టు ఇద్దరూ కాల్చి, జాకబ్ పాడుతూ … వింటూ, అతను బొమ్మ వేసుకుంటూ …నేనే నీ మోహన గానానికి తానం .. నీవే నా కోమల కవనానికి ప్రాణం అని నీవన్నది విన్నానూ … one song wonder సునందా శాస్త్రి పాడిన ‘ చివరికి మిగిలేది ‘ పాటలాగా .. వొక చిత్రకారుడూ … ఒక గాయకుడూ … అలాంటి పాటల కెరటాల మీదే కాలం కరిగిపోయింది. మోహన్ వెళ్ళిపోయాడు. జాకబ్ కన్నీళ్లని తుడిచేవారెవరూ లేరు. జాకబ్ మాత్రం పాడుతూనే వున్నాడు. వినిపిస్తోందా?  ” యే దిల్ అభీ భరా నహీ “

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!