సుదర్శన్ టి …………………..
అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం.
సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమిగా మనకు తెలుసు. దాని ప్రాముఖ్యత ఏమిటో ఓ రెండు మాటల్లో…సియాచిన్ గ్లేసియర్ భారతదేశ ఆగ్నేయ మూలలో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న 76 కిమీల పొడవున్న హిమ పర్వతాల సమూహం.
ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను చైనాను వేరు చేస్తుంది. దీని మీద, ముఖ్యంగా సల్టారో రిడ్జ్ మీద కూచుని ఇటు చైనా అటు పాక్ బోర్డర్లో ఏమి జరుగుతోందో స్పష్టంగా చూడొచ్చు. మన లేహ్ లడ్డాక్ ప్రాంతాలను కాపాడుకోవాలన్నా, పాక్ చైనాలు కలవకుండా నిలువరించాలన్నా ఈ గ్లేసియర్ మీద ఆధిపత్యం ఉండాలి.
ఇంతటి ముఖ్యమైన సియాచిన్ భారత్ కిందకు ఎలా వచ్చింది?
అది 1984….పాకిస్తాన్ కి సియాచిన్ ప్రాముఖ్యత ఏమిటో తెలిసి దాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని యోచించింది.యూరోప్ నుండి mountaineers ను పిలిపించి సియాచిన్ ప్రాంతంలోకి వాళ్ళను ఆహ్వానించింది. అలా అంతర్జాతీయంగా సియాచిన్ తమదనే సంకేతం ఇచ్చింది. భారత్ కు సియాచిన్ మీద ఆధిపత్యం తుపాకులు, యుద్ధ విమానాల వల్ల రాలేదు. జాగ్రత్తగా వినడం వల్ల వచ్చింది!!!
మన గూఢచార సంస్థ RAW పాక్ యూరోప్ దేశాలతో చేసుకున్న ఓ వాణిజ్య ఒప్పందాన్ని డీకోడ్ చేసింది. పాక్ కొన్ని వందల mountain snow suits కోసం ఆర్డర్ పెట్టింది.
వెంటనే ఆపరేషన్ మేఘదూత్ అని మిలిటరీ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ప్రపంచంలో ఎవ్వరి కంటికి కనబడకుండా, తెలీకుండా తన ఆర్మీలో mountaineering unit ను ముందుకు కదల్చింది. జాగ్రత్తగా ఒక్కో అడుగూ వేసుకుంటూ ఈ సైనికులు 76 కిలోమీటర్ల సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలోని ప్రతి కొండ, ప్రతి గుట్ట, ప్రతి లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
మొత్తం గ్లేసియర్ ను తమ అధీనంలోకి తీసుకున్నారు. మొదటి పాక్ హెలికాప్టర్ వచ్చేటప్పటికీ మొత్తం గ్లేసియర్ లో మన సైనికుల పోస్టులు వెలిశాయి. అలా మొత్తం గ్లేసియర్ మన అధీనంలోకి వచ్చింది. ఆపరేషన్ మేఘదూత్ గురించి తర్వాత తెలుసుకున్న ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టాయి.
అప్పటి నుండి ఇప్పటికీ అక్కడ తుపాకీ పేలని రోజు లేదు, ఇరువైపుల సైనికుల రక్తం చిందని రోజు లేదు కానీ ఇప్పటికీ గ్లేసియర్ మీద పూర్తి ఆధిపత్యం ఎవరిది అంటే అది ఖచ్చితంగా భారత్ దే!! ఈ సర్జికల్ స్ట్రైక్ లో తుపాకీ పేలలేదు, ఎవ్వరూ ఊహించక ముందే ముందుకు కదలడం వల్ల సాధ్యమయ్యింది.

